అందరూ మోసం చేసేవారేనా?

ప్రొఫెసర్ గా కోదండరామ్ కు తెలంగాణ ప్రజలకు సుపరచితులు. ఇక తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీ ఛైర్మన్ గా వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ప్రొఫెసర్ గా సక్సెస్ [more]

Update: 2021-02-08 09:30 GMT

ప్రొఫెసర్ గా కోదండరామ్ కు తెలంగాణ ప్రజలకు సుపరచితులు. ఇక తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీ ఛైర్మన్ గా వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ప్రొఫెసర్ గా సక్సెస్ అయిన కోదండరామ్ రాజకీయాల్లో మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆయన నమ్మిన వారే మోసం చేస్తుండటమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడేళ్లు అవుతున్నా కోదండరామ్ ఒక్క పదవిలో కుదురుకోలేదంటే ఆయనకు పార్టీలు ఏ మేరకు ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతుంది.

టీఆర్ఎస్ కు అనుకూలంగా…..

తొలుత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెప్పినట్లే కోదండరామ్ నడుచుకున్నారు. జేఏసీ ఛైర్మన్ గా ఆయన అన్ని కార్యక్రమాలు చేపట్టినా వెనకుండి నడిపించింది కేసీఆర్ అనే అంటారు. అలాంటి కోదండరామ్ ను ఉద్యమంలో వాడుకుని తర్వాత కేసీఆర్ వదలేశారంటారు. తెలంగాణ ఉద్యమంలో ఏమాత్రం సంబంధం లేని, పెద్దగా ప్రభావం చూపని వారికి రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. కానీ కోదండరామ్ కు మాత్రం ఎటువంట పదవి దక్కలేదు.

కొత్త పార్టీ పెట్టి… కాంగ్రెస్ కు….

ఇక తెలంగాణ జనసమితి పేరిట కోదండరామ్ కొత్త పార్టీని తెలంగాణలో స్థాపించారు. అయితే రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ రాజకీయాల్లో కష్టాల్లో ఉండటంతో ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని కోదండరామ్ భావించారు. మహాకూటమి ఏర్పాటులోనూ కోదండరామ్ ప్రముఖ పాత్ర పోషించారు. ఎన్నికలకు తాను దూరంగా ఉండి మహాకూటమి గెలుపునకు కోదండరామ్ ప్రయత్నించారు. కానీ ఫలితం అనుకూలంగా రాలేదు.

కాంగ్రెస్, కమ్యునిస్టులు కూడా….

ఇప్పుడు కాంగ్రెస్ కూడా కోదండరామ్ ను పక్కన పెట్టింది. కమ్యునిస్టులు సయితం పక్కకు జరిగారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కోదండరామ్ ఒంటరిపోరు చేయాల్సి వస్తుంది. దాదాపు అన్ని పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. తెలంగాణ ఉద్యమం కోసం విస్తృతంగా పనిచేసిన ప్రొఫెసర్ కోదండరామ్ ను మాత్రం ఏ పార్టీ పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కనీసం ఆయనపై సానుభూతి లేకపోవడం, నమ్మిన పార్టీలే నమ్మకద్రోహాన్ని ప్రొఫెసర్ విషయంలో చేశాయని చెప్పవచ్చు.

Tags:    

Similar News