కిలారుకి సెగ‌.. ప్రత్యర్థితో చేతులు క‌లిపిన సొంత పార్టీ నేత

గుంటూరు జిల్లా పొన్నూరు రాజ‌కీయాలు వేడెక్కాయి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేను సొంత పార్టీ నేతే టార్గెట్ చేస్తున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అది కూడా ఆయ‌న ప్రత్యర్థి వ‌ర్గంతో [more]

;

Update: 2020-11-09 08:00 GMT

గుంటూరు జిల్లా పొన్నూరు రాజ‌కీయాలు వేడెక్కాయి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేను సొంత పార్టీ నేతే టార్గెట్ చేస్తున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అది కూడా ఆయ‌న ప్రత్యర్థి వ‌ర్గంతో చేతులు క‌లిపి.. ఎమ్మెల్యేను ఒంట‌రిని చేయాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంద‌ని అంటున్నారు. దీంతో ఇక్కడ అస‌లు ఏం జ‌రుగుతోంది? ప‌్రత్యర్థి వ‌ర్గంతో చేతులు క‌లిపింది ఎవ‌రు.. అనే విష‌యం ఆస‌క్తిగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం పొన్నూరు. ఇక్కడ టీడీపీకి కంచుకోట అనే విష‌యం అందరికీ తెలిసిందే.

చివరి నిమిషంలో…..

అయితే, గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించింది. అది కూడా చిత్రమైన ప‌రిస్థితిలో టికెట్ ద‌క్కించుకున్న కిలారు రోశ‌య్య గెలుపు గుర్రం ఎక్కారు. వాస్తవానికి ఇక్కడ రావి వెంక‌ట‌ర‌మ‌ణ‌.. వైసీపీని ముందుండి న‌డిపించారు. ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కే టికెట్ ఇస్తార‌ని ఎంతో ఆశ పెట్టుకున్నారు. వాస్తవానికి ఆయ‌న‌కే ద‌క్కి ఉండాలి. కానీ, టీడీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చివ‌ర్లో వైసీపీలోకి రావ‌డంతో అప్పటి వ‌ర‌కు గుంటూరు ఎంపీ రేసులో ఉన్న రోశ‌య్యకు జ‌గ‌న్‌.. పొన్నూరు టికెట్ ఇచ్చారు. ఇది కూడా పార్టీలో కీల‌క‌మైన ఉమ్మారెడ్డి వేంక‌టేశ్వర్లు ( ఉమ్మారెడ్డికి రోశ‌య్య స్వయానా అల్లుడు ) కోసం ఇచ్చార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నా…..

దీంతో చేతి దాకా వ‌చ్చిన టికెట్ .. రావికి ద‌క్కకుండా పోయింది. పోనీ.. త‌ర్వాతైనా.. రోశ‌య్య రావితో క‌లిసి ముందుకు సాగ‌లేదు. త‌న‌కంటూ.. సొంత కూట‌మి ఏర్పాటు చేసుకున్నారు. చివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో రావి ఫ్లెక్సీలు కూడా క‌ట్టుకునేందుకు అనుమ‌తులు ఇవ్వడం లేద‌ని కూడా ప్రచారం జ‌రుగుతోంది. రావి వ‌ర్గాన్ని రోశ‌య్య పూర్తిగా అణ‌గ‌దొక్కే కార్యక్రమం చేస్తున్నార‌ని రావి వ‌ర్గం ఆరోపిస్తోంది. దీంతో రోశ‌య్య వ్యవ‌హారంపై రావి ర‌గిలిపోతున్నారు. పైగా త‌న‌కు పార్టీలో గుర్తింపు కూడా త‌గ్గుతోంద‌నే భావ‌న‌లో ఉన్నారు. త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వక‌పోయినా.. ఎమ్మెల్సీ ఇస్తార‌ని అనుకున్నారు.

టీడీపీ నేతతో చేతులు కలిపి…..

అయితే, చిల‌క‌లూరిపేట టికెట్ త్యాగం చేసిన క‌మ్మ వ‌ర్గం నేత‌ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కే జ‌గ‌న్ హామీ ఇచ్చి.. ఇంత వ‌ర‌కు నెర‌వేర్చలేదు. దీంతో ఎలాంటి హామీలేని రావికి ఇచ్చే ప‌రిస్థితి లేద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. పోనీ.. డీసీసీబీ చైర్మన్ ప‌ద‌వైనా ఇస్తార‌నుకుంటే.. అది కూడా క‌ష్టమేన‌ని తేలిపోయింది. పార్టీ అధిష్టానం రావి వెంక‌ట‌ర‌మ‌ణ‌ను గుర్తించే ప‌రిస్థితి కూడా లేదు. ఇటు నియోజ‌క‌వ‌ర్గంలో రావిని రోశ‌య్య పూర్తిగా తొక్కేస్తున్నారు. ఈ క్రమంలో తాను ఒక్కడే కాకుండా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ధూళిపాళ్ల న‌రేంద్రతో రావి వెంక‌ట ర‌మ‌ణ చేతులు క‌లిపార‌ని.. ఇద్దరూ క‌లిసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పావులు క‌దుపుతున్నార‌న్న ప్రచారం నియోజ‌క‌వ‌ర్గ, జిల్లా రాజ‌కీయాల్లో వినిపిస్తోంది.

రివర్స్ కావడంతో….

ఎమ్మెల్యే కిలారు రోశయ్య కు వ్యతిరేకంగా లీకులు ఇస్తూ.. సోష‌ల్ మీడియాలో యాంటీ ప్రచారం చేయిస్తున్నార‌ట‌. దీంతో రోశ‌య్య ఒంటరి అయ్యార‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు క‌మ్మ సామాజిక వ‌ర్గంతో పాటు మిగిలిన బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాలు అంతా కూడా ఒక‌వైపు.. రోశ‌య్య ఒక్కరూ ఒక వైపు అన్నట్టుగా ప‌రిస్థితి మారిపోవ‌డంతో పొన్నూరులో ఎమ్మెల్యేకు స‌హ‌క‌రించే నాయ‌కులు లేకుండా పోయార‌ని అంటున్నారు. ఈ వార్‌లో ముందు రోశ‌య్య రావిని అణ‌చాల‌ని చూస్తే.. ఇప్పుడు రావి రివ‌ర్స్ ట్విస్ట్‌లో న‌రేంద్రతో క‌లిసి రోశ‌య్యను ఎదుర్కొంటోన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

Tags:    

Similar News