వైసీపీకి ఆయనే రారాజు ?

విశాఖలో వైసీపీ విజయం సాధించింది. విశాఖ మొత్తానికి వైసీపీకి చిక్కింది, ఏడేళ్ళుగా ఊరిస్తూ ఉడికిస్తూ వైసీపీ అధినాయకత్వంతో చెలగాటమే ఆడింది. మొత్తానికి విశాఖ సిటీలో వైసీపీ పాగా [more]

Update: 2021-03-28 11:00 GMT

విశాఖలో వైసీపీ విజయం సాధించింది. విశాఖ మొత్తానికి వైసీపీకి చిక్కింది, ఏడేళ్ళుగా ఊరిస్తూ ఉడికిస్తూ వైసీపీ అధినాయకత్వంతో చెలగాటమే ఆడింది. మొత్తానికి విశాఖ సిటీలో వైసీపీ పాగా వేయడం అన్నది ఫ్యాన్ పార్టీ నేతలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇది కదా అసలైన విజయం అని వైసీపీ నేతలు తెగ‌ మురిసిపోతున్నారు. అంతే కాదు, 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఏపీ వ్యాప్తంగా విజయం దక్కినా విశాఖ నట్టింట కాలుమోపలేకపోయామే అన్న బెంగ వెలితి వైసీపీ పెద్దలలో ఉండేవి, విశాఖ మేయర్ సీటుని గెలుచుకోవడంతో ఆ లోటు తీరి వైసీపీ విక్టరీ సంపూర్ణం అయిందని కూడా సంతోషిస్తున్నారు.

ఆయనే కీలకం…

విశాఖలో వైసీపీ గెలుపు అలా ఇలా సాకారం కాలేదు. వస్తాయనుకున్న చోట్ల వార్డులు చేజారి పరిస్థితి బేజారు అయింది. దాంతో ధీమా పూర్తిగా సడలిపోతున్న వేళ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఒంటిచేత్తో కధ నడిపించింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చెలరేగిన చందాన ఏకంగా ఉత్తరంలో ఉన్న 17 వార్డులకు గాను పదిహేను వార్డులు వైసీపీ ఖాతాలో పడేలా చేసింది. దీనికంతటికీ కారకుడూ కధానాయకుడూ ఒక్కరే. ఆయనే కేకే రాజు. ఉత్తరంలో వైసీపీ ఇంచార్జి. అంతే కాదు, కేవలం మూడు వేల ఓట్ల తేడాలో 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ చేతిలో ఓడిన కసిని అంతా జీవీఎంసీ ఎన్నికల్లో తీర్చేసుకున్నారు.

జగన్ చల్లని చూపు….

ఇక విశాఖలో మేయర్ సీటు జగన్ కల. దాన్ని సాకారం చేసిన వారిలో అతి ముఖ్యుడిగా ఉన్న కేకే రాజు పట్ల జగన్ ఫోకస్ మరింతగా పెరిగింది అంటున్నారు. ఇప్పటికే ఉత్తర నియోజకవర్గం ఆయనకే రిజర్వ్ చేసి అనధికార ఎమ్మెల్యేను చేసిన జగన్ రేపటి రోజున కేకే రాజుకు ఇంకెన్ని వరాలు ఇస్తాడో అని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఓడినా సరే జనాల్లో ఎపుడూ ఉండడమే కాకుండా సొంత డబ్బు ఖర్చు పెట్టి మరీ సేవా కార్యక్రమాలు నిర్వహించే కేకీ రాజు విశాఖ వైసీపీకి ఒక ఆయుధం, ఆస్తి అని చెప్పుకోవాలి. ఆయన కనుక అన్ని సీట్లు వైసీపీకి తేకపోతే ఈపాటికి విశాఖలో వైసీపీ విపక్షంలో ఉండేది అన్నది నిజమంటున్నారు.

మంత్రిని చేస్తారా…?

ఇక రాజు కాదు వైసీపీకి ఆయనే రారాజు అని అంతా కొనియాడుతున్నారు. ఎన్నికలలో అలుపెరని పోరాటం చేసి విజయసాయిరెడ్డితో కలసి వ్యూహాలు రచించిన కేకే రాజు వైసీపీని విశాఖలో నిలబెట్టారు. అదే సమయంలో భీమిలీ, విశాఖ సౌత్, గాజువాక వంటి చోట్ల వైసీపీకి దెబ్బ పడిపోయింది. దాంతో కేకే రాజు కనుక ఆదుకోకపోతే మేయర్ సీటుని తాము దక్కించుకునేవారం కాదని కూడా వైసీపీ నేతలు బయటకే అంటున్నారు. ఇక జగన్ రాజుని ఎమ్మెల్సీగా అయినా చేసి మంత్రి పదవి ఇస్తారా అన్న చర్చ కూడా మొదలైంది. మరి జగన్ దీవెనలు నిండుగా ఉన్న కేకే రాజు విశాఖలో అసలైన రాజు అని చెప్పాల్సిందే అంటున్నారు.

Tags:    

Similar News