కార్గిల్ నుంచి నేర్చుకున్నామా…?

కార్గిల్…. రెండు దశాబ్దాల క్రితం ఈ పట్టణం గురించి ఎవరికీ తెలియదు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కూడా పూర్తిగా తెలియదు. కానీ గత 20 ఏళ్లుగా ప్రతి [more]

;

Update: 2019-07-25 18:29 GMT

కార్గిల్…. రెండు దశాబ్దాల క్రితం ఈ పట్టణం గురించి ఎవరికీ తెలియదు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కూడా పూర్తిగా తెలియదు. కానీ గత 20 ఏళ్లుగా ప్రతి భారతీయుడికి ఈ పేరు సుపరిచితం. ఇందుకు గల కారణాలను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరికీ తెలిసిందే. రెండు దశాబ్బాల క్రితం పాకిస్థాన్ కు చెందిన ముష్కరులు ఈ ప్రాంతంలో చొరబడటంతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. వారిని తరిమికొట్టి తిరిగి కార్గిల్ ను స్వాధీనం చేసుకోవడంలో భారతీయ జవాన్ల త్యాగాలు చిరస్మరణీయం. వారు చూపిన తెగువ, ధైర్య సాహసాలు అనుపమానం. 1999 మే 3 నుంచి జులై 26వ తేదీ వరకూ జరిగిన ఈ యుద్ధం అయిదు వందల మందికి పైగా సైనికులు తమ ప్రాణాలను మాతృభూమి కోసం త్యాగం చేశారు. 1100 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు మూడు నెలల పాటు జరిగిన ఈ యుద్ధాన్ని నాటి సైన్యాధిపతి వి.పి.మాలిక్ దగ్గరుండి నడిపించారు. కార్గిల్ ను తిరిగి స్వాధీనం చేసుకున్న జులై 26న ఏటా “విజయ్ దివస్” పేరుతో కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. సైనికుల త్యాగాలను జాతి స్మరించుకుంటుంది.

భిన్నమైన పద్ధతిలో…..

పాకిస్థాన్ తో మూడు యుద్ధాలు జరిగాయి. మొదటిది 1965లో, రెండోది బంగ్లాదేశ్ విమోచనోద్యమం. మూడోది కార్గిల్ యుద్ధం. తొలి రెండు యుద్ధాల కన్నా కార్గిల్ యుద్ధం తీవ్రమైనది. మొదటి రెండు యుద్ధాలు సైనికులు మానసికంగా సిద్ధమైన దశలో జరిగాయి. అందువల్లే పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. కార్గిల్ యుద్ధం సైన్యం మానసికంగా ఎలాంటి సన్నద్ధత లేని దశలో జరిగింది. అందుకే ఈ యుద్ధంలో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. మొదటి, రెండు యుద్ధాల్లో శ్రతువును ప్రత్యక్షంగా ఎదుర్కొన్నారు. ఇది ఒకింత తేలికైన విషయం. కానీ కార్గిల్ యుద్ధం ఇందుకు భిన్నమైన పద్ధతిలో జరిగింది. ఇక్కడ శత్రువులు ముఖాముఖి పోరు జరపలేదు. పాక్ సైనికుల చొరబాట్ల రూపంలో కార్గిల్ ప్రాంతంలో విస్తరించారు. దీంతో శ్రతువును గుర్తించి మట్టుబెట్టడం కష్టమైంది.

షరీఫ్ కు తెలియకుండా…..

కార్గిల్ యుద్ధానికి మూడు నెలల ముందే నాటి ప్రధాని వాజపేయి లాహోర్ బస్సు యాత్ర ద్వారా పాక్ కు స్నేహహస్తం చాటారు. నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అందుకు భిన్నంగా నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. నాటి పాక్ సైన్యాధిపతి పర్వేజ్ ముషార్రాఫ్ ఈ యుద్ధానికి సూత్రధారి. కీలక పాత్రధారి కూడా. ప్రధాని షరీఫ్ కు తెలియకుండానే పర్వేజ్ ముషార్రఫ్ కయ్యానికి కాలు దువ్వారన్న ప్రచారం ఉంది. తరువాతి రోజుల్లో సైనిక కుట్ర జరిగింది. ముషార్రాఫ్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. కార్గిల్ యుద్ధ సమయంలోనూ, 20 ఏళ్ల తర్వాత నేడు బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉండటం గమానార్హం.

ఆయుధాల లేకుండానే….

భారతీయ సైనికులు అత్యంత క్లిష్టమైన, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కార్గిల్ యుద్ధం చేశారు. అప్పటికి వారి వద్ద సరైన ఆయుధాలు కూడా లేవు. “మా దగ్గర ఉన్న దానితో యుద్ధం చేస్తాం ” అన్న నాటి సైన్యాధిపతి విపి మాలిక్ వ్యాఖ్యలు ఆయుధలేమి విషయాన్ని ఎత్తి చూపింది. నిఘా వర్గాల మధ్య సమన్వయం కొరవడింది. పాక్ సైనికుల చొరబాట్ల విషయాన్ని నిఘావర్గాలు పసిగట్టలేకపోవడం పెద్ద లోపం. భారత్ – పాక్ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత సున్నితమైనది. కీలకమైనది. ఇక్కడ వాతావరణం అత్యంత ప్రతికూలంగా ఉంటుంది. విపరీతమైన చలితో విధి నిర్వహణకు అడ్డంకిగా ఉంటుంది. కార్గిల్ వంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నాటి ప్రధాని వాజపేయి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. రక్షణ రంగ నిపుణులు కె. సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దానిని ఏర్పాటు చేశారు. బీజీ వర్ఘీస్, కె.కె. హజారీ ఇందులో సభ్యులు. సతీశ్ చంద్ర మెంబర్ సెక్రటరీ. వీరిలో వర్ఘీస్ ప్రముఖ పాత్రికేయుడు. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కోరారు. సమగ్ర అధ్యయనం అనంతరం 2000 జనవరి 7. కమిటీ నివేదిక సమర్పించింది. మొత్తం వ్యవస్థలోని లోపాలను కమిటీ ఎండగట్టింది. యుద్ధ సమయంలో సైన్యం వద్ద తగినన్ని అధునాతన ఆయుధాలు లేవని, ఇది పెద్దలోపమని కమిటీ పేర్కొంది. నిఘా వర్గాల మధ్య సమన్వయం లేకపోవడం అన్నింటికన్నా పెద్ద లోపమని ఎత్తి చూపింది. గొర్రెల కాపరులు చెప్పిందాకా చొరబాట్ల గురించి భారతీయ సైనికులకు తెలియకపోవడం ఇందుకు నిదర్శనమని పేర్కొంది. ఇంకా వివిధ లోపాలను వివరించింది.

బడ్జెట్ నుం పెంచుతూ….

కార్గిల్ ఘటన నుంచి భారత్ కొన్ని పాఠాలను నేర్చుకుంది. ముఖ్యంగా రక్షణ బడ్జెట్ పెంపు, అధునాతన ఆయుధాలను సమకూర్చుకోవడంపై భారత్ దృష్టి సారించింది. గత ఏడాది రక్షణ బడ్జెట్ 2.98 లక్షల కోట్లు కాగా, తాజా బడ్జెట్ లో ఈ మొత్తాన్ని 3.18 లక్షల కోట్లకు పెంచుతూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకున్నరాు. ఆమె ఇంతకు ముందు రక్షణ శాఖను నిర్వహించిన విషయం విదితమే. బడ్జెట్ లో సింహభాగం సిబ్బంది జీతాలు, పింఛన్లకే సరిపోతుంది. ఆయుధాల కొనుగోళ్లకు తగినన్ని నిధులు ఉండటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా రక్షణ రంగంపై అత్యధిక వ్యయం చేస్తున్న దేశాల్లో అమెరికా, చైనా, సౌదీ అరేబీియా, భారత్, ఫ్రాన్స్ మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి. మన కన్నా ఎంతో చిన్న దేశమైన సౌదీ అరేబియా మన కన్నా ఎక్కువ ఖర్చు చేస్తుండటం గమనార్హం. అందువల్ల మున్ముందు బడ్జెట్ ను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. సైనిక దళాల ఆధునికీకరణ, నూతన ఆయుధాల కొనుగోలు దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. రష్యా నుంచి ఎస్ – 400, ఇజ్రాయిత్ నుంచి బరాక్ – 8 క్షిపణి వ్యవస్థ కొనగోలు ఇందులో భాగమే. అదే విధంగా ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఈ చర్యలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. కార్గిల్ వీరులకు నివాళులు అర్పించడమే సమస్యకు పరిష్కారం కాదన్న విషయాన్ని గుర్తించాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News