ఈయనకు ఎవరితోనూ పడదట… ఈయనంటే ఎవరికీ గిట్టదట

ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఆ ఎమ్మెల్యేకి సొంత పార్టీ నేత‌ల‌తో ప‌డ‌డం లేదా ? ఇరుగు పొరుగు ఎమ్మెల్యేల‌తో ఆయ‌న‌కు స‌ఖ్యత లేదా ? ప్రతి వారితోనూ [more]

Update: 2021-08-31 08:00 GMT

ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఆ ఎమ్మెల్యేకి సొంత పార్టీ నేత‌ల‌తో ప‌డ‌డం లేదా ? ఇరుగు పొరుగు ఎమ్మెల్యేల‌తో ఆయ‌న‌కు స‌ఖ్యత లేదా ? ప్రతి వారితోనూ ఆయ‌న వివాదాస్పదంగానే వ్యవ‌హ‌రిస్తున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌నే గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కిలారు రోశ‌య్య. ఈయ‌న ఎవ‌రో కాదు.. సీనియ‌ర్ నాయ‌కుడు, వైసీపీలో ముఖ్య నేత‌గా గుర్తింపు పొందిన జ‌గ‌న్‌కు స‌న్నిహితుడు ఉమ్మార‌డ్డి వెంక‌టేశ్వర్లుకు స్వయానా అల్లుడు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో పొన్నూరు నుంచి టికెట్ తెచ్చుకుని.. టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఐదు సార్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌ను ఆయ‌న ఓడించారు.

గెలిచిన నాటి నుంచి…..

వాస్తవంగా పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్న ఐదేళ్లు ఆయ‌న పార్టీ కోసం పెద్దగా క‌ష్టప‌డిందేమీ లేదు. అయితే చివ‌ర్లో ఉమ్మారెడ్డిని తృప్తి పర్చేందుకు చేసేందుకు జ‌గ‌న్ కిలారు రోశ‌య్యకు పొన్నూరు సీటు ఇవ్వడం.. జ‌గ‌న్ గాలిలో గెలిచిపోవ‌డం జ‌రిగిపోయాయి. అప్పటి నుంచి కిలారు రోశ‌య్య తీరే మారిపోయింద‌ని వైసీపీ కేడ‌ర్ గ‌గ్గోలు పెడుతూ వ‌స్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌ల‌ను ఆయ‌న ఖాత‌రు చేయ‌డం లేదు. అంతేకాదు.. చుట్టుప‌క్కల ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేల‌తోపాటు.. జిల్లాలోని ఎమ్మెల్యేల‌తోనూ ఆయ‌న దూరంగానే ఉంటున్నారు అన‌డం కంటే… వాళ్లే ఆయ‌న‌కు దూరంగా ఉంటున్నార‌న్న టాక్ జిల్లాలో వినిపిస్తోంది. అంతేకాదు.. సామాజిక వ‌ర్గం మేర‌కు ప్రాధాన్యం ఇస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

ఎవరితోనూ పొసగక…?

నిజానికి రాజ‌కీయాల్లో ఉన్నవారికి అన్ని సామాజిక వ‌ర్గాలు స‌మానంగా ఉండాలి. అయితే.. రోశ‌య్య మాత్రం త‌న సామాజిక వ‌ర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శలు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌రకు పొన్నూరు వైసీపీ ఇంచార్జ్‌గా ఉండి. పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి పునాదులు వేసిన రావి వెంక‌ట ర‌మ‌ణ‌ను కూడా కిలారు రోశ‌య్య తొక్కేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఆయ‌న‌కు ఏ మాత్రం ప్రాధాన్యం లేకుండా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న సోద‌రుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితోనూ.. కిలారు రోశ‌య్యకు పొస‌గ‌డం లేద‌ట‌.

పంచాయతీ ఎన్నికల్లోూ….

వీరి స్వగ్రామం పెద‌కాకాని పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ మండ‌ల కేంద్రం. పైగా ఇటీవ‌ల ఇక్కడ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. ఆ మాట‌కు వ‌స్తే పొన్నూరు స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా ప‌లు చోట్ల విజ‌యం సాధించింది. ఇక‌, గుంటూరు న‌గ‌రంలో మ‌రో కీల‌క నాయ‌కుడు, మాజీ ఎంపీ, వైసీపీ నేత‌.. మోదుగుల వేణుగోపాల రెడ్డితోనూ కిలారు రోశ‌య్య దూరంగానే ఉంటున్నార‌ని అంటున్నారు. ఇక‌, తెనాలి ఎమ్మెల్యే అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌తో ప‌డ‌దట‌.

ఆ గ్యాప్ అలాగే…?

దీనికి కార‌ణం.. 2014 ఎన్నిక‌ల‌కు ముందు కిలారు రోశ‌య్య, అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌ ఇద్దరూ కూడా తెనాలి వైసీపీ ఇంచార్జులుగా ఉన్నారు. ఆ ఎన్నిక‌ల్లో ఇద్దరూ టిక్కెట్ కోసం ప్రయ‌త్నాలు చేశారు. అయితే.. చివ‌రాఖరుకు టికెట్ శివ‌కుమార్‌కు ద‌క్కింది. అప్పటి నుంచి వీరి మ‌ధ్య గ్యాప్ అలాగే ఉంది. పోనీ.. పొరుగున ఉన్న బాప‌ట్ల ఎమ్మెల్యే, సౌమ్యుడు.. కోన ర‌ఘుప‌తితో కూడా ఆయ‌న‌కు అంతంత మాత్రం సంబంధాలే ఉన్నాయంటున్నారు. ఏదేమైనా కిలారు రోశ‌య్య రెండేళ్లలోనే అటు నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల్లోనూ, ఇటు సొంత పార్టీ నేత‌ల‌తోనూ స‌ఖ్యత ఏర్పరుచుకోలేక‌పోవ‌డంతో పాటు జిల్లా వైసీపీలో ఒంట‌రయ్యార‌న్న టాక్ ఇప్పుడు గుంటూరులో వినిపిస్తోంది.

Tags:    

Similar News