సోముకు పొగ..పెడుతున్నదెవరు?
రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి. అంటారు పొలిటికల్ పండితులు! ఇప్పుడు ఏపీ బీజేపీలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఏపీలో బీజేపీకి పట్టు లేకపోయినా.. [more]
;
రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి. అంటారు పొలిటికల్ పండితులు! ఇప్పుడు ఏపీ బీజేపీలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఏపీలో బీజేపీకి పట్టు లేకపోయినా.. [more]
రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి. అంటారు పొలిటికల్ పండితులు! ఇప్పుడు ఏపీ బీజేపీలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఏపీలో బీజేపీకి పట్టు లేకపోయినా.. నాయకులు మాత్రం ఉన్నారు. అయితే, వీరిలో వీరే వివిధ అంశాలపై ఒకరంటే ఒకరికి పడక తన్నుకుంటున్న పరిస్థితి తెరమీదికి వస్తోంది. కీలక నాయకులే కేంద్రంగా రాజకీయ రగడ చోటు చేసుకుంటోంది. ఇలాంటి వారిలో ప్రముఖం గా వినిపిస్తున్న పేరు సోము వీర్రాజు. ప్రస్తుతం ఆయన బీజేపీ ఎమ్మెల్సీ.
వచ్చే ఎన్నికల నాటికి…..
గతంలో బీజేపీ-టీడీపీ మిత్రపక్షంగా ఉన్న సమయంలో ఆయనకు ఈ పదవి దక్కింది. అయితే, ఇప్పుడు సోము వీర్రాజు కేంద్రంగా అంతర్గత పోరు తీవ్రంగానే సాగుతోంది. రాష్ట్రంలో ఎదగాలని,. కుదిరితే.. వచ్చే 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడం లేదా ప్రధాన ప్రతిపక్షంగా ఉండడం అనే లక్ష్యాలను నిర్దేశించుకున్న కేంద్రంలోని కమల నాథులు ఆ నేపథ్యంలోనే ఏపీలో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. అయితే, ఎదగాలనుకున్న కమల నాథులు అనుసరిస్తున్న విధానాల్లో కీలకమైంది.. ఇతర పార్టీల నుంచి కీలక నాయకులను వర్గాలను తమ పార్టీలోకి తీసుకు రావడం. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి నాయకులను వలవేసి పట్టుకునే ప్రయత్నాలు చేసింది.
సామాజిక వర్గాల వారీగా….
అయితే, ప్రస్తుతం రాష్ట్రంలోమూడు సామాజిక వర్గాలే రాజకీయాల్లో కీలకంగా ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం మొత్తంగా కాకపోయినా 90 శాతం వైసీపీకి అనుకూలంగా ఉంది. ఇక, కమ్మ సామాజిక వర్గం పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇక, మిగిలిన మూడో సామాజిక వర్గం కాపులు ఈ రెండు పార్టీల్లోనూ ఉన్నారు. అయితే, వీరికంటూ ప్రత్యేకంగా ఒక పార్టీ లేదు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పుట్టుకొచ్చిన జనసేన వీరికి ఆసరా అవుతుందని భావించినా అది సాధ్యం కాలేదు. దీంతో కాపులు ఎటూ కాకుండా త్రిశంకు స్వర్గంలో ఉండిపోయినట్టు అయింది.
కాపులను చేర్చుకునేందుకు….
ఈ క్రమంలో.. వీరిపై దృష్టి పెట్టిన బీజేపీ.. రాష్ట్ర సారధి కూడా కాపు వర్గానికి చెందిన నాయకుడే ఉండడంతో ఆయన ద్వారా కాపులను తమ గూటిలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే టీడీపీలో కీలకమైన ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరులోని కాపు వర్గాన్ని బీజేపీలో చేర్చుకునేందుకు రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఇక, రెండు వారాల కిందట తమ భవతవ్యంపై తేల్చుకునేందుకు కాపులు కాకినాడలో భేటీ కూడా నిర్వహించారు. ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉన్న నాయకులు, తటస్థులుగా ఉన్న మరికొందరు కూడా త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అయితే, ఇంతలోనే గడిచిన నాలుగు రోజులుగా ఓ వార్త తెరమీదికి వచ్చింది. కాపులు బీజేపీలోకి వచ్చేందుకు రెడీగానే ఉన్నారని, అయితే, వారి ప్రధాన డిమాండ్ తమ వర్గానికే చెందిన సోము వీర్రాజు పెత్తనం తమకు వద్దని, సోము వీర్రాజు ను పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది.
సోమును తొక్కేసేందుకు…..
ఈ విషయం వెలుగులోకి రావడంతో బీజేపీ నేతలు కూడా అలెర్ట్ అయ్యారు. ముఖ్యంగా సోము వీర్రాజు వర్గంలో అలజడి ప్రారంభమైంది. ఉద్దేశ పూర్వకంగానే సోము వీర్రాజుకు పొగ పెడుతున్నారని, ఆయనను కావాలనే తొక్కేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. అదేసమయంలో కాపులను అడ్డు పెట్టుకుని బీజేపీ రాష్ట్ర చీఫ్ కన్నానే ఇలా పావులు కదుపుతున్నారని అంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రంలోని బీజేపీ పెద్దలు కన్నాను ఎంపిక చేసిన సమయంలో సోము వీర్రాజు తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను నిర్ణయించుకున్న వారికి కన్నాతో సంబంధంలేకుండానే టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేశారు.
డుమ్మా కొడుతూ…..
అంతేకాకుండా కన్నా నిర్వహిస్తున్న సభలు, సమావేశాలకు కూడా సోము వీర్రాజు డుమ్మా కొడుతూ.. తానే అనధికార అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాట వాస్తవం. ఈ క్రమంలో రేపు ఒకవేళ రాష్ట్రంలో బీజేపీ బలపడితే.. తన ప్రాధాన్యం తగ్గుతుందని భావించిన కన్నా.. ఇప్పటి నుంచే సోము వీర్రాజుకు ఇలా పొగపెడుతున్నారని అంటున్నారు. ఏదేమైనా.. పార్టీ బలోపేతం కాకముందే.. ఇలా ఆధిపత్య పోరుకు తెరదీస్తే.. రాబోయే రోజుల్లో పరిస్తితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.