వంశీ, క‌ర‌ణం జ‌గ‌న్‌కు కంప్లైంట్ చేయడంతోనే?

ఏపీలో వైసీపీ చెంత చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలకు అధికార పార్టీ నేత‌ల నుంచి ఇబ్బందులు త‌ప్పడం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యేతో [more]

;

Update: 2021-04-21 03:30 GMT

ఏపీలో వైసీపీ చెంత చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలకు అధికార పార్టీ నేత‌ల నుంచి ఇబ్బందులు త‌ప్పడం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నుంచి గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీల‌కు గుడ్ బై చెప్పేసి జ‌గ‌న్ చెంత చేరిపోయారు. అయితే ఇప్పుడు వీరంతా వైసీపీ కేడ‌ర్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు అక్కడ వైసీపీ గెలుపు కోసం ఈ నాయ‌కుల‌పైనే పోరాటం చేసిన నేత‌లు ఇప్పుడు పార్టీలోకి వ‌చ్చి త‌మ‌పై పెత్తనం చేస్తుంటే స‌హించ‌లేక‌పోతున్నారు. అందుకే ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గ్రూపుల గోల‌తో వైసీపీ రాజ‌కీయం హీటెక్కిపోతోంది.

భవిష్యత్ ఉంటుందని వచ్చినా….

కనీసం వైసీపీలోకి వ‌స్తే త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్యత్తుతో పాటు ప‌నులు అయినా అవుతాయ‌ని భావించిన జంపింగ్ ఎమ్మెల్యేల‌కు ఇక్కడ గ్రూపు రాజ‌కీయాల‌తో ప్రశాంత‌త లేకుండా పోయింది. ఇక్కడ వీరిని ప‌ట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు. అధికార పార్టీ పంచ‌న చేరాం కాబ‌ట్టి ఇక్కడ త‌మతో పాటు త‌మ అనుచ‌రుల‌కు మేళ్లు జ‌రిగేలా చేద్దామ‌న్నా కూడా వైసీపీ పాత కేడ‌ర్ వీరిని నానా ఇబ్బందులు పెడుతున్నారు. పాత నాయ‌కుల ఒత్తిళ్లకు చివ‌ర‌కు జిల్లా పార్టీ నేత‌లో లేదా జిల్లాల ఇన్‌చార్జ్‌లో కూడా త‌లొగ్గక త‌ప్పని ప‌రిస్థితి. చీరాల‌, గ‌న్నవ‌రంలో క‌ర‌ణం బ‌ల‌రాం, వ‌ల్లభ‌నేని వంశీ లాంటి బ‌ల‌మైన నేత‌ల‌కే ఈ ఇబ్బందులు త‌ప్పడం లేదు. గుంటూరు వెస్ట్‌లో మ‌ద్దాలి గిరి, రాజోలులో రాపాక వ‌ర‌ప్రసాద‌రావు, వైజాగ్‌లో వాసుప‌ల్లి గ‌ణేష్ ఎంతో కొంత ఆవేద‌న ఉన్నా రాజీప‌డుతున్నారు.

జగన్ కు నేరుగా ఫిర్యాదు…..

వంశీ, బ‌ల‌రాంలు మాత్రం సీనియ‌ర్ నేత‌లు కావ‌డం.. ఫైర్ బ్రాండ్ లీడ‌ర్లు కావ‌డంతో వీరిలో ఇప్పటివ‌ర‌కు అణుచుకుంటూ వ‌చ్చిన బ‌డ‌బాగ్నిని ఇక దాచుకోలేక‌పోయారు. ఈ క్రమంలోనే వీరు త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ ఇబ్బందుల‌పై నేరుగా జ‌గ‌న్‌కే ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం. చీరాల‌లో ఆమంచి సాధార‌ణ ఎన్నిక‌ల వేళ దూకుడుగా వ్యవ‌హ‌రించారు. క‌ర‌ణంతో క‌ల‌వ‌కుండానే స్థానిక ఎన్నిక‌ల్లో సొంతంగా అభ్యర్థుల‌ను పోటీ చేయించి క‌ర‌ణంకు దెబ్బకొట్టారు. చివ‌ర‌కు చీరాల మున్సిపాల్టీలో కూడా ఆమంచి వ‌ర్గానికి చెందిన 14 మంది రెబ‌ల్స్ విజ‌యం సాధించారంటే ఆమంచి క‌ర‌ణంకు ఎంత కంట్లో న‌లుసులా మారారో తెలుస్తోంది.

వీరద్దరి మధ్య పంచాయతీ…

క‌ర‌ణం స్థానికంగా ఎంత గ్రిప్ తెచ్చుకుందామ‌ని చూస్తున్నా ఆమంచి మాత్రం క‌ర‌ణంకు ఎప్పటిక‌ప్పుడు బ్రేకులు వేస్తున్నారు. దీంతో ఆమంచికి అనుకూలంగా మ‌రో బ‌ల‌మైన వ‌ర్గం ఉండ‌డంతో క‌ర‌ణం ఇటు అభివృద్ధి ప‌నుల ప‌రంగాను… అటు రాజ‌కీయంగాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే ప‌రిస్థితి ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల వేళ కూడా త‌న‌కు ఇబ్బంది త‌ప్పద‌ని భావించిన క‌ర‌ణం ఈ విష‌యంపై నేరుగా జ‌గ‌న్‌కే ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం. అటు ఆమంచికి చీరాల మిన‌హా ఇత‌ర ఆప్షన్లు ఇచ్చినా కూడా ఆయ‌న మాత్రం చీరాల‌లో మ‌రింత‌గా స‌త్తా చాటుతుండ‌డంతో వీరి మ‌ధ్య పంచాయితీ సస్పెన్స్‌గానే ఉంది.

నిధుల విషయంలో….

ఇక గ‌న్నవ‌రంలో వంశీకి వ్యతిరేకంగా ఆయ‌న రాజ‌కీయ ప్రత్యర్థులు అంద‌రూ ఏక‌మైపోయారు. దుట్టా, యార్లగ‌డ్డ, దుట్టా అల్లుడు శివ‌భ‌ర‌త్ రెడ్డితో పాటు టీడీపీకి చెందిన కొంద‌రు నేత‌లు కూడా ఈ విష‌యంలో వైసీపీ వాళ్లతో చేతులు క‌లిపి వంశీ టార్గెట్‌గా చ‌క్రం తిప్పుతున్నారు. వంశీ ఏ అభివృద్ధి అంటూ పార్టీ మారారో అదే అభివృద్ధి ప‌నుల నిధుల విష‌యంలో ఆయ‌న‌కు పూర్తిగా చెక్ పెడుతున్నారు. దుట్టా, యార్లగ‌డ్డ పార్టీ నుంచి వ‌చ్చే నిధుల విష‌యంలో పై స్థాయిలో లాబీయింగ్ చేసుకుని త‌మ అనుచ‌రుల‌కే ఇప్పించుకుంటున్నారు.

ఇద్దరూ టచ్ లోనే ఉంటూ….

నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీలోనే మ‌రో బ‌ల‌మైన వ‌ర్గం ఆయ‌న‌కు స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేదు. గ్రామాల ప‌ర్యట‌న‌కు వెళుతున్నా ఎంత మాత్రం స‌హ‌క‌రించ‌డం లేదు. దీంతో వంశీ కూడా ఇదే అంశంపై ఇప్పటికే పలువురు పార్టీ పెద్దల‌కు ఫిర్యాదు చేసి చేసి విసిగి… ఇప్పుడు జ‌గ‌న్‌కే ఫిర్యాదు చేశార‌ని తెలిసింది. ఈ విష‌యంలో కామ‌న్ బాధితులుగా ఉన్న క‌ర‌ణం, వంశీ ఇద్దరూ ట‌చ్‌లోనే ఉంటూ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు కూడా టాక్ ?

Tags:    

Similar News