నేను గాక ఇంకెవరు అని అంటున్నారే?

విశాఖ జిల్లాలో మోస్ట్ ఎలిజిబుల్ అని తనకు తానుగా చెప్పుకునే సీనియర్ నాయకుడు ఉన్నారు. ఆయనే చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఆయన తాజాగా పుట్టిన [more]

;

Update: 2021-08-25 13:30 GMT

విశాఖ జిల్లాలో మోస్ట్ ఎలిజిబుల్ అని తనకు తానుగా చెప్పుకునే సీనియర్ నాయకుడు ఉన్నారు. ఆయనే చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఆయన తాజాగా పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆర్భాటం అంతా చూస్తూంటే కాబోయే మంత్రి ఆయనే అని అంతా అనుకునేలా ఉంది. ఆ పుట్టిన రోజు వేడుక‌ల‌కు జిల్లా నుంచి వ‌చ్చిన పార్టీ నేత‌లు, ఆయ‌న అభిమానులు అంతా కూడా కాబోయే మంత్రిగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చెప్పార‌ట‌. రూరల్ జిల్లాకు కనుక మంత్రి పదవి ఛాన్స్ వస్తే తానే కుర్చీ ఎక్కేది అని కరణం ధర్మశ్రీ గట్టి న‌మ్మకంతో ఉన్నార‌ట‌. ఆయన వైఎస్సార్ కాలం నుంచి కూడా ఆ ఫ్యామిలీని నమ్ముకుని ఉన్నారు. పైగా బలమైన కాపు సామాజికవర్గం నేతగా ఉన్నారు. దాంతో తనకు ఎవరూ సరిసాటి పోటీ కాదు అనే ఆయన భావిస్తున్నారు.

యువనేతకు…?

ఇక రూరల్ జిల్లాలో ఆయనకు ప్రధాన పోటీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ నుంచి వస్తోంది. అమ‌ర్‌నాధ్‌కు జ‌గ‌న్‌, విజ‌య‌సాయి అండ‌దండ‌లు పుష్కలంగా ఉన్నాయ‌న్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. అయితే అమరనాధ్ కంటే తానే సీనియర్ ని అని కరణం ధర్మశ్రీ అంటున్నారు. గుడివాడ టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చారని, తాను మాత్రం ఎపుడూ కాంగ్రెస్ వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్యామిలీ అని కూడా చెప్పుకుంటున్నారు. పైగా మంత్రి పదవి ఇస్తే జిల్లా రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్న వారికి ఇస్తారని కూడా ఆయన అంటున్నారని టాక్‌. తాను పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉందని, దానిని హై కమాండ్ పరిగణనలోకి తీసుకుంటుంది అని కూడా కరణం ధర్మశ్రీ చెబుతున్నారు.

రెండుసార్లు గెలిచి….

కరణం ధర్మశ్రీ గ‌తంలో ఓ సారి మాడుగుల నుంచి కూడా గెలిచారు. ఇప్పుడు చోడ‌వ‌రం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా రూర‌ల్ జిల్లాలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న‌కు ప‌ట్టు ఉంది. ఇక కాపు సామాజికవర్గంలో తనకే ఎక్కువ పలుకుబడి ఉందని… గుడివాడ జూనియ‌ర్ క‌దా ? అని ఆయన అంటున్నట్లుగా భోగట్టా. మరో వైపు రూరల్ జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేల మద్దతుని ఆయన బాగానే కూడగడుతున్న వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. గుడివాడ విషయంలో అయితే చాలా మందికి వ్యతిరేకత ఉందని చెబుతారు. ఆయన దూకుడు స్వభావం వల్లనే నాయకులు దూరంగా ఉంటారన్న ప్రచారం ఉంది.

అవంతి కూడా మరో సారి అంటూ…?

మొత్తానికి చూస్తే గుడివాడ వద్దు కరణం ధర్మశ్రీ ముద్దు అని మెజారిటీ ఎమ్మెల్యేలు కనుక హై కమాండ్ కి విన్నవిస్తే కరణానికే మంత్రి కుర్చీ దక్కడం ఖాయమని అంటున్నారు. మరో వైపు చూస్తే మంత్రి అవంతి శ్రీనివాసరావు తనకు మరో ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. అదే జరిగితే ఆయన్ని కంటిన్యూ చేస్తూ రూరల్ లో వేరే సామాజిక వర్గానికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. అపుడు గుడివాడకూ, కరణం ధర్మశ్రీ కి ఇద్దరికీ కూడా ఝలకే అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News