జగన్ కు చికాకు తెప్పిస్తున్నాడే

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడూ…లేనప్పుడూ తరచూ వివాదాల్లో నలిగే నేత. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వరసగా గెలుస్తూ వస్తున్న కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి గత [more]

;

Update: 2019-10-05 11:00 GMT

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడూ…లేనప్పుడూ తరచూ వివాదాల్లో నలిగే నేత. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వరసగా గెలుస్తూ వస్తున్న కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెచ్చిపోతున్నట్లు కన్పిస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమేనేని ప్రభాకర్ కు ఏమాత్రం తీసిపోని విధంగా కోటంరెడ్డి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. తరచూ వివాదాల్లోకి ఎక్కుతూ పార్టీకి నస్టం చేకూరుస్తున్నారని పార్టీలో కూడా కొందరు నేతలు గుసగుసలాడు కుంటున్నారు.

ఏ సమస్య వచ్చినా….

నిజానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్టుదల ఉన్న నాయకుడిగా పేరుంది. తన నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించే తత్వం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిది. చిన్న మురుగునీటి సమస్య వచ్చినా వెంటనే వచ్చి అక్కడ వాలిపోతారు. సమస్య పరిష్కరించకుంటే తానే అక్కడ ఆందోళనకు దిగుతారు. గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూకుడుగానే వ్యవహరించారు. తరచూ సమస్యల కోసం గొడవలకు దిగేవారు. క్రికెట్ బెట్టింగ్ ల్లోనూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు వినపడింది. పోలీసులు ఆయనను విచారించారు కూడా.

అధికార పార్టీలో ఉండి….

అయితే ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అధికార పార్టీలో ఉండి గతంలో మాదిరి వ్యవహరిస్తే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు ఖాయం. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన తీరు మార్చుకోవడం లేదు. ఇంతకు ముందు జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి ఆయనపై దాడిచేశారన్న ఆరోపణలువచ్చాయి. దీనిపై పెద్దయెత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా జరిగాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోటంరెడ్డిని తన వద్దకు పిలిపించుకుని క్లాస్ పీకినట్లు చెబుతారు.

ఎంపీడీవోపై దాడి కేసులో….

తాజాగా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటికి వచ్చి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి బెదిరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన పరిధిలోని ఒక లేఅవుట్ కు ఎంపీడీవో సరళ అనుమతి ఇవ్వలేదన్న కారణంగా ఆయన సరళను బెదిరించినట్లు చెబుతున్నారు. ఎంపీడీవో సరళ ఫిర్యాదు మేరకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సరళ ఇంటి వాటర్, కేబుల్ కనెక్షన్లను కూడా తొలగించారు. మొత్తం మీద కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి అస్సెట్ గా ఉంటాడనుకుంటే ప్రతిష్ట దిగజారుస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. మరి కోటంరెడ్డిపై జగన్ ఎలాంటి చర్యలకు దిగుతారో చూడాలి.

Tags:    

Similar News