బ్యాడ్ లక్ పొలిటీషియన్ రాత మారిందా ?
విశాఖ జిల్లా సౌత్ నియోజకవర్గంలో వైసీపీ నేత ఉన్నారు. ఆయనే కోలా గురువులు. ఆయన సంప్రదాయ మత్సకార వర్గానికి చెందినవారు. అతి సామాన్యుడు. కానీ ఆయనకు ఉన్న [more]
;
విశాఖ జిల్లా సౌత్ నియోజకవర్గంలో వైసీపీ నేత ఉన్నారు. ఆయనే కోలా గురువులు. ఆయన సంప్రదాయ మత్సకార వర్గానికి చెందినవారు. అతి సామాన్యుడు. కానీ ఆయనకు ఉన్న [more]
విశాఖ జిల్లా సౌత్ నియోజకవర్గంలో వైసీపీ నేత ఉన్నారు. ఆయనే కోలా గురువులు. ఆయన సంప్రదాయ మత్సకార వర్గానికి చెందినవారు. అతి సామాన్యుడు. కానీ ఆయనకు ఉన్న మంచితనాన్ని, తన పట్ల అభిమానాన్ని గుర్తించి మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున టికెట్ ఇచ్చారు. అంతటి చిరంజీవి ఊపులోనూ ఆయన ఓడిపోయారు. తేడా ఎంతంటే కేవలం 300 ఓట్లు మాత్రమే. నాడే ఆయనకు బ్యాడ్ లక్ పొలిటీషియన్ అన్న ముద్ర పడిపోయింది. ఆ తరువాత ఆయన వైసీపీలోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. గట్టిగానే నిలబడ్డారు. కానీ చివరి నిముషంలో బ్యాడ్ లక్ వెక్కిరించింది. మరోసారి ఇంటిదారి పట్టారు.
ఆఖరి నిముషాన అలా……
ఇక 2019 ఎన్నికల ముందు వరకూ ఆయన వైసీపీ బలోపేతానికి కృషి చేశారు. అయిదేళ్ళూ జెండా పట్టి తిరిగారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. కానీ ఎన్నికలకు నెల ఉందనగా సీనియర్ నేత ద్రోణం రాజు శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి రావడంతో ఆయనకు జగన్ టికెట్ ఇచ్చారు. దాంతో కోలా గురువులు పూర్తి నిరుత్సాహంతో వెనక్కితగ్గాల్సివచ్చింది. నిజంగా ఆ ఎన్నికల్లో కోలాకు కనుక టికెట్ ఇస్తే ఎమ్మెల్యే కావడం ఖాయమని అంతా అంచనా వేశారు. వేరే పార్టీ నుంచి వచ్చిన ద్రోణంరాజుకు క్యాడర్ సహకరించకపోవడంతో ఆయన కూడా ఓడారు. ఇలా ఎమ్మెల్యే కావాల్సిన కోలా గురువులుకు ముమ్మారు బ్యాడ్ లక్ ఇంటి గుమ్మం వద్దనే కాపేసుకుని మరీ కాటేసింది.
రాత మార్చారా….?
జాతకాలు ఏవి చెప్పినా జగన్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఒక ఉన్నతమైన పదవిని కట్టబెట్టి కోలా గురువులు మీద ఉన్న బ్యాడ్ లక్ ముద్రను తొలగించారు. ఆయనను మత్యకార కార్పొరేషన్ చైర్మన్ ని చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే పదవికి ఇది సరిసాటి. ఆ విధంగా పదకొండేళ్ళుగా పోరాడుతున్న గురువులుకి సముచితమైన స్థానం జగన్ ఇచ్చారు. దీంతో ఆయన వర్గీయుల సంబరం అంతా ఇంతా కాదు. అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి అన్నీ పోగొట్టుకున్నామన్న బాధతో ఇన్నాళ్ళూ కోలా గురువులు ఉండేవారు. వ్యూహాలు తెలియక మంచితనంలో అందరినీ నమ్మేసిన ఆయన అన్యాయమే అయ్యారని కూడా అభిమానులు మధపడ్డారు. మొత్తానికి ఇపుడు ఆయనకు తగిన పదవి దక్కడంతో ముందున్నవి మంచిరోజులేనని అంటున్నారు.
ధీటుగానేనట :
ఇక విశాఖ సౌత్ అసెంబ్లీ సీట్లో కొన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి ఏకంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ షిఫ్ట్ అయ్యారు. ఆయన 2024 ఎన్నికల్లో తనకే టికెట్ అని బలంగా నమ్ముతున్న్నారు. మరో వైపు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా కోలా గురువులే కొనసాగుతున్నారు. ఆయనకు ఇపుడు అర్ధ బలం, అంగబలం సమకూర్చుకోవడానికి ఈ పదవి తోడుగా ఉంటుందని అంటున్నారు. తాను ఒక్కసారి అయినా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన ఆశిస్తున్నారు. ఈ పదవిలో కుదురుకుంటూనే ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగా పట్టుపడతారు అంటున్నారు. ఇంకో వైపు సీనియర్ నేత ద్రోణం రాజు శ్రీనివాస్ మరణంతో వాసుపల్లికి ఎదురునిలిచే నేతగా కోలా గురువులునే ఆ వర్గం చూస్తోంది. మరి ఆయన ఆశలు జగన్ తీరుస్తారా అంటే చూడాలి.