ముళ్లపూడి మళ్లీ కావాల్సి వచ్చారా?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు చోటు చేసుకుంటాయో చెప్పడం క‌ష్టం. ఎప్పుడు నాయ‌కుల ద‌శ తిరుగుతుందో కూడా చెప్పే ప‌రిస్థితి ఉండ‌దు. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు [more]

;

Update: 2019-11-30 03:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు చోటు చేసుకుంటాయో చెప్పడం క‌ష్టం. ఎప్పుడు నాయ‌కుల ద‌శ తిరుగుతుందో కూడా చెప్పే ప‌రిస్థితి ఉండ‌దు. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా టీడీపీ కీల‌క నాయ‌కుడు మాజీ జ‌డ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు. ఆయ‌న‌కు పార్టీపై ప‌ట్టు ఎక్కువ‌. ఎలాంటి స‌మ‌స్యపైనైనా అన‌ర్గళంగా మాట్లాడే నేర్పు కూడా ఉంది. జిల్లాలో మెట్ట ప్రాంతంలో మాస్ లీడ‌ర్‌గా మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆయ‌న తాడేప‌ల్లి గూడెం నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించాల‌ని క‌సితో ఉన్నారు. పార్టీని అన్ని విధాలా అన్ని స‌మయాల్లోనూ ఆయ‌న అండ‌గా ఉన్నారు. దీంతో చంద్రబాబు ముళ్లపూడి బాపిరాజుకు 2009లో ఛాన్స్ ఇచ్చారు. అయితే, అప్పటి ప్రజారాజ్యం, వైఎస్ హ‌వాల ముందు ముళ్లపూడి బాపిరాజు నిల‌వ‌లేక పోయారు. దీంతో ఆయ‌న మూడో స్థానానికే ప‌రిమిత‌మ‌య్యారు.

జడ్పీ ఛైర్మన్ ఇచ్చినా….

అయిన‌ప్పటికీ.. తాను ఓడిపోయినా..పార్టీని ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఐదేళ్ల పాటు పార్టీని బ‌తికించారు. నియోజ‌వ‌ర్గంలో స‌మ‌స్యల‌పై దృష్టి పెట్టారు. ప్రజ‌ల‌కు చేరువయ్యారు. పాద‌యాత్ర చేశారు. కార్యక‌ర్తల‌ను స‌మీక‌రించారు. వారిలో ధైర్యం నింపారు. మొత్తంగా పార్టీని తాడేప‌ల్లిగూడెంలో బ‌లంగా నిల‌పేందుకు ముళ్లపూడి బాపిరాజు ప్రయ‌త్నించారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల్లో ఈ టికెట్ త‌న‌కేన‌ని, గెలుపు గుర్రం ఎక్కడం కూడా ఖాయ‌మేన‌ని ముళ్లపూడి బాపిరాజు భావించారు. అయితే, అనూహ్యంగా ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఈటికెట్‌ను ఆ పార్టీకి త్యాగం చేయాల్సి వ‌చ్చింది. దీంతో ముళ్లపూడి బాపిరాజు ఆశ‌ల‌పై పొత్తు నీళ్లు ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు ఆయ‌న కృషిని గుర్తించి జిల్లా ప‌రిష‌త్ చైర్మన్ ప‌ద‌విని అప్పగించారు.

గూడెం సీటుకు యత్నించినా…

ఇక‌, 2014లో ఇక్కడ నుంచి గెలిచిన బీజేపీ నేత మాణిక్యాల‌రావుతో నిత్యం ఘ‌ర్షణ ప‌డుతూనే పార్టీని డెవ‌ల‌ప్ చేయ‌డంపై ముళ్లపూడి బాపిరాజు దృష్టి పెట్టారు. అప్పటి మంత్రితో గొడ‌వ విష‌యంలో బాబు ముళ్లపూడి బాపిరాజుకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినా ముళ్లపూడి బాపిరాజు వెన‌క్కి త‌గ్గలేదు. చివ‌ర‌కు బీజేపీతో పొత్తు క‌ట్ అయ్యాక మ‌ళ్లీ ముళ్లపూడి బాపిరాజు గూడెం సీటు టార్గెట్‌గా ప‌నిచేశారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో తాడేప‌ల్లిగూడెం టికెట్ కోసం అనేక రూపాల్లో ప్రయ‌త్నించారు. గత నాలుగేళ్లు కూడా ఆయ‌న ఇక్కడ పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేప‌ట్టారు.

నాని దూరమవ్వడంతో….

అయితే, సామాజిక వ‌ర్గ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో బాబు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఈలి నానికి ఛాన్స్ ఇచ్చారు. కానీ, జ‌గ‌న్ హ‌వా ముందు నాని నిల‌బ‌డ‌లేక పోయారు. దీంతో ఆయ‌న ఓడిపోయారు. అయిన‌ప్పటికీ.. పార్టీలో ఉన్నారా? అంటే అదీ లేదు. పార్టీకి దూరంగానే ఉంటున్నారు. చివ‌ర‌కు బాబు నాలుగు రోజుల పాటు జిల్లాలో ప‌ర్యటించి గూడెం స‌మీక్ష చేసినా డుమ్మా కొట్టేశారు. వైసీపీ వాళ్లతో చెట్టా ప‌ట్టాలేసుకుని తిరుగుతూ ఆ పార్టీకి ద‌గ్గర‌య్యార‌న్న టాక్ కూడా ఆయ‌న‌పై వ‌చ్చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు తాడేప‌ల్లి గూడెం బాధ్యత‌ల‌ను చూసేందుకు నాయ‌కులు అవ‌స‌ర‌మ‌య్యారు. దీంతో ఎప్పటి నుంచో ఇక్కడ బాధ్యత‌ల‌ను చూస్తున్న ముళ్లపూడి బాపిరాజుకే ఈ నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌లు అప్పగించాల‌ని చంద్రబాబు దాదాపు నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News