వైసీపీలో.. మార్గాని.. మార్గం అర్థం కావడం లేదా?
వైసీపీకి మొత్తం 22 మంది ఎంపీలున్నారు. వీరిలో రాజమండ్రి నుంచి గెలిచిన యువ ఎంపీ, ఉన్నత విద్యావంతుడు మార్గాని భరత్ రూటు సెపరేటు అనే వ్యాఖ్యలు తరచుగా [more]
;
వైసీపీకి మొత్తం 22 మంది ఎంపీలున్నారు. వీరిలో రాజమండ్రి నుంచి గెలిచిన యువ ఎంపీ, ఉన్నత విద్యావంతుడు మార్గాని భరత్ రూటు సెపరేటు అనే వ్యాఖ్యలు తరచుగా [more]
వైసీపీకి మొత్తం 22 మంది ఎంపీలున్నారు. వీరిలో రాజమండ్రి నుంచి గెలిచిన యువ ఎంపీ, ఉన్నత విద్యావంతుడు మార్గాని భరత్ రూటు సెపరేటు అనే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తున్నాయి. తనకు అనకూలంగా ఉంటే.. ఒక విధంగా తనకు వ్యతిరేకంగా ఉంటే మరో విధంగా సదరు ఎంపీగారు వ్యవహరిస్తున్నా రని అంటున్నారు. ప్రస్తుతం మార్గాని భరత్ వ్యవహారం ఇటు నియోజకవర్గంలోనూ, అటు వైసీపీలోనూ తీవ్రస్థాయిలో చర్చకు దారితీస్తోంది. విషయంలోకి వెళ్తే.. కొత్తగా ఎన్నికైన మార్గాని భరత్ కి వైసీపీ అధినేత సీఎం జగన్ దగ్గర మంచి పలుకుబడి ఉంది. జగన్ కూడా మార్గానిని బాగానే రిసీవ్ చేసుకుంటారు.
కయ్యానికే ప్రాధాన్యత….
అయితే, ఎన్నికలకు ముందు అందరితోనూ కలిసిపోయి.. ముందుకు సాగిన మార్గాని భరత్ తర్వాత మాత్రం తన ఎంపీ నియోజకవర్గం కిందకు వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో కయ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇసుక, మట్టి వంటి వ్యాపారాల్లో వైసీపీ నేతలు వేళ్లు పెడుతు న్నారనే విషయంలో వాస్తవం ఎంత ఉందో లేదో తెలియదు కానీ.. మార్గాని భరత్ మాత్రం ఈ ఉచ్చులో పడ్డారని చెబుతున్నారు. అంటే.. తన నియోజకవర్గంలోని గోదావరి నది నుంచి కొందరు సొంత పార్టీ నేతలే ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని .. ఇందుకు పరోక్షంగా మార్గాని భరత్ సహాయ సహకారాలు ఉన్నాయని అంటున్నారు.
జగన్ కు ఫిర్యాదు….
ఇక మార్గాని భరత్ వ్యవహారంతో ఇబ్బంది పడుతోన్న ఆయన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేల్లో కొద్ది రోజులుగా భరత్‌కు పొసగడం లేదు. ఇక ఇప్పుడు కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా భరత్‌పై జగన్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మార్గాని భరత్ తీరుతో తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని రాజా సహనం నశించి జగన్‌కే ఫిర్యాదు చేశారని అంటున్నారు. దీంతో మార్గాని భరత్ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కేశారు. అదే సమయంలో ఆవ భూముల కుంభకోణానికి సంబంధించి కూడా మార్గానిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, వీటిపై ఏకంగా సీఎం జగన్ ఆధారాలు సేకరించి ఉతికి ఆరేశారని వైసీపీ వాళ్లే చర్చించుకుంటున్నారు.
పక్కన పెట్టేసి….
దీంతో మొత్తంగా ఎంపీగా ఎన్నికై ఏడాది కూడా పూర్తి కాకుండా నే మార్గానిపై విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి తన నియోజకవర్గంలో కొవ్వూరు ఎమ్మెల్యే కమ్ మంత్రి వనితతో తప్ప మార్గాని భరత్ ఎవరితోనూ కలిసిమెలిసి ముందుకు సాగిన పరిస్థితి లేదు. గతంలో జక్కంపూడి రాజా జోక్యం చేసుకుని మార్గానితో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కానీ, ఎప్పుడైతే.. ఇసుక లూటీ చేస్తున్నారంటూ.. జగన్‌కు ఫిర్యాదు చేశారో అప్పటి నుంచి పక్కన పెట్టారు. ఇక, రాజమండ్రి ఎంపీ నియోజకవర్గం కిందకు వచ్చే రూరల్, సిటీలు టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మార్గాని భరత్ ని పట్టించుకోకుండానే తమ పనులు తాము చేసుకుని పోతున్నారు.
కలుపుకుని పోతే తప్ప….
సిటీలో రాజకీయ ఆధిపత్యం నేపథ్యంలో ఎంపీ మార్గాని భరత్ కి అక్కడ వైసీపీ నేతలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీగా.. మిగిలిన వైసీపీ నేతలను కలుపుకొని పోవాల్సి ఉన్నప్పటికీ.. మార్గాని భరత్ మాత్రం న దారిలో తాను వ్యవహరిస్తుండడం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. ఇప్పటికైనా తన ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకుని అందరినీ కలుపుకొని పోవాలని మార్గానికి సూచిస్తున్నారు పార్టీలోని సీనియర్లు.