ఒక్క అద్వానీకేనా….??

గాంధీ నగర్.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకొచ్చేది లాల్ కృష్ణ అద్వానీ. గుజరాత్ లోని ఈ లోక్ సభ నియోజకవర్గంతో ఆయనకు అవినాభావ సంబంధం [more]

;

Update: 2019-04-07 16:30 GMT

గాంధీ నగర్.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకొచ్చేది లాల్ కృష్ణ అద్వానీ. గుజరాత్ లోని ఈ లోక్ సభ నియోజకవర్గంతో ఆయనకు అవినాభావ సంబంధం ఉంది. రాష్ట్ర రాజధాని కేంద్రమైన ఇక్కడి నుంచి అద్వానీ అనేకమార్లు గెలిచారు. ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారు. అద్వానీని, గాంధీనగన్ ను వేరు చేసి చూడటం అసాధ్యం. అటువంటి అత్యుత్తమ నాయకుడిని నియోజకవర్గానికి దూరం చేసింది కమలం పార్టీ. ఈసారి ఆయనను బరిలోకి దించకుండా పార్టీ తప్పిదం చేసిందని, ఇందుకు మూల్యం చెల్లించక తప్పదని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

అద్వానీని పక్కన పెట్టి…

ఒకసారి, రెండుసార్లు కాదు ఏకంగా ఏడుసార్లు ఈ కురువృద్ధుడు ఇక్కడి నుంచి లోక్ సభకు వెళ్లారు. అదీ ఆషామాషీ గెలుపుతో కాదు. అద్వితీయ మెజారిటీతో పార్లమెంటులోకి అడుగుపెట్టారు. 1989 నుంచి ఆయన ఇక్కడి నుంచి వరుసగా పోటీ చేస్తూ వస్తున్నారు. జైన్ హవాలా కుంభకోణంలో అద్వానీ పేరున్నట్లు ఆరోపణలు రావడంతో 1996 లో పోటీకి దూరంగా ఉన్నారు. అప్పట్లో అటల్ బిహారీ వాజ్ పేయి ఇక్కడి నుంచి గెలిచారు. 2014 వరకూ వరసగా గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో 4,83,121 ఓట్ల భారీ మెజారిటీతో విజయఢంకా మోగించారు. 91 ఏళ్ల కురువృద్ధుడి పేరు పార్టీ టిక్కెట్ల జాబితాలో లేదు. దానికి ఎవరూ సరైన వివరణ ఇవ్వడం లేదు. అధికారికంగా పార్టీ ఎటువంటి కారణం పేర్కొనలేదు. అద్వానీ తన బదులు తన కూతురికి టక్కెట్ కోరినట్లు వార్తలు వచ్చాయి. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే అద్వానీ కూతురికి టిక్కెట్ ఎలా ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఏదైనా ఈ కురువృద్ధుడి పట్ల పార్టీ తగిన గౌరవం, కృతజ్ఞత చూపలేదన్నది నిజం. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ కారణాలు చెప్పి ఉంటే ఒకింత గౌరవంగా ఉండేది.

గెలుస్తారు కానీ….

అద్వానీ స్థానంలో ఆయన శిష్యుడు అమిత్ షా పోటీ చేస్తున్నారు. అద్వానీ కనుసన్నల్లో షా పెరిగి పెద్దవాడయ్యాడన్నది వాస్తవం. గతంలో గాంధీనగర్ లో అద్వానీ తరుపున అలుపెరగకుండా ప్రచారం చేసిన అమిత్ షా ఇప్పుడు ఏకంగా ఆయన టిక్కెట్ కే ఎసరు పెట్టడం విధి వైపరీత్యమని చెప్పక తప్పదు. సబర్మతీ తీరాన విస్తరించిన గాంధీనగర్ నియోజకవర్గం ఆది నుంచి కమలానికి కంచుకోట. దేశమంతటా బీజేపీ వ్యతిరేక గాలులు వీచిన సమయంలోనూ ఇక్కడ కాషాయ జెండా రెపరెపలాడింది. ఈ లోక్ సభ స్థానం పరిధిలో సబర్మతి, సనంద్, కోలల్, విజలానగర్, ఘటియోదియా, గాంధీనగర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అమిత్ షా విజయం తధ్యమైనప్పటికీ చెమటోడ్చక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడి ప్రజలు అద్వానీని కులమతాలు, ప్రాంతాలు, వర్గాలకు అతీతంగా ఆదరించారు. అమిత్ షాకు అంతటి సానుకూలత లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అద్వానీని మేరు శిఖరంగా పరిగణించే ప్రజలు అమిత్ షాను సాధారణ రాజకీయ నాయకుడిలాగానే పరిగణిస్తారు. అందువల్ల షా విజయం అనివార్యం అయినప్పటికీ అద్వానీలా భారీ మెజారిటీ అసాధ్యం. వివిధ సామాజిక వర్గాలను ఒకేతాటిపైకి తీసుకురావడం అసాధ్యం. పాటీదార్ లు ఇక్కడ బలమైన సామాజిక వర్గం. బీజేపీకి ఈ సామాజిక వర్గం ఎంతవరకూ మద్దతిస్తుందనేది ప్రశ్నార్థకమే.

వీళ్ల సంగతేంటి….?

2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ, విపక్ష కాంగ్రెస్ సయితం గౌరవ ప్రదమన స్థానాలను సాధించిన విషయం మరచి పోకూడదు. నాటి ఎన్నికల్లో మొత్తం 180 స్థానాలకు 150 సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పార్టీ 99 స్థానాలకే పరిమితమం కావడం గమనార్హం. జీఎస్టీ, నోట్ల రద్దు, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు తదితర అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపగలవన్నది విశ్లేషకుల అభిప్రాయం. హస్తం పార్టీ ఏ అభ్యర్థిని నిలబెట్టినా షా విజయాన్ని అడ్డుకోలేరన్నది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గట్టి పోటీ ఇవ్వగలగడం, మెజారిటీ తగ్గించగలగడం తప్ప విజయాన్ని తారుమారు చేసే శక్తి కాంగ్రెస్ కు ఉండదన్నది వాస్తవం. గెలుపోటములను పక్కన పెడితే అనేక మంది పార్టీ నాయకుల పుత్రరత్నాలు సీట్లు సంపాదించారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుందర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ ప్రస్తుత ఎంపీ. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర ఎపంీ. ముంబయి సెంట్రల్ ఎంపీ పూనమ్ దివంగత నేత ప్రమోద్ మహాజన్ కూతురు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అద్వానీ విషయంలో పార్టీ నిర్ణయం సరైంది కాదని ఎవరికైనా అనిపిస్తుంది.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News