జెయింట్ కిల్లర్ దూసుకు పోతున్నాడుగా!

గుంటూరు జిల్లా పొన్నూరు రాజ‌కీయాల్లో కొత్త చాప్టర్ ప్రారంభ‌మైంది. గ‌డిచిన పాతిక సంవ‌త్సరాలుగా ఏక ఛ‌త్రాదిప‌త్యం తో నియోజ‌క‌వ‌ర్గాన్ని ఏలుతున్న టీడీపీ నాయ‌కుడు, వరుస విజ‌యాలతో దూసుకుపోయిన [more]

;

Update: 2019-07-18 12:30 GMT

గుంటూరు జిల్లా పొన్నూరు రాజ‌కీయాల్లో కొత్త చాప్టర్ ప్రారంభ‌మైంది. గ‌డిచిన పాతిక సంవ‌త్సరాలుగా ఏక ఛ‌త్రాదిప‌త్యం తో నియోజ‌క‌వ‌ర్గాన్ని ఏలుతున్న టీడీపీ నాయ‌కుడు, వరుస విజ‌యాలతో దూసుకుపోయిన ధూళిపాళ్ల న‌రేంద్రను తాజా ఎన్నిక‌ల్లో ఓడించి జ‌యింట్ కిల్లర్‌గా గుర్తింపు సాధించిన కిలారు రోశ‌య్య త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. వాస్తవానికి పొన్నూరులో గెలుపు అంటే అంత ఈజీకాదు, ఇప్పటి వ‌ర‌కు పోటీ చేసిన వారు చేయ‌కుండా చేసినా.. న‌రేంద్రకుమార్‌ను ఏ ఒక్కరూ ఐదు ఎన్నిక‌ల నుంచి ఓడించ‌లేక పోయారు. ఇక‌, ఇప్పుడు జ‌రిగిన తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలిస్తే..వ‌రుస‌గా ఆరోసారి విజ‌యం సాధించి, డ‌బుల్ హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకునేవారు.

ఎంపీగా పోటీ చేయాలనుకున్నా…..

ఈ క్రమంలోనే ధూళిపాళ్ల స‌ర్వశ‌క్తులు ఒడ్డారు. అయితే, న‌రేంద్ర రికార్డును బ్రేక్ చేస్తూ.. కిలారు రోశ‌య్య పొన్నూరులో స‌రి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. వైసీపీలో కీల‌క నాయ‌కుడుగా ఉన్న ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లుకు స్వయానా అల్లుడైన కిలారు రోశ‌య్య ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున గుంటూరు ఎంపీగా పోటీ చేయాల‌ని భావించారు. దీంతో జ‌గ‌న్ ఆయ‌న కోరిక మేర‌కు గుంటూరు పార్లమెంటు ఇంచార్జ్‌గా ఆయ‌న‌ను నియ‌మించారు. అయితే, ఇంత‌లోనే టీడీపీ నుంచి మోదుగుల వేణుగోపాల రెడ్డి వ‌చ్చి వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో ఆయ‌న కూడా గుంటూరు ఎంపీ టికెట్‌నే కోరుకున్నారు.

తక్కువ సమయమేఉన్నా….

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ .. కిలారు రోశ‌య్యనే బుజ్జగించి.. కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న పొన్నూరులో ఆయ‌న‌కు టికెట్ కేటాయించారు. అయితే, గ‌డిచిన ఐదు ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధిస్తూ.. వ‌చ్చిన ధూళిపాళ్ల న‌రేంద్రను ఢీకొట్టడం, అది కూడా ఎన్నిక‌లకు మ‌రో 23 రోజులు మాత్రమే ఉన్నాయ‌న‌గా నియోజ‌క‌వ‌ర్గం మార్చడంతో రోశ‌య్య అనుచ‌రులు త‌ర్జన భ‌ర్జన ప‌డ్డారు. అయితే, త‌క్కువ వ్యవ‌ధే ఉన్నప్పటికీ.. గుంటూరు జిల్లా మిర్చి యార్డుకు ప్రెసిడెంట్‌గా ఉండ‌డం, స్థానికంగా ఉన్న ప‌రిచ‌యాలు, రైతుల్లో మంచి గుర్తింపు ఉన్న నేప‌థ్యంలో రోశ‌య్యకు అనూహ్యంగా గుర్తింపు ల‌భించింది.

అందుబాటులో ఉంటూ….

ఈ క్రమంలోనే ఆయ‌న దూసుకుపోయారు. ఒక‌వైపు పార్టీ మేనిఫెస్టోను ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్లారు. మ‌రోవైపు త‌న‌ను ఎందుకు ఎన్నుకోవాలో వివ‌రించారు. మొత్తంగా ఆయ‌న విజ‌యం సాధించారు. దీంతో అప్రతిహ‌తంగా ఆరోసారి కూడా విజ‌యం ద‌క్కుతుంద‌ని భావించిన టీడీపీ నాయ‌కుడు ధూళిపాళ్లకు ఓట‌మి త‌ప్పలేదు. కాగా, నియోజ‌క‌వ‌ర్గం ప్రజ‌ల‌కు అందుబాటులో ఉంటూ.. కిలారు రోశ‌య్య త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News