నా ఇలాకాలో కుదరదంతే…?

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న సయమంలో ముఖ్యమంత్రి , తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ మరింత దూకుడును పెంచారు. ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ [more]

Update: 2019-09-07 17:30 GMT

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న సయమంలో ముఖ్యమంత్రి , తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ మరింత దూకుడును పెంచారు. ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీకి అవకాశమివ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రోజూ ఏదో ఒకప్రాంతంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. గతంలో వామపక్షాలు, టీఎంసీల మాదిరి ఇప్పుడు బీజేపీ, టీఎంసీ నేతలు బలాబలాలు ప్రదర్శిస్తున్నాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలని మమత బెనర్జీ ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.

వాటిని నిలువరిస్తూ….

దీనికి తోడు కాంగ్రెస్, వామపక్షాలను నిలువరించే ప్రయత్నాన్ని పరోక్షంగా మమత చేస్తున్నారు.వచ్చే ఎన్నికలు బీజేపీ వర్సెస్ టీఎంసీల మధ్య అన్నది ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అందుకే మమత బెనర్జీ ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీని దోషిగా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తూ, కమలం పార్టీ బెంగాల్ లో అధికారంలోకి వస్తే జరగబోయేపరిణామాలను కూడా వివరిస్తున్నారు.

జత కట్టేందుకు….

కాంగ్రెస్, వామపక్షాలు కూడా అదే అభిప్రాయంలో ఉన్నాయి. ఒక్కసారి బెంగాల్ మోదీ చేతికి చిక్కిందంటే ఇక చేజిక్కించుకోవడం కష్టమేనన్నది వారి భావన. అందుకే రెండు పార్టీలు మమతతో జతకట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. సహజంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న మమత బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన కమ్యునిస్టులు, కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీని టార్గెట్ చేసుకున్నాయి. వీలుకుదిరితే కొన్ని సీట్లకైనాపరిమితమై దీదీతో మైత్రిని పెట్టుకోవాలని వామపక్షాలు, కాంగ్రెస్ భావిస్తున్నాయి. దీనికి మమత బెనర్జీ నుంచి సానుకూల సంకేతాలు రావాల్సి ఉంది.

ఎన్ఆర్సీ విషయంలో….

దీనికితోడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అసోంలో అమలుపర్చిన ఎన్ఆర్సీ ((national register of citizens)ని రాష్ట్రంలో అమలు పర్చబోనివ్వమంటూ మమత కేంద్రానికి గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ఆర్థిక మాంద్యం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే అని తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. దీనికి వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చాయి. తమ ఇలాకాలో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని సహించేది లేదని మమత వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద ఎన్నికలకు ముందే బీజేపీ, టీఎంసీల మధ్య వార్ పశ్చిమ బెంగాల్ లో మొదలయింది.

Tags:    

Similar News