కొడాలి టార్గెట్‌.. టీడీపీ వ్యూహం ఇదే… ?

వైసీపీ నాయ‌కుడు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న కృష్ణాజిల్లా గుడివాడ నేత కొడాలి నాని టీడీపీపై నిర్దాక్షిణ్యంగా విరుచుకు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా మాజీ సీఎం [more]

Update: 2020-12-26 08:00 GMT

వైసీపీ నాయ‌కుడు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న కృష్ణాజిల్లా గుడివాడ నేత కొడాలి నాని టీడీపీపై నిర్దాక్షిణ్యంగా విరుచుకు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా మాజీ సీఎం చంద్రబాబుపై దూకుడుగా కామెంట్లు కూడా చేస్తున్నారు. దీంతో కొడాలి నానికి చెక్ పెట్టే దిశ‌గా టీడీపీ వ్యూహాత్మకంగా ఆలోచ‌న చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ కొడాలి నానిని ఓడించేదిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని స‌మాచారం. కొడాలిని ఎదుర్కొనాలంటే.. కేవ‌లం మాట‌ల‌తోను, విమ‌ర్శల‌తోనూ సాధ్యం కాద‌ని నాయ‌కులు డిసైడ్ అయ్యారు.

నానికి చెక్ పెట్టేందుకు….

ఈ క్రమంలో గ‌త కొన్నాళ్లుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నార‌ని తెలిసినా.. ఇత‌మిత్థంగా పార్టీ సీనియర్లకు కూడా స‌మాచారం అంద‌లేదు. అయితే తాజాగా జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నార‌ని అంటున్నారు. పార్టీ కీల‌క నేతల స‌మాచారం మేర‌కు నంద‌మూరి కుటుంబం నుంచి ఒక‌రిని ఇక్కడ నిల‌బెట్టాల‌ని చంద్రబాబు పావులు క‌దుపుతున్నారు. అది కూడా నంద‌మూరి హ‌రికృష్ణ కుమారుడు, సినీ హీరో క‌ళ్యాణ్‌రామ్‌ను ఇక్కడ నుంచి బ‌రిలోకి దింపాల‌ని చ‌ర్చలు జ‌రుగుతున్నాయ‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

ఇప్పటి వరకూ ప్రయారిటీ ఇవ్వకుండా…..

క‌ళ్యాణ్‌రామ్‌కు రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తి ఉంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ప్రచారం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. 2018లో తెలంగాణ ఎన్నిక‌ల్లో త‌న సోద‌రి కూక‌ట్‌ప‌ల్లి నుంచి పోటీ చేసిన‌ప్పుడు ఆమెను గెలిపించాల‌ని కోరారు. ఇప్పుడు క‌ళ్యాణ్‌ను తీసుకువ‌చ్చి గుడివాడ‌లో నిల‌బెట్టడం ద్వారా.. కొడాలి నానికి చెక్ పెట్టాల‌ని భావిస్తున్నారు. బాబు హ‌రికృష్ణ ఫ్యామిలీని ప‌క్కన పెట్టేశార‌న్న విమ‌ర్శలు వ‌స్తున్నా ఆయ‌న స‌మాధానం చెప్పుకోలేని ప‌రిస్థితి. హ‌రికృష్ణను బాబు రాజ్యస‌భ‌కు పంపినా ఆయ‌న‌కు పార్టీలో ఎలాంటి ప్రయార్టీ ఇవ్వలేదు.

పోటీ చేస్తానన్నా…..

2014 ఎన్నిక‌ల్లో హ‌రికృష్ణ కృష్ణా జిల్లాలో పెన‌మ‌లూరు లేదా నూజివీడులో ఏదో ఒక అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తాన‌న్నా చంద్రబాబు ఆయ‌న విన‌తిని ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. ఇక మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ‌రికృష్ణ కుమార్తెను కూక‌ట్‌ప‌ల్లిలో పోటీ చేయించిన బాబు ఆమె ఓడిపోయాక ఆ కుటుంబాన్ని ప‌క్కన పెట్టేశార‌న్న విమ‌ర్శలు ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు క‌ళ్యాణ్‌రామ్‌ను కొడాలిపైకి వ‌దులుతున్నార‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌దులుతున్నారు. అయితే.. ఇక్క‌డ స‌ర్వసాధార‌ణంగా రెండు ప్రశ్నలు తెర‌మీదికి వ‌స్తాయి. రేపు క‌ళ్యాణ్‌రామ్ గెలిచి.. మ‌రోసారి చంద్రబాబు త‌న‌యుడు లోకేష్ రేసులో వెన‌క‌ప‌డితే పార్టీపై ప‌ట్టు కోసం నంద‌మూరి వ‌ర్సెస్ నారా కుటుంబాల మ‌ధ్య యుద్ధం సాగే అవ‌కాశం ఉంటుంది క‌దా..! అనే సందేహం వ‌స్తుంది.

పెద్ద సమస్యగా….?

అయితే.. క‌ళ్యాణ్‌రామ్ దూకుడు ఉన్నా.. చంద్రబాబును, బాల‌య్యను లెక్కచేయ‌నంత లేదు. పైగా సినీ ఫీల్డ్‌లో బోలెడు భ‌విష్యత్తు ఉంది. సో.. దీనిని పెద్ద స‌మ‌స్యగా చంద్రబాబు భావించ‌డం లేద‌ని అంటున్నారు. ఇక‌, రెండో స‌మ‌స్య క‌ళ్యాణ్‌రామ్ ఒప్పుకుంటారా? అనే! ఒక వేళ ఆయ‌న కాదంటే.. ఆయ‌న సోద‌రి.. సుహాసినికి అవ‌కాశం ఇవ్వొచ్చని చెబుతున్నారు. మొత్తంగా.. నంద‌మూరి కుటుంబానికి ఈ నియోజ‌క‌వ‌ర్గం అప్పగిస్తార‌నేది ఖాయ‌మ‌ని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టిన గ‌డ్డకావ‌డంతో సెంటిమెంటు పండుతుంద‌ని.. కొడాలి నాని ఎంత బ‌లంగా ఉన్నా.. ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేసుకుంటున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Tags:    

Similar News