పవర్ ఉన్నప్పుడే… అది పోయాక?
రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అప్పటిదాకా నాకే సీటు.. నాదే టికెట్ అనుకున్నవారు కూడా పక్కకు వెళ్లిపోవాల్సిన పరిస్థితిని గత ఏడాది ఎన్నికల్లో అన్ని [more]
;
రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అప్పటిదాకా నాకే సీటు.. నాదే టికెట్ అనుకున్నవారు కూడా పక్కకు వెళ్లిపోవాల్సిన పరిస్థితిని గత ఏడాది ఎన్నికల్లో అన్ని [more]
రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అప్పటిదాకా నాకే సీటు.. నాదే టికెట్ అనుకున్నవారు కూడా పక్కకు వెళ్లిపోవాల్సిన పరిస్థితిని గత ఏడాది ఎన్నికల్లో అన్ని పార్టీల్లోనూ చూశాం. అది వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా.. గెలుపు గుర్రాలకే టికెట్లు అనే మాట వాస్తవం. ఎంత రాజకీయ చరిత్ర ఉన్నా.. ఎంత పలుకుబడి ఉన్నా.. నాయక గణాన్ని అధినాయకులు పక్కన పెట్టారు. ఇందులో పరిస్థితులు సహకరించనప్పుడు కొందరు నాయకులను పార్టీ అధినాయకత్వం పక్కన పెట్టడం కామన్. మరి కొందరు బయటకు వెళ్లేలా పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేత మాగంటి వెంకటేశ్వరరావు ఉరఫ్ బాబుకు ఏర్పడిందనే చర్చ సాగుతోంది.
వారసుడి కోసం……
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాగంటి బాబు తన రెండో కుమారుడు రాంజీకి తన రాజకీయ వారసత్వ పగ్గాలు అప్పగించాలని డిసైడ్ అయ్యి ఆయనకు కీలకమైన జిల్లా తెలుగు యువత పగ్గాలు వచ్చేలా చక్రం తిప్పారు. ఏలూరు ఎంపీ స్థానం నుంచి 2014లో గెలిచిన ఆయన తర్వాత అనారోగ్యంతో ఐదేళ్ల పాటు గతంలో ఉన్నంత యాక్టివ్‌గా లేరు. ఈ సమయంలో ఆయన కుమారుడు రాంజీ రాజకీయ అరంగేట్రం చేసి సైకిల్ ఎక్కారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడుగా ఎంపికయ్యారు. తనదైన శైలిలో ఆయన దూసుకుపోయారనడంలో సందేహం లేదు. అయితే, గత ఏడాది ఎన్నికల్లో తన తండ్రి ఓడిపోయిన తర్వాత ఆ ప్రభావం రాంజీపై పడిందని అంటున్నారు. స్థానికంగా కూడా రాంజీ కేంద్రంగా చర్చ సాగుతోంది. తండ్రిని గెలిపించుకునేందుకు రాంజీ సహా ఆయన కుటుంబం మొత్తం ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయినా కూడా ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు మాగంటి బాబు.
పట్టించుకోవడం లేదట….
ఎన్నికల్లో పార్టీ ఓడిపోయి యేడాది అవుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా ఉన్న రాంజీ.. వెనుకబడ్డారు. మాగంటి ఓటమి తర్వాత రాంజీ రాజకీయాలపై మబ్బులు కమ్ముకున్నాయి. అప్పటి వరకు టచ్‌లో ఉన్న చంద్రబాబు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ఇప్పుడు రాంజీ ఫోన్‌కు స్పందించడం లేదట. అంతేకాదు, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ.. ఆయనకు తెలియకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలతో మాగంటి కుమారుడు మైనస్ అయ్యారని టీడీపీలో జోరుగా చర్చ సాగుతోంది.
కార్యక్రమాలు చేపట్టకపోవడంతో…
ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాంజీ కొన్ని వర్గాలనే వెంటేసుకుని తిరిగారన్న అపవాదు కూడా ఆయనపై ఉంది. మరోపక్క, తాము ఇన్నాళ్లు పార్టీ కోసం ఎంతో కృషి చేశామని, కానీ, ఒక్క ఓటమితోనే పార్టీ తమను పక్కన పెట్టడం సరైంది కాదని మాగంటి తన అనుచరులతో చెప్పుకొంటున్నారు. బాబు బృందం మరో రకంగా దీనిపై స్పందిస్తోంది. పార్టీతరఫున ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం లేదని ఆయన గతంలో ఉన్నంత యాక్టివ్‌గా ఉండడం లేదని అందుకే పక్కన పెట్టారని పార్టీ నేతలు అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ….
ఇటీవల స్థానిక ఎన్నికల్లో రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు అయిన చింతలపూడి, పోలవరంలో కూడా మాగంటి బాబు ఎంత మాత్రం పట్టించుకోలేదు. ఈ లెక్కన చూస్తే వచ్చే ఎన్నికల్లో తండ్రి వారసత్వం అందిపుచ్చుకుని ఏలూరు ఎంపీగా పోటీ చేయాలనుకుంటోన్న రాంజీ ఆశలు అడియాసలే అయ్యేలా ఉన్నాయి. ఇప్పుడు పార్టీ పరిస్థితి మైనస్‌గా ఉన్న నేపథ్యంలో రేపటి రోజున పార్టీ పుంజుకుంటే ఏలూరు ఎంపీగా పోటీ చేసేందుకు బడా బడా పారిశ్రామికవేత్తలు, నాయకులు రంగంలో ఉంటారు. మరి వారిని కాదని తనకు సీటు వచ్చేలా అధిష్టానాన్ని మెప్పించేలా రాంజీ రాజకీయాల్లో కష్టపడతారో ? లేదో ? తాజా పరిణామాలతో పాటు టీడీపీ ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో రాంజీ భవిష్యత్ రాజకీయాలు ఎలా సాగుతాయనే చర్చ జోరుగా సాగుతోంది.