“లావు” కు అంత వ్యతిరేకత ఏంటి?

పార్లమెంటు సభ్యులు సహజంగానే సౌమ్యంగా ఉంటారు. దాదాపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఎక్కువగా ఎమ్మెల్యేలపైనే ఆధారపడతారు. తమకు వచ్చే నిధుల కోసం ఎమ్మెల్యేలే తమ [more]

;

Update: 2020-08-27 12:30 GMT

పార్లమెంటు సభ్యులు సహజంగానే సౌమ్యంగా ఉంటారు. దాదాపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఎక్కువగా ఎమ్మెల్యేలపైనే ఆధారపడతారు. తమకు వచ్చే నిధుల కోసం ఎమ్మెల్యేలే తమ వద్దకు వస్తారని భావిస్తారు. అందుకే పెద్దగా ఎమ్మెల్యేలను పట్టించుకోరు. ప్రతి నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గం ఏర్పాటు చేసుకుంటేనే వచ్చే ఎన్నికల్లో తన ప్రచారానికి సులువవుతుందని భావిస్తారు. ఇదే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మధ్య సమస్య తెచ్చి పెడుతుంది. గ్యాప్ క్రియేట్ చేస్తుంది.

ఎమ్మెల్యేలతో పొసగక…

ఆంధ్రప్రదేశ్ లోనూ అనేక మంది ఎంపీలకు, ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. ముఖ్యంగా యువ ఎంపీలు ఎమ్మెల్యేలతో సఖ్యతగా లేరన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో తప్పొప్పులు ఎవరివి అన్నవి పక్కన పెడితే భవిష్యత్తులో పార్టీ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తొలిసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలతో సఖ్యతగా మెలగాల్సిన ఎంపీ వారితో విభేదాలు తలెత్తడం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది.

విడదల రజనీ తో….

లావు శ్రీకృష్ణ దేవరాయలు యువకుడు. రాయపాటి సాంబశివరావును ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. ముఖ్యమంత్రి జగన్ కు కూడా సన్నిహితుడు. అయితే ఆయన వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీతో ఆయనకు పొసగలేదు. దీనికి కారణం ఆయన మరో నేత మర్రి రాజశేఖర్ ను చేరదీయడమే. ఇందులో ఎంపీ తప్పుకంటే ఎమ్మెల్యే విడదల రజనీ తప్పులే ఎక్కువగా కనపడటంతో హైకమాండ్ సయితం పెద్దగా పట్టించుకోలేదు.

వినుకొండలోనూ విభేదాలు….

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో కూడా విభేదాలు తలెత్తాయి. వినుకొండ నియోజకవర్గంలో 2004 లో కాంగ్రెస్ తరుపున మక్కెన మల్లికార్జునరావు విజయం సాధించారు. ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఆయనను వైసీపీలోకి తీసుకురావడం బొల్లా బ్రహ్మనాయుడుకు ఇష్టంలేదు. తన నియోజకవర్గంలో ప్రజలను నేరుగా మక్కెన ఎంపీ లావు దగ్గరకు తీసుకు వెళుతుండటంతో ఆయన హర్ట్ అయ్యారు. అందుకే వినుకొండ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ఆహ్వానం పంపడం లేదు. ఎంపీని పక్కన పెట్టారు. ఈ విషయాన్ని బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ నేతల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఎంపీ లావు అందరినీ కలుపుకుని పోగలిగితేనే మరోసారి విజయం దక్కుతుందంటున్నారు.

Tags:    

Similar News