మాగంటి రాజకీయాలకు తెరదించేసిన చంద్రబాబు…?
తెలుగు రాజకీయాల్లో మాగంటి కుటుంబానికి 130 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం. మాజీ మంత్రి, మాజీ ఎంపీ మాగంటి బాబు తాత మాగంటి సీతారామదాసు ప్రముఖ స్వాతంత్య్ర [more]
తెలుగు రాజకీయాల్లో మాగంటి కుటుంబానికి 130 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం. మాజీ మంత్రి, మాజీ ఎంపీ మాగంటి బాబు తాత మాగంటి సీతారామదాసు ప్రముఖ స్వాతంత్య్ర [more]
తెలుగు రాజకీయాల్లో మాగంటి కుటుంబానికి 130 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం. మాజీ మంత్రి, మాజీ ఎంపీ మాగంటి బాబు తాత మాగంటి సీతారామదాసు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు పొందారు. అప్పటి నుంచి ప్రారంభమైన ఈ కుటుంబ రాజకీయ ప్రస్థానం నేటి మాగంటి రాంజీ వరకు కంటిన్యూ అవుతూ వస్తోంది. తెలుగు రాజకీయాల్లో ఏ కుటుంబానికి లేని అరుదైన ఘనత మాగంటి ఫ్యామిలీకే దక్కింది. తండ్రి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, తల్లి మాగంటి వరలక్ష్మీ దేవితో పాటు కుమారుడు మాగంటి బాబు ముగ్గురూ సమైక్య రాష్ట్రంలో మంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా కూడా గెలిచిన మాగంటి బాబు ఆ తర్వాత వైఎస్‌తో విబేధించి టీడీపీలోకి వచ్చారు. 2009లో ఎంపీగా ఓడిన మాగంటి బాబు 2014లో టీడీపీ నుంచి ఎంపీగా విజయం సాధించారు.
ఎవరితోనూ సఖ్యత లేక…..
టీడీపీ నుంచి ఎంపీగా గెలిచాక మాగంటి బాబుకు తన లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లతో తీవ్రమైన విబేధాలు ఏర్పడ్డాయి. మాజీ మంత్రి పీతల సుజాతతో పాటు అప్పటి పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనుతో తీవ్రమైన గ్యాప్ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీలో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక నూజివీడులో నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు మాగంటి బాబుకు మధ్య కూల్ వాటర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండింది. ఇక కైకలూరులోనూ మాగంటి బాబు గ్రూపు సపరేట్‌గా ఉంది. చివరకు ఎన్నికలకు ముందు చంద్రబాబు మాగంటి బాబుకు ఎన్నిసార్లు చెప్పినా ఆయన తీరు మారకపోవడంతో చంద్రబాబుకు సైతం బాబుపై తీవ్రమైన అసహనం కలిగింది. ఒకానొక దశలో మాగంటి బాబును కాదని బోళ్ల రాజీవ్‌కు ఎంపీ సీటు ఇవ్వాలనుకున్నా కొందరు ఎమ్మెల్యేల లాబీతో చివరకు బాబుకే సీటు ఇచ్చారు.
వారసుడికి ఛాన్స్ ఇవ్వాలంటూ….
గత ఎన్నికల్లో మాగంటి బాబు ఏకంగా 1.65 లక్షల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఇక గత ఎన్నికల్లో ఓడిన బాబు రాజకీయంగా యాక్టివ్‌గా ఉండడం లేదు. ఇక ఆయన తనయుడు మాగంటి రాంజీ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దేవినేని అవినాష్ ఖాళీ చేసిన ఏపీ తెలుగు యువత అధ్యక్ష పదవిపై సైతం ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఏలూరు ఎంపీ సీటు తనదే అన్న ధీమాతో ఉన్నట్టు టాక్..? మాగంటి బాబు కూడా తాను తప్పుకుని తన వారసుడికి లైన్ క్లీయర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మాగంటి ఫ్యామిలీ రాజకీయాలకు చంద్రబాబు తెరదించేశారని టాక్..?
తప్పించేయాలన్న నిర్ణయంతో….
మాగంటి బాబు వయోః భారంతో ఉండడంతో ఆయన్ను పక్కన పెట్టేసి పార్టీ కార్యక్రమాలకు గౌరవంగా వాడుకోనున్నారు. ఇక మాగంటి వారసుడు రాంజీ కనీసం చంద్రబాబు దృష్టిలోనే లేడని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటరీ జిల్లా పార్టీ పగ్గాలు ఇచ్చేందుకు ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేల పేర్లు పరిశీలిస్తోన్న బాబు పార్టీ నేతలతో సైతం ఏలూరు లోక్‌సభ బాధ్యతలు చూసేందుకు మీలో మీరే ఓ అంగీకారానికి వచ్చి ఓ నేత పేరు సూచించండని.. మాగంటి బాబు ఫ్యామిలీ అవసరం లేదని తేల్చేశారట. దీనిని బట్టే ఎప్పుడో 125 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌లో ప్రారంభమైన ఈ ఫ్యామిలీ అప్రతిహత రాజకీయం టీడీపీలో బాబు తెరదించేసినట్టే కనపడుతోంది. ఏదైనా అనూహ్యం జరిగితే తప్పా మళ్లీ ఈ కుటుంబ రాజకీయ వెలుగులు కనపడే పరిస్థితి లేదు.