పొన్నూరు ప్రోగ్రెస్ ఏంటి…?ఎమ్మెల్యే కిలారు క‌థ ఇదేనా…?

పాతికేళ్లుగా ఒకే పార్టీ, ఒక నేత పాల‌న‌లో ఉన్న గుంటూరు జిల్లాలోని కీలక‌మైన నియోజ‌క‌వ‌ర్గం పొన్నూరు. అంతేకాదు, దీనికి ముందు అంటే టీడీపీ పుట్టిన నాటి నుంచి [more]

;

Update: 2020-06-02 08:00 GMT

పాతికేళ్లుగా ఒకే పార్టీ, ఒక నేత పాల‌న‌లో ఉన్న గుంటూరు జిల్లాలోని కీలక‌మైన నియోజ‌క‌వ‌ర్గం పొన్నూరు. అంతేకాదు, దీనికి ముందు అంటే టీడీపీ పుట్టిన నాటి నుంచి గ‌త ఏడాది అంటే 2019 వ‌ర‌కు కూడా అదే పార్టీ (1989 మిన‌హా) గెలుపు గుర్రం ఎక్కుతూ.. వేరే పార్టీని క‌నీసం వేలు కూడా పెట్టనీయ‌కుండా చేసిన‌ నియోజకవ‌ర్గం కూడా ఇదే. 1983 నుంచి 1989 వ‌ర‌కు ధూళిపాళ్ల వీర‌య్య చౌద‌రి ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కారు. అనంత‌రం, ఆయ‌న వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ చౌద‌రి గ‌త ఏడాది ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా విజ‌యం సాధించారు. మొత్తంగా తండ్రీ త‌న‌యులే 1983 నుంచి ఇక్కడ చ‌క్రం తిప్పారు.

మూడు దశాబ్దాల తర్వాత….

ఇలాంటి అత్యంత బ‌ల‌మైన కంచుకోట‌లో పాగా వేయాల‌ని ప్రయ‌త్నించ‌ని పార్టీ లేదు. పోటీ చేయ‌ని నాయ‌కుడు లేరు. అలాంటి చోట మూడు ద‌శాబ్దాల త‌ర్వాత‌ వైసీపీ పాగా వేసింది. వైసీపీ త‌ర‌ఫున అనూహ్యంగా తెర‌మీదికి వ‌చ్చిన కిలారు రోశ‌య్య పొన్నూరు నుంచి పోటీ చేసి అనూహ్యమైన విజ‌యాన్ని అందుకున్నారు. అయితే, ఈ విజ‌యం రెండు ర‌కాలుగా ఆయ‌న‌పై ప్రభావం చూపింది. ఒక‌టి టీడీపీ కంచుకోట‌ను, సుదీర్ఘ కాలంలో ఇక్కడ పాతుకుపోయిన న‌రేంద్ర కుమార్‌ను ఓడించ‌డం కాగా, రెండు.. అత్యంత కీల‌క‌మైన టీడీపీ స్థానంలో వైసీపీని ప్రతిష్టాత్మ ‌కంగా నిల‌బెట్టడం. ఈ రెండు ప్రభావాలూ ఆయ‌న‌ను నిత్యం మీడియాలో మ‌నిషిని చేశాయి. అంతేకాదు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నేది కూడా కిలారు ప‌నితీరుకు నిద‌ర్శనంగా మార‌నుంది.

స్వల్ప ఓట్ల తేడాతోనైనా….

కేవలం వెయ్యి పైచిలుకు ఓట్ల మెజారిటీతో సిట్టింగ్ ఎమ్మెల్యే న‌రేంద్ర కుమార్‌ను ఓడించారు. నిజానికి ఐదు ద‌ఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్న న‌రేంద్రపై పెద్ద‌గా వ్యతిరేక‌త అనేది లేని నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కంటూ ప్రత్యేక‌త‌ను సంత‌రించుకుని ముందుకు సాగాల్సిన అవ‌స‌రం కిలారుపై ఉంది. ఇక‌, కిలారు రోశ‌య్య.. పొన్నూరులో విజ‌యం సాధించి ఏడాది అయిపోయింది. ఈ ఏడాది కాలంలో రోశ‌య్య వేసుకున్న పునాదులు.. చేసిన అభివృద్ధిని ప‌రిశీలిస్తే.. పార్టీ ప‌రంగా ఆయ‌న వివాద ర‌హితుడ‌నే పేరును మాత్రం సంపాయించుకున్నారు. ప్రజ‌ల‌కు అందుబాటులో ఉంటార‌ని, స‌మ‌స్యల‌ను వింటార‌నే పేరు ద‌క్కించుకున్నారు. కానీ, అభివృద్ధి ప‌రంగా చూసుకున్నప్పుడు పెద్దగా పొన్నూరుకు ఒరిగిందేమి లేదు. అయితే కొన్ని విష‌యాల్లో ఆయ‌న న‌రేంద్రతోనే లాలూచీ ప‌డి సైలెంట్‌గా ప‌ని కానిచ్చేస్తున్నార‌న్న టాక్ కూడా వ‌చ్చింది.

రాజధాని సెగ….

అయితే, రాజ‌ధాని ర‌గ‌డ నేప‌థ్యంలో కొన్ని నెల‌ల నుంచి ఇక్కడ ఎలాంటి అభివృద్ది జ‌ర‌గ‌డం లేదు. పైగా రాజ‌ధాని త‌ర‌లించ‌రాద‌నే డిమాండ్ పొన్నూరులోనూ పెద్దగానే ఉంది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యేకు రాజ‌ధాని సెగ బాగానే త‌గిలింది. నాగార్జున వ‌ర్సిటీ పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంది. అక్కడ నుంచి రాజ‌ధానిని త‌ర‌లించ‌డంతో సామాన్య ప్రజ‌ల్లో వైసీపీపై కొంత వ్యతిరేక‌త ఉంది. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన అనుచ‌ర‌గ‌ణం ఉన్న మాజీ ఎమ్మెల్యే రావి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు, రోశ‌య్యకు పొస‌గ‌డం లేదు. కావాల‌నే కిలారు రోశ‌య్య రావిని ప‌క్కన పెడుతున్నార‌న్న చ‌ర్చలు ఉన్నాయి.

ఏడాది కాలంలో…

ఇక రావికి ఏ ప‌దవులు రాకుండా అడ్డు పుల్ల‌లు వేస్తున్నార‌ని రావి వ‌ర్గం అంటోంది. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న ఓ వ‌ర్గంతో కిలారు రోశ‌య్య‌కు పెద్ద‌గా పొస‌గ‌ని ప‌రిస్థితి ఉంది. ఇటు సొంత పార్టీలో గ్రూపులు… రావి వ‌ర్గంతో విబేధాలు.. ఏడాది కాలంలో ఏ మాత్రం జ‌ర‌గ‌ని అభివృద్ధి రోశ‌య్య‌కు మైన‌స్‌లే. అయితే అందరినీ క‌లుపుకొని పోయే నాయ‌కుడిగా మాత్రం వివాదాల‌కు దూరంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ, న‌రేంద్ర హ‌వాపై పైచేయి సాధించాలంటే మాత్రం వ‌చ్చే నాలుగేళ్లు మాత్రం చెమ‌టోడ్చ‌క త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News