ఈక్వేషన్లు కుదరవేమో బాబూ?

రాజ‌కీయ కుటుంబంలో పుట్టి.. పుట్టుక‌తోనే రాజ‌కీయాలు ఒంట‌బ‌ట్టించుకున్న నాయ‌కుడిగా ప్రజ‌ల మ‌ధ్య పేరుతెచ్చుకున్న మాస్ లీడ‌ర్‌.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు. [more]

;

Update: 2020-06-10 15:30 GMT

రాజ‌కీయ కుటుంబంలో పుట్టి.. పుట్టుక‌తోనే రాజ‌కీయాలు ఒంట‌బ‌ట్టించుకున్న నాయ‌కుడిగా ప్రజ‌ల మ‌ధ్య పేరుతెచ్చుకున్న మాస్ లీడ‌ర్‌.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు. ఆయ‌న త‌ల్లీ, తండ్రీ కూడా రాజ‌కీయ నేత‌లే. ఒకే కుటుంబం నుంచి త‌ల్లి, తండ్రితో పాటు కొడుకు కూడా మంత్రిగా ప‌నిచేసిన ఘ‌న‌త ఈ కుటుంబానిదే. వారి వారసుడిగా కాంగ్రెస్‌లో చ‌క్రం తిప్పి.. ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి బాబు త‌ర్వాత అనూహ్య కార‌ణాల‌తో టీడీపీ బాట‌ప‌ట్టారు. త‌న‌కు ఎమ్మెల్యేగా వెళ్లాల‌ని ఉన్నప్పటికీ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఒత్తిడితో మాగంటి బాబు ఏలూరు నుంచి 2014లో ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. నిజానికి గ‌త ఏడాది ఎన్నడూలేంది.. మాగంటి ఫ్యామిలీ అంతా ఎన్నిక‌ల ప్రచారంలోకి దిగినా ఫ‌లితం ద‌క్కలేదు స‌రిక‌దా జ‌గ‌న్ సునామీలో వైసీపీ ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ ఏకంగా 1.65 ల‌క్షల మెజార్టీతో విజ‌యం సాధించారు.

ప్రజల మధ్యకు రాకుండా…..

ఇది మాగంటి బాబుకి ఓట‌మి అన‌డం క‌న్నా ఘోర ఓట‌మే అని ఒప్పుకోవాలి. ఎన్నికల్లో ఓడిపోయిన‌ప్పటి నుంచి ఆయ‌న ఇటు పార్టీలోనూ అటు ప్రజ‌ల మ‌ధ్య కూడా క‌నిపించ‌డం లేదు. అయితే, ఎన్నిక‌ల‌కు ముందు ఏడాది ఆయ‌న తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. సో.. ఇప్పుడు కూడా అదే పేరు చెప్పి ఆయ‌న త‌న వ్యాపారాలు, వ్యవ‌హారాల్లోనే మునిగిపోయార‌ని మాగంటి బాబు వ్యతిరేక వ‌ర్గం ప్రచారం చేస్తోంది. వాస్తవానికి మాస్ నాయ‌కుడిగా.. ఢీ అంటే ఢీ అనే నేత‌గా ఆయ‌న‌కు ప్రజ‌ల్లో మంచి పేరుంది. కోడి పందేల విష‌యంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా అనే పేరు కూడా తెచ్చుకున్నారు. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు ప్రజ‌ల మ‌ధ్యకు రావ‌డం లేదు.

పార్టీపై అసహనంతోనేనా?

పైకి.. మాత్రం మాగంటి బాబుకు ఆరోగ్యం బాగోలేదు.. అని ఆయ‌న వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నా.. లోలోన మా త్రం పార్టీ వ్యవ‌హార శైలితో ఆయ‌న విసిగిపోయార‌నే ప్రచారం ఉంది. ఇప్పుడు పార్టీలో ఆయ‌న‌ను ప‌ల‌కరించే వారు కూడా క‌రువ‌య్యారు. స్థానికంగా ఆయ‌న ఎంపీగా ఉన్న స‌మ‌యంలో ప‌లు అసెంబ్లీ నియోజ క‌వ‌ర్గాల్లో ఆయ‌న అన్నీతానై వ్యవ‌హ‌రించారు. దీంతో కొంద‌రు ఎమ్మెల్యేలు ఆయ‌న‌కు అప్పట్లోనే దూర‌మ‌య్యారు. పార్టీ అధికారంలో ఉండ‌గా మాగంటి బాబు తీరుతో మాజీ మంత్రి పీతల సుజాత‌, పోల‌వ‌రం మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనుతో ఆయ‌న‌కు తీవ్ర విబేధాలు ర్ప‌డ్డాయి. చివ‌ర‌కు వీరిద్దరికి సీటు రాకుండా చేయ‌డంలో మాగంటి బాబు స‌క్సెస్ అయ్యారు. పోనీ.. త‌న‌కు చేరువైన వారితో అయినా ఆయ‌న రిలేష‌న్ కొన‌సాగించ‌లేక పోయారు. దీంతో ఇప్పుడు ఇప్పుడు మాజీలు ఎవ‌రూ కూడా మాగంటి బాబును ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది.

అన్నింటికి దూరంగా…

ఇక‌, తాను ఎలాగూ ఎంపీగా గెల‌వ‌లేన‌ని, త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చాల‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్రబాబుకు మాగంటి బాబు విన్నవించారు. అయితే, బాబు మ‌ళ్లీ ప‌ట్టుబ‌ట్టి ఆయ‌న‌ను ఏలూరు నుంచే పోటీ చేయించారు. అదే స‌మ‌యంలో యువ నేత‌గా ఉన్న త‌న కుమారుడు రాంజీకి పార్టీలో ఇప్పటి వ‌రకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. దేవినేని అవినాష్ పార్టీని వీడి వెళ్లిన త‌ర్వాత ఖాళీ అయిన తెలుగు యువ‌త అధ్యక్ష ప‌ద‌విని త‌న కుమారుడికి ఇవ్వాల‌ని మాగంటి బాబు పార్టీ అధిష్టానాన్ని కోరారు. అయితే, ఇప్పటి వ‌రకు దీనిపై క్లారిటీ లేదు. దీంతో మాగంటి అటు పార్టీకి, ఇటు ప్రజ‌ల‌కు కూడా దూరంగా ఉంటున్నార‌నేది నిజ‌మ‌ని మరికొంద‌రు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి…?

ఇక వ‌చ్చే ఎన్నికల నాటికి మాగంటి బాబు ప్రత్యక్ష రాజ‌కీయాల‌కు దూర‌మ‌వుతార‌ని అంటున్నారు. ఇక మాగంటి బాబు వ‌ర్గం మాత్రం బాబు గారు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటార‌ని.. ఆయ‌న త‌న‌యుడు రాంజీ ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని చెపుతున్నారు. అయితే ఈక్వేష‌న్ల ప‌రంగా దెందులూరులో క‌మ్మ వ‌ర్గం నేత ప్రభాక‌ర్ ఉండ‌గా.. ఏలూరులో రాంజీకి సీటు రావ‌డం అసాధ్యం. మ‌రి ఈ లెక్కన మాగంటి బాబు కుటుంబ రాజ‌కీయాలు వ‌చ్చే రోజుల్లో ఏ తీరానికి చేర‌తాయో ? చూడాలి.

Tags:    

Similar News