వారసులు కూడా ఎక్కిరావడం లేదే?

నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయ చ‌రిత్ర సొంతం చేసుకున్న నాయ‌కుడు కావూరి సాంబ‌శివ‌రావు. వినయశీలి, విద్యావంతుడు, మృదు స్వభావి, ఆలోచ‌నా త‌త్పరుడుగా పేరు తెచ్చుకున్న నేత‌గా కూడా [more]

;

Update: 2021-01-16 12:30 GMT

నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయ చ‌రిత్ర సొంతం చేసుకున్న నాయ‌కుడు కావూరి సాంబ‌శివ‌రావు. వినయశీలి, విద్యావంతుడు, మృదు స్వభావి, ఆలోచ‌నా త‌త్పరుడుగా పేరు తెచ్చుకున్న నేత‌గా కూడా ఆయ‌న గుర్తింపు పొందారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో ఆయ‌న‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంపీగా ఆయ‌న మ‌చిలీప‌ట్నం నుంచి గెలిచి రికార్డు సృష్టించారు. 1989లో ఆంధ్రాలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతే ఆయ‌న ఎంపీగా కావూరి సాంబ‌శివ‌రావు గెలిచారు. ఆ త‌ర్వాత 2004, 2009 ఎన్నిక‌ల్లో జిల్లా మారి కూడా ఆయ‌న ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. అంతేకాదు, కాంగ్రెస్‌లో త‌నకంటూ.. ప్రత్యేక‌త‌ను సంత‌రించుకున్నారు.

రాష్ట్ర విభజనతో….

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణానంత‌రం కేంద్రంలోని కాంగ్రెస్ నేత‌ల‌తో త‌న‌కున్న సంబంధాలకు మ‌రింత‌గా ప‌దును పెట్టి చివ‌ర్లో ఓ రేంజ్‌లో హ‌వా చెలాయించారు. ఈ క్రమంలోనే త‌న చిర‌కాల కోరిక అయిన కేంద్ర మంత్రి ప‌ద‌విని కూడా కావూరి సాంబ‌శివ‌రావు సొంతం చేసుకున్నారు. అదే స‌మ‌యంలో త‌న అనుచ‌రుల‌కు కూడా ప‌ద‌వులు ఇప్పించుకున్నారు. అలాంటి నాయ‌కుడు రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో కాంగ్రెస్‌కు దూర‌మ‌య్యారు. నిజానికి స‌మైక్య రాష్ట్ర కోసం గ‌ళం విప్పిన నాయ‌కుల్లో కావూరి సాంబ‌శివ‌రావుకూడా ఒక‌రు. అయితే.. ఏపీ నేత‌ల మాట‌ల‌కు కాంగ్రెస్ విలువ ఇవ్వక‌పోవ‌డంతో కావూరి పార్టీకి దూరంగా వ‌చ్చారు. ఈ క్రమంలోనే ఆయ‌న బీజేపీలోకి చేరిపోయారు.

బీజేపీలో చేరినా….

2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావ‌డంతో ఏదైనా ప‌ద‌వి ల‌భించ‌క‌పోతుందా ? అని కావూరి సాంబ‌శివ‌రావు భావించారు. ముఖ్యంగా ఆయ‌న రాజ్యస‌భ‌కు వెళ్లాల‌ని భావించారు. అయితే.. కావూరి సాంబ‌శివ‌రావు సామాజిక వ‌ర్గం నేత‌ల లాబీయింగ్ ఎక్కువ‌గా ఉండడం, కేంద్ర బీజేపీ నేత‌లు ఏపీపై పెద్దగా దృష్టి పెట్టక‌పోవ‌డం వంటి కార‌ణాల నేప‌థ్యంలో కావూరి ఆశ‌లు ఫ‌లించ‌లేదు. దీంతో ఆయ‌న మౌనంగా ఉంటున్నారు. అసలు ఆయ‌న బీజేపీలో ఉన్నారా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి కావూరి సాంబ‌శివ‌రావుకి ఆహ్వానం అందింది. అయితే.. అప్పటికే ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం కావ‌డంతో కావూరి సాంబ‌శివ‌రావు సునిశితంగా తిర‌స్కరించారు.

వారసులు సయితం….

ఇక‌, ఇప్పుడు కావూరి సాంబ‌శివ‌రావు బీజేపీలో ఉన్నా.. మౌనంగా ఉంటున్నారే త‌ప్ప.. ఎక్కడా స్పంద‌న ఉండ‌డం లేదు. వ‌య‌సు రీత్యా కూడా ఆయ‌న అనారోగ్యంతో ఉన్నార‌నే ప్రచారం ఇటీవ‌ల వ‌చ్చింది. త‌న రాజ‌కీయ వార‌సురాలిగా ఒక కుమార్తెను తీసుకురావాల‌ని ప్రయ‌త్నించినా.. సాధ్యం కాక‌పోవ‌డంతో కావూరి కుటుంబం నుంచి రాజ‌కీయంగా ఎవ‌రూ వెలుగు చూడ‌లేక పోయారు. కావూరి సాంబ‌శివ‌రావు వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకోలేక పోయారు. ఫ‌లితంగా నాలుగు ద‌శాబ్దాలపాటు రాష్ట్రంలోను, కేంద్రంలోను రాజ‌కీయ చక్రంతిప్పిన కావూరి.. పాలిటిక్స్‌కు శుభం కార్డు ప‌డిన‌ట్టేన‌ని అంటున్నారు ఆయ‌న అభిమానులు.

Tags:    

Similar News