వాయిదాతో ఫాయిదా లేకుండా పోయిందే?

ఏపీ ప్రభుత్వం కరోనా వైరస్ ను మరింత కట్టడి చేసే ఛాన్స్ ను కొద్దిలో తప్పిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో గ్రామాల్లో నిఘా వ్యవస్థగా [more]

;

Update: 2020-04-04 11:00 GMT

ఏపీ ప్రభుత్వం కరోనా వైరస్ ను మరింత కట్టడి చేసే ఛాన్స్ ను కొద్దిలో తప్పిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో గ్రామాల్లో నిఘా వ్యవస్థగా చెప్పుకునే సర్పంచ్ లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లేరు. కేవలం పదిహేను రోజులు ఆగి ఉంటే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయి ఉండేది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది.

నిర్ణయం సరైనదైనా?

ఎన్నికల కమిషన్ నిర్ణయం సరైనదే కావచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు పూర్తయి ఉంటే ప్రభుత్వానికి ఎంతో ఉపయుక్తంగా ఉండేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. గ్రామాల్లో సర్పంచ్ లు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టడి చేసేవారు. పోలీసులు ప్రతి గ్రామంలో ఉండరు. అంత పెద్ద సంఖ్యలో మన పోలీసు వ్యవస్థ లేదు. దీంతో గ్రామాల్లో స్వీయ నిర్భంధం పాటించడం లేదు.

సర్పంచ్ లు లేకపోవడంతో…..

వాలంటీర్ల వ్యవస్థ ఉన్నప్పటికీ వారి మాటలను బేఖాతరు చేస్తున్నారు కొందరు. అదే సర్పంచ్ అయితే వారి మాటకు విలువ ఉండేది. భయంతోనైనా స్వీయ నిర్భంధాన్ని పాటించి ఉండేవారు. ఏపీలోని అనేక గ్రామాల్లో స్వీయ నిర్భంధాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోక పోవడం ఆందోళన కల్గిస్తుంది. దీనికి తోడు గ్రామాల్లో ఉన్న దుకాణాల్లో సరుకులు కూడా అయిపోవడంతో వారు కూడా రెండు రోజులుగా తెరవకపోవడంతో వారంతా మండల కేంద్రాలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణలో అయితే?

అదే తెలంగాణలో సర్పంచ్ లే కథానాయకులుగా మారారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో సర్పంచ్ గ్రామాల్లో పహారా కాస్తున్నారు. తమ గ్రామాల్లోకి ఎవరిని రానివ్వ కుండా కంచెను ఏర్పాటు చేస్తున్నారు. పొలం పనులు పూర్తి చేయడానికి కూలీలను ఏర్పాటు చేసి సహకరిస్తున్నారు. కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు. పంట చేతికి వచ్చినా కూలీలు అందుబాటులో లేకుండా పోయారు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ప్రభావం చూపుతుందని అంటున్నారు.

Tags:    

Similar News