ఆయన్ను కలిస్తే చాలట.. పని అయిపోయినట్లే

అధికారం ఒక‌రిది.. ద‌ర్పం మ‌రొక‌రిది.. రాజ‌కీయాల్లో ఇది స‌ర్వసాధార‌ణ‌మే.! అయితే, వైఎస్సార్ సీపీలో దీనికి కొంత భిన్నమైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల బంధువులు [more]

Update: 2020-08-04 00:30 GMT

అధికారం ఒక‌రిది.. ద‌ర్పం మ‌రొక‌రిది.. రాజ‌కీయాల్లో ఇది స‌ర్వసాధార‌ణ‌మే.! అయితే, వైఎస్సార్ సీపీలో దీనికి కొంత భిన్నమైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల బంధువులు బాగా చ‌క్రం తిప్పేస్తున్నారు. ఇక మ‌హిళా ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజ‌క‌వ‌ర్గాల్లో వారి బంధువులు, భ‌ర్తల జోక్యం ఎక్కువ అవుతోంద‌న్న విమ‌ర్శలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఇక వైసీపీ కీల‌క నేత ఎమ్మెల్యేగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో అన్నగారు ఎమ్మెల్యేగా నెగ్గితే.. త‌మ్ముడే అంతా చ‌క్రం తిప్పేస్తున్నారు. చివ‌రాఖ‌రుకు అన్నగారు కూడా తమ్ముడి వ‌ద్దకే వెళ్లాల‌ని ఏదైనా స‌మ‌స్యతో త‌న వ‌ద్దకు వ‌చ్చిన వారికి సూచిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో అన్న అధికారంతో పెత్తనం చ‌లాయిస్తున్న త‌మ్ముడి వ్యవ‌హారం అధికార పార్టీలో చ‌ర్చనీయాంశంగా మారింది.

కోటంరెడ్డి సోదరుడు…..

నెల్లూరు జిల్లా నెల్లూరు గ్రామీణ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్సార్ సీపీ నాయ‌కుడు కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నారు. కొన్నాళ్లపాటు ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే, పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఆయ‌న దూకుడు త‌గ్గక‌పోవ‌డంతో జ‌గ‌నే స్వయంగా ఆయ‌న‌కు క్లాస్ ఇచ్చార‌న్న ప్రచారం ఉంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో మంత్రి అనిల్‌కుమార్‌కు బ‌లంగా స‌పోర్ట్ చేసి రెడ్డి ఎమ్మెల్యే ఎవ‌రంటే కోటంరెడ్డే అని చెప్పాలి. ఇక ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో కోటంరెడ్డి సోద‌రుడు గిరిధ‌ర్‌రెడ్డి అన్నగారి పాత్రను పోషిస్తున్నార‌న్న ప్రచార‌మే ఇప్పుడు ఎక్కువుగా జ‌రుగుతోంది.

అన్ని వ్యవహారాలను….

నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రికి ఏ ప‌ని జ‌ర‌గాల‌న్నా… బ‌దిలీలు, ఇత‌ర‌త్రా వ్యవ‌హారాల విష‌యంలోనూ గిరిధ‌ర్ రెడ్డిని క‌లిస్తే చాలు ప‌నైపోతుంద‌ని అంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో అన్నీ తానై వ్యవ‌హ‌రిస్తున్నారు. ప్రతి ప‌నినీ త‌న క‌నుస‌న్నల్లోనే నిర్వహిస్తున్నార‌ట‌. నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని వ్యవ‌హారాల‌ను ఆయ‌నే చూసుకుంటున్నార‌ని సొంత పార్టీ వర్గాల్లోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా కోటంరెడ్డిని క‌లిసేందుకు నియోజ‌క‌వ‌ర్గ కీల‌క నేత‌లు వ‌చ్చినా ఆయ‌న కూడా గిరిధ‌ర్ రెడ్డి వ‌ద్దకే వెళ్లమ‌ని చెపుతున్నార‌ట‌.

తమ్ముడిదే హవా….

అయితే, ఒకే ఒక్క మంచి ల‌క్షణం ఏంటంటే.. ఎవ‌రి నుంచి ఏదీ ఆశించ‌కుండానే ప‌నులు చేసిపెడుతున్నార‌న్న టాక్ అయితే వ‌చ్చింది. కానీ, ప్రధాన ఆరోప‌ణ ఏంటంటే.. ప్రజ‌లు ఓట్లేసి గెలిపించింది శ్రీధ‌ర్‌రెడ్డిన‌ని, మ‌ధ్యలో గిరిధ‌ర్ రెడ్డి జోక్యం ఎందుక‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అధికారుల‌తో జ‌రిగే స‌మీక్షల‌కు కూడా అన్నను ప‌క్కన పెట్టి త‌మ్ముడు హాజ‌ర‌వ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శలు కూడా వ‌స్తున్నాయి. ఇక పార్టీలో సీనియ‌ర్ నాయ‌కులు సైతం ఎమ్మెల్యేను క‌ల‌వ‌కుండా త‌మ్ముడిని క‌ల‌వాల్సి రావ‌డంతో ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉంటున్నార‌ట‌.

Tags:    

Similar News