వెళ్లరు… పనిచేయరు.. ప్రయోజనమేంటి?

వారంతా రాజ‌కీయంగా సీనియ‌ర్లు. కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్నారు. అయితే.. రాష్ట్ర విభ‌జ‌న‌తో అడ్రస్ గ‌ల్లంత‌వుతుంద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో టీడీపీ సైకిల్ ఎక్కారు. దీంతో ఇంకే [more]

;

Update: 2021-09-07 13:30 GMT

వారంతా రాజ‌కీయంగా సీనియ‌ర్లు. కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్నారు. అయితే.. రాష్ట్ర విభ‌జ‌న‌తో అడ్రస్ గ‌ల్లంత‌వుతుంద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో టీడీపీ సైకిల్ ఎక్కారు. దీంతో ఇంకే ముంది.. వీరివ‌ల్ల పార్టీ పుంజుకుంటుంది.. వ‌చ్చే 30 ఏళ్లపాటు పార్టీ అధికారంలోనే కొన‌సాగుతుంద‌ని.. భావించిన చంద్రబాబు.. ఇలా వ‌చ్చిన వారికి ప‌ద‌వులు ఇచ్చారు. ప్రాధాన్యం పెంచారు. వారు అడిగిందే త‌డ‌వుగా వారి కోరిక‌లు కూడా తీర్చారు. కానీ, తీరా చూసుకుంటే.. ఒక్క ఓట‌మితో .. వీరంతా పార్టీలో త‌ట‌స్థులుగా మారిపోయారు. ఉన్నారు అనే పేరుకు ఉన్నప్పటికీ.. పార్టీ కోసం.. అటు పుల్ల తీసి ఇటు వేయ‌డం కూడా చేయ‌డం లేదు.

జేసీ సోదరులు…

దీంతో ఇప్పుడు ఇలాంటివారిని వ‌దిలించుకుంటారా ? లేదా ? అనే డిమాండ్లు.. టీడీపీలో అంత‌ర్గతంగా వినిపిస్తున్నాయి. విష‌యంలోకివెళ్తే.. అనంత‌పురం జిల్లాను తీసుకుంటే.. జేసీ దివాక‌ర్‌రెడ్డి, ప్రభాక‌ర్‌రెడ్డి సోద‌రులు రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. టీడీపీలోకి వ‌చ్చారు. అనంత ఎంపీ.. తాడిప‌త్రి ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకుని 2014లో గెలుపుగుర్రం ఎక్కారు. త‌ర్వాత‌.. వారి వ్యాపారాల‌ను డెవ‌ల‌ప్ చేసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌ట్టుబ‌ట్టి వార‌సుల‌కు టికెట్లు ఇప్పించుకున్నారు. కానీ, ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీకి ఎలాంటి ప్రయోజ‌నం వీరివ‌ల్ల క‌ల‌గ‌డం లేదు. పైగా దివాక‌ర్ రెడ్డి పూర్తిగా న్యూట్రల్ అయిపోయార‌నే వాద‌న ఉంది.

టీడీపీ వల్ల గెలిచానని…?

ఇక‌, తాడిప‌త్రి స్థానిక ఎన్నిక‌ల‌ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ప్రభాక‌ర్‌.. క‌నీసం మాట మాత్రంగా అయినా.. టీడీపీ వ‌ల్ల గెలిచాన‌ని చెప్పుకొనేందుకు ఇష్టప‌డ‌డం లేదు. పార్టీ కార్యక్రమాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. మ‌రి వీరి వల్ల ప్రయోజ‌నం ఏంట‌ని నాయ‌కులు ప్రశ్నిస్తున్నారు. ఇక‌, క‌ర్నూలు జిల్లాకు చెందిన కోట్ల కుటుంబం ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆయ‌న స‌తీమ‌ణి సుజాత‌మ్మలు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ పంచ‌న చేరి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకున్నారు. కానీ, ఓడిపోయారు. ఇక‌, అప్పటి నుంచి న్యూట్రల్ అయ్యారు. మ‌రి వీరిని కొన‌సాగిస్తారా? వ‌దులుకుంటారా? తేల్చాలంటూ.. పార్టీలో చ‌ర్చ సాగుతోంది.

రాధాను చేర్చుకున్నా….?

ఇక‌, విజ‌య‌వాడ‌కు చెందిన యువ నాయ‌కుడు, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత వంగ‌వీటి రాధాను చంద్రబాబు ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేర్చుకున్నారు. ఆయ‌న ప‌రిస్థితి కూడా ఇప్పుడు ఇలానే ఉంది. ఆయ‌న‌ను కూడా పార్టీలో కొన‌సాగిస్తారా ? ప‌క్కకు త‌ప్పిస్తారా ? అనేది చ‌ర్చగా మారింది. పైగా రాధా పార్టీ కోసం చేస్తోంది అయితే ఏం లేదు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో చేరిన అవుట్ డేటెడ్ లీడ‌ర్లు ప‌న‌బాక ల‌క్ష్మి, వైరిచ‌ర్ల కిషోర్ చంద్రదేవ్ లాంటి వాళ్లను ఇంకా న‌మ్ముకుని ప‌దే ప‌దే ఎందుకు ఛాన్సులు ఇస్తార‌న్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమ‌వుతున్నాయి.

సతమతమవుతూ….

ఒక్క ఈ జిల్లాలే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నేత‌లు..టీడీపీలో త‌టస్థులుగా ఉన్నారు. వీరివ‌ల్ల టీడీపీకి ప్రయోజ‌నం లేక‌పోగా.. అంత‌ర్గత క‌ల‌హాలు పెరుగుతున్నాయ‌ని అంటున్నారు సీనియ‌ర్లు. ఈ నేప‌థ్యంలో ఏం చేయాల‌నేది.. చంద్రబాబుకు ఇబ్బందిక‌రంగా మారింది. వారంత‌ట వారు పోరు.. పొమ్మని చంద్రబాబు చెప్పలేరు. వెర‌సి.. పార్టీ మాత్రం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న మాట వాస్త‌వం.

Tags:    

Similar News