ముళ్లపూడికి బాబు మార్క్ షాక్‌లు కంటిన్యూనేనా?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జ‌డ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌పై పెద్ద డైల‌మాయే న‌డుస్తోంది. 2009 ఎన్నిక‌ల్లో తాడేప‌ల్లిగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడో స్థానంతో [more]

Update: 2020-11-16 02:00 GMT

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జ‌డ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌పై పెద్ద డైల‌మాయే న‌డుస్తోంది. 2009 ఎన్నిక‌ల్లో తాడేప‌ల్లిగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడో స్థానంతో స‌రిపెట్టుకున్న ముళ్లపూడి బాపిరాజుకు 2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు నేప‌థ్యంలో సీటు ఇవ్వలేదు. దీంతో ప‌శ్చిమ‌గోదావ‌రి జ‌డ్పీచైర్మన్ పీఠం క‌ట్టబెట్టారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు బాపిరాజు దూకుడు రాజ‌కీయాలే చేశారు. అప్పుడు గూడెం ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న పైడికొండ‌ల మాణిక్యాల‌రావుతో నిరంత‌రం ఢీ అంటే ఢీ అనేవారు. చివ‌ర‌కు చంద్రబాబు సైతం బాపిరాజును వెన‌క్కు త‌గ్గాల‌ని ప‌దే ప‌దే చెప్పినా వినిపించుకోలేదు.

టిక్కెట్ కావాలని అడిగినా…..

ఒక్క మాణిక్యాల‌రావుతో మాత్రమే కాదు మాజీ మంత్రి పీత‌ల సుజాత‌, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంక‌టేశ్వర‌రావుతో పాటు చివ‌ర‌కు దెందులూరు మాజీ ఎమ్మెల్యే, విప్ చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌తో రాజ‌కీయ ఆధిప‌త్య పోరు న‌డిచింది. చివ‌ర‌కు ఎన్నిక‌ల్లో తాడేప‌ల్లిగూడెం సీటు కోసం ముళ్లపూడి బాపిరాజు విశ్వప్రయ‌త్నాలు చేశారు. గూడెం కానిప‌క్షంలో మ‌రో సీటు అయినా ఇవ్వాల‌ని బాపిరాజు చేసిన లాబీయింగ్ ఫ‌లించ‌లేదు. చివ‌ర‌కు తాడేప‌ల్లిగూడెం కూడా మాజీ ఎమ్మెల్యే ఈలి నానికి క‌ట్టబెట్టారు. ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డంతో ముళ్లపూడి బాపిరాజు రాజ‌కీయంగా క్రియాశీలంగా ఉండ‌డం లేదు.

యాక్టివ్ గా లేకుండా….

ఎన్నిక‌ల్లో త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన గోపాల‌పురంలో కూడా టీడీపీ ఏకంగా 37 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఎన్నిక‌ల త‌ర్వాత బాపిరాజు విజ‌య‌వాడ‌కే ఎక్కువుగా ప‌రిమితం అవుతున్నార‌న్న టాక్ ఉంది. గూడెంలో ఓడిన ఈలి నాని క్రియాశీల‌కంగా ఉండ‌డం లేదు. పైగా ఆయ‌న వైసీపీలోకి వెళ్లే ఏర్పాట్లు చేసుకుంటున్నార‌న్న ప్రచారం కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో గూడెం పార్టీ ప‌గ్గాల కోసం ముళ్లపూడి బాపిరాజు చేసిన ప్రయ‌త్నాల‌ను పార్టీ ప‌ట్టించుకోలేదు. తాజాగా పార్టీ రాష్ట్ర క‌మిటీల ఏర్పాటులో అయినా త‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్టబెడ‌తార‌ని ఆయ‌న ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నా అవి కూడా నీరుకారిపోయాయి.

హైకమాండ్ లైట్ తీస్కోవడంతో…..

ముళ్లపూడి బాపిరాజుకు తాజా క‌మిటీల్లో రాష్ట్ర కార్య నిర్వాహ‌క కార్యద‌ర్శి ప‌ద‌వితో స‌రిపెట్టేశారు. దీనిని బ‌ట్టే బాపిరాజును పార్టీ అధిష్టానం ఎంత లైట్ తీస్కొందో అన్న చ‌ర్చలు న‌డుస్తున్నాయి. బాపిరాజుతో పోలిస్తే ఎలాంటి అంచ‌నాలు లేని వాళ్లకు సైతం కీల‌క ప‌ద‌వులు రావ‌డంతో పాటు చంద్రబాబు బాపిరాజు సామాజిక వ‌ర్గంలోనే ఇత‌ర నేత‌ల‌పై ఎక్కువ న‌మ్మకం పెట్టుకున్నట్టు క‌న‌ప‌డ‌డంతో బాపిరాజు వ‌ర్గానికి మింగుడు ప‌డ‌డం లేదు. ఈ పరిణామాల నేప‌థ్యంలో బాపిరాజు వ‌ర్గానికి చెందిన నేత‌లు తాము పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తామంటూ హ‌డావిడి చేస్తున్నారు. ఏదేమైనా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జ‌డ్పీచైర్మన్‌గా ఓ వెలుగు వెలిగిన బాపిరాజుకు ఇప్పుడు ఆయ‌న దూకుడు రాజ‌కీయ‌మే ఆయ‌న‌కు మైన‌స్‌గా మారిన వాతావ‌ర‌ణం కనిపిస్తోంది. మ‌రి త‌ర్వాత అయినా బాపిరాజుకు బాబు ప్రయార్టీ ఇస్తారా ? గూడెం ప‌గ్గాలు అప్పగిస్తారా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News