మాగంటి ప్లేస్‌లోకి బావొస్తున్నాడా…!

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్పడం క‌ష్టం. నిన్నటిలా ఈ రోజు.. ఈ రోజులా రేపు ఉండే అవ‌కాశం రాజ‌కీయాల్లో క‌ష్టమే. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు [more]

Update: 2020-09-22 14:30 GMT

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్పడం క‌ష్టం. నిన్నటిలా ఈ రోజు.. ఈ రోజులా రేపు ఉండే అవ‌కాశం రాజ‌కీయాల్లో క‌ష్టమే. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు పార్లమెంటు మాజీ నేత‌, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు మాగంటి బాబు. మాగంటి ఫ్యామిలీకి 125 ఏళ్ల రాజ‌కీయ హిస్టరీ ఉంది. ఆయ‌న తండ్రి, త‌ల్లి కూడా రాజ‌కీయాలు చేశారు. తెలుగు రాజ‌కీయాల్లో ఏ కుటుంబానికి లేని విధంగా తండ్రి, త‌ల్లి, కొడుకు ముగ్గురు ఒకే పార్టీ నుంచి మంత్రులు అయిన ఘ‌న‌త కూడా ఈ ఫ్యామిలీకే ద‌క్కింది. ఇక‌, మాగంటి బాబు కూడా దాదాపు 30 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఎంపీగా గెలిచారు. ఎమ్మెల్యేగా చ‌క్రం తిప్పారు. మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత టీడీపీలోకి వ‌చ్చారు. ఈ క్రమంలోనే మాగంటి బాబు ఏలూరు ఎంపీగా 2009లో పోటీ చేసి ఓడిపోయారు.

పార్టీకి దూరంగా ఉండటంతో…

అయినా ప‌ట్టుద‌ల‌తో పార్టీని ముందుకు న‌డిపించి మాగంటి బాబు 2014లో విజ‌యం సాధించారు. అయితే, అనారోగ్యం కార‌ణంగా గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకొంటార‌ని అనుకున్నారు. కానీ, చివ‌రి నిముషంలో ఆయ‌నే పోటీకి దిగారు. అయితే, కుటుంబం మొత్తం ప్రచారం చేసినా.. ఆయ‌న ఓడిపోయారు. ఇదిలావుంటే, ఇప్పుడు మాగంటిబాబు యాక్టివ్‌గా లేరు. పోనీ.. జిల్లా తెలుగు యువ‌త అధ్యక్షుడిగా ఉన్న మాగంటి బాబు కుమారుడు రాంజీ అయినా దూకుడుగా ఉన్నారా? అంటే అది కూడా లేదు. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు మాగంటి బాబు కుటుంబంపై ఆశ‌లు వ‌దులుకుంటోన్న సంకేతాలు అయితే వ‌దిలారు. ఇప్పుడు ఏలూరు లోక్‌స‌భ పార్టీ ప‌గ్గాల‌ను ఎవ‌రికి ఇవ్వాల‌నే అంశంపై త‌ర్జన భ‌ర్జన‌లు ప‌డ‌డంతో పాటు ఓ నేత‌ను ఎంపిక చేస్తే ఎలా ఉంటుంద‌న్న అభిప్రాయం ఈ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఇన్‌చార్జ్‌ల‌తో చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.

ఆయన బావకు పగ్గాలు…..

ఇక్కడ పార్టీ ప‌గ్గాల‌ను మాగంటి బాబుకు స‌మీప బంధ‌వు, బావ వ‌రుస అయ్యే కొమ్మారెడ్డి రాంబాబుకు ఇచ్చే అంశంపై బాబు ఆలోచ‌న చేస్తున్నట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. రాంబాబు ఆర్థికంగా బాగున్నారు. పైగా ఈయ‌న‌ అన్న.. కొమ్మారెడ్డి మాధ‌వ‌రావు.. 1999లో దెందులూరు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అంటే, రాజ‌కీయంగా ఈ కుటుంబానికి ప్రాధాన్యం ఉంది. అయితే, ఓట‌మి త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నప్పటికీ.. మాగంటి బాబుకు అన్ని విధాలా స‌పోర్టు చేస్తున్నారు.

ఏలూరు పార్లమెంటు కన్వీనర్ గా…..

ఈ నేప‌థ్యంలో ప్రస్తుతం క‌న‌క మ‌హాల‌క్ష్మి బ్యాంకు ఎండీగా ఉన్న రాంబాబుకు ఏలూరు పార్లమెంటు పార్టీ ప‌గ్గాలు అప్పగిస్తే సామాజిక ఈక్వేష‌న్ల‌తో పాటు ఆర్థిక‌కోణంలోనూ బెట‌ర‌ని చంద్రబాబు యోచిస్తున్నట్టు ప్రచారం జ‌రుగుతోంది. ఆర్థికంగా స‌మ‌ర్ధుడిగా ఉండ‌డం, రాజ‌కీయ నేప‌థ్యం కూడా బాగుండ‌డం వంటివి రాంబాబుకు క‌లిసి వ‌స్తున్న ప‌రిణామాలుగా చెప్పుకొంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు కాక‌పోయినా.. మ‌రో ఆరు నెల‌ల త‌ర్వాతైనా ఆయ‌న‌కు పార్టీ ప‌గ్గాలు అప్పగించొచ్చనే ప్రచారం జ‌రుగుతోంది. అయితే వ్యాపారాల్లో త‌ల‌మున‌క‌లై ఉన్న రాంబాబు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో టీడీపీలో యాక్టివ్ అవుతారా ? అని కొంద‌రు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News