అంతా పెత్తనమే…పక్కా ప్రణాళికగానే?

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు తప్పని సరి ఎన్నికలు జరిపేందుకు పెద్దలు నిర్ణయించారు. కానీ పెత్తనం మాత్రం అధికారంలో ఉండేవారికే దాఖలయ్యేలా పక్కాగానే ప్రణాళిక వేశారు. [more]

Update: 2020-03-10 15:30 GMT

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు తప్పని సరి ఎన్నికలు జరిపేందుకు పెద్దలు నిర్ణయించారు. కానీ పెత్తనం మాత్రం అధికారంలో ఉండేవారికే దాఖలయ్యేలా పక్కాగానే ప్రణాళిక వేశారు. పార్టీ ఎవరిదైనప్పటికీ కనీసం ఎన్నికైన ప్రతినిధులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలంటే విధులు, నిధులు తప్పనిసరి. వాటిపైన ప్రజాస్వామ్య ప్రభువుల కరుణ ప్రసరించడం లేదు. అదే పెద్ద సమస్య, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఎప్పుడైతే పంచాయతీలను, పురపాలక సంస్థలను వదిలేశారో అప్పుడే వాటి ఎన్నికలకు ఉండే పవిత్రత పోయింది. నచ్చితే పెడతారు? ఇబ్బందికరమైన పరిస్థితులుంటే ఇష్టారాజ్యంగా వాయిదా వేస్తుంటారు. దేశంలో శాసనసభ, లోక్ సభలు ఎంత ముఖ్యమో, పంచాయతీలు సైతం అంతే ప్రధానం. దీనిని గుర్తించడానికి ఎవరూ ఇష్టపడరు. పై స్థాయిలోనే ప్రభుత్వాలు పెత్తనం చేయాలనుకోవడంతోనే గ్రామస్థాయిల్లో జరగాల్సిన పనులు సాగడం లేదు. విద్య, వైద్యం పడకేశాయి. మౌలిక వసతులూ దూరమైపోయాయి. గ్రామసీమలు స్వయంసమృద్ధంగా విలసిల్లే అవకాశాలను కనుచూపుమేరలో కానరావడం లేదు. ఇది రాష్ట్రప్రగతికి, దేశ అభ్యుదయానికి కూడా నష్టదాయకమే.

భయం… భక్తి…..

గతంలో పంచాయతీ ప్రెసిడెంట్ల పేరు చెబితే గ్రామప్రజల్లో భయం , భక్తి తొంగి చూసేవి. నిజంగా తమ గ్రామ వసతులు, ప్రజల కోసం వారు పాటుపడేవారు. కొంచెం పెత్తందారీ వైఖరి కనిపించినప్పటికీ వివిధ వర్గాల ప్రజలు సహనంతో కలిసిమెలిసి నడిచేలా చూసేవారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా కలుపుకుపోయే ధోరణి కనిపించేది. ప్రెసిడెంటు మాట అంటే ప్రజలు పాటించేవారు. సర్పంచ్ ఏ పార్టీకి సానుభూతిపరుడు అయినప్పటికీ ప్రజలందరిలో గౌరవం ఉండేది. ఇప్పుడు రాజకీయాల్లో పార్టీల విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. అందువల్ల గ్రామసీమలు కక్షలు, కార్పణ్యాలకు వేదికలుగా మారుతున్నాయి. పార్టీ రాజకీయాలు పతాకస్థాయిలో గ్రామాల్లోనే కనిపిస్తున్నాయి. గ్రామాల్లో కొన్ని కుటుంబాల మధ్య గతంలోనూ విభేదాలుండేవి. అవి ఇప్పుడు పార్టీ విభేదాలుగా రూపుదాల్చాయి. మొత్తమ్మీద అటు రాజకీయ పార్టీలు, ఇటు ప్రభుత్వ పెత్తందారీ ధోరణులు వెరసి పంచాయతీలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయిన పరిస్థితే కనిపిస్తోంది. ప్రాథమిక విద్య, వైద్యం, పశువైద్యం, వ్యవసాయ కేంద్రం, మంచినీరు,రోడ్లు వంటివాటిపై పూర్తిగా గ్రామాలకే అధికారం దఖలు చేసి నిధులు కేటాయించాలి. వాటిపైన ప్రభుత్వం తన అధికారాన్ని వదులుకోకపోవడంతో సర్పంచులు, వార్డు సభ్యులు నామమాత్రంగా మిగిలిపోతున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలలకు రాకపోయినా, వైద్యులు ఆస్పత్రులను సందర్శించకపోయినా పట్టించుకునే నాథుడే లేడు.

పార్టీల కుయుక్తి…

ప్రభుత్వంలో ఏ పార్టీ కొనసాగినప్పటికీ స్థానిక సంస్థలను తమ చేతిపనిముట్లుగానే వాడుకుంటున్నాయి. ఆయా పాలక వర్గాల్లో తాము ఆధిక్యంలో ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప మరే విధంగానూ వాటిని పరిపుష్టం చేసేందుకు ప్రయత్నించడం లేదు. కొంతవరకూ పంచాయతీలు పర్వాలేదనిపించినా జెడ్పీటీసీ, ఎంపీటీసీ వంటి వ్యవస్థల ప్రయోజనాలపైనే అనేక ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వం వారికి బాధ్యతలు కేటాయించదు. నిధులు, విధులు ఉండవు. ఆయా సంస్థలను తమ కనుసన్నల్లో పెట్టుకోవాలని సర్కారు చూస్తుంది. స్థానికంగా చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరోరకంగా వారి పట్ల వ్యవహరిస్తుంటారు. పార్టీ సభలు, సమావేశాలకు జనసమీకరణ, పెద్ద నాయకుల పర్యటనలకు హడావిడి చేయడం వంటి పార్టీ కార్యక్రమాలకే స్థానిక సంస్థల ప్రతినిధులను పరిమితం చేస్తున్నారు. దీనివల్ల స్థానిక ప్రజాప్రతినిధులు డమ్మీలుగా మిగిలిపోతున్నారు. చట్టసభల ప్రతినిధులు మాత్రం అన్నిటా తామై అధికారం చెలాయిస్తున్నారు. నిజానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు విధానపరమైన నిర్ణయాలు, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశాలపై ద్రుష్టి పెట్టాలి. ప్రభుత్వం నుంచి నియోజకవర్గాలకు నిధులు తెచ్చే పనిలో నిమగ్నం కావాలి. కానీ పనుల అప్పగింతలు మొదలు పర్యవేక్షణ వరకూ ఎమ్మెల్యేలే కీలకంగా ఉంటున్నారు. ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాటి అధ్యక్షులు నామమాత్రమైపోతున్నారు.

నేతి బీరగా మారేనా..?..

గ్రామ స్వరాజ్యం నేతిబీర కాయచందమై కూర్చుంది. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రప్రభుత్వాలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయో అదే విధంగా స్థానిక సంస్థలకు సైతం అధికారాల పంపిణీ జరగాలి. నిజానికి రాష్ట్రాల పరిధిలోని 29 అధికారాలను స్థానిక వ్యవస్థలకు బదిలీ చేయాలని 73,74 రాజ్యాంగ సవరణలు సూచిస్తున్నాయి. కానీ కాల వ్యవధి, తప్పనిసరి లేకపోవడంతోనే ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాలుగా వాటిని పునర్నిర్వచించి రాజ్యాంగబద్ధత కల్పించకపోతే ఆయా సంస్థల ఏర్పాటులోని మౌలిక లక్ష్యమే అర్థరహితమవుతుంది. ప్రభుత్వాలు ఈ అంశాన్ని కొంత సీరియస్ ద్రుక్పథంతోనే చూడాలి. పార్టీలు, వ్యక్తిగత అధికారాలు శాశ్వతం కాదు. వ్యవస్థలు ముఖ్యం. వాటిని బలోపేతం చేయడం ద్వారానే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. స్థానిక సంస్థలు సక్రమంగా పనిచేస్తేనే ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుంది. నిరంతరం ప్రజాజీవనంతో ముడిపడిన వ్యవస్థలు అవి. ప్రభుత్వం వివిధ పథకాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అవి సద్వినియోగమయ్యేలా చూడాలన్నా స్థానిక సంస్థల భాగస్వామ్యం అవసరం. నిజమైన లబ్ధిదారులు, అవసరాలు లోకల్ ప్రతినిధులకే తెలుస్తాయి. వారిని సమర్థంగా వినియోగించుకోవడంపై ద్రుష్టి పెడితేనే ప్రయోజనదాయకం. ఎన్నికలలో ఎలాగూ అధికారపార్టీ కే ఆధిక్యం దక్కుతుంది. మనకు చాలా ఎన్నికలు నేర్పిన సత్యమిది. అందువల్ల ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రభుత్వం అంతే గౌరవంగా స్థానిక వ్యవస్థల బాధ్యతలను సైతం గుర్తిస్తే మంచిది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News