ముళ్లపూడి ఆశలు ఆవిరి… బాబు పక్కన పెట్టడానికి అదే కారణమా ?
పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి రెండు దశాబ్దాలకు పైగా దిక్కూ దివాణం లేని నియోజకవర్గాల్లో ఒకటిగా తాడేపల్లిగూడెం ఉంది. ఈ నియోజకవర్గంలో గత కొంత కాలంగా పార్టీని నడిపించే [more]
;
పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి రెండు దశాబ్దాలకు పైగా దిక్కూ దివాణం లేని నియోజకవర్గాల్లో ఒకటిగా తాడేపల్లిగూడెం ఉంది. ఈ నియోజకవర్గంలో గత కొంత కాలంగా పార్టీని నడిపించే [more]
పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి రెండు దశాబ్దాలకు పైగా దిక్కూ దివాణం లేని నియోజకవర్గాల్లో ఒకటిగా తాడేపల్లిగూడెం ఉంది. ఈ నియోజకవర్గంలో గత కొంత కాలంగా పార్టీని నడిపించే నాథుడు లేకపోవడంతో ఎట్టకేలకు స్థానిక ఎన్నికల వేళ చంద్రబాబు కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించారు. తాడేపల్లిగూడెం టీడీపీ కొత్త ఇన్‌చార్జ్‌గా వలవల మల్లిఖార్జునరావు (బాబ్జీ) ని నియమిస్తూ ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ సీటుపై కొండంత ఆశతో ఉన్న పశ్చిమ జడ్పీమాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు పెద్ద షాకే తగిలినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జడ్జీఛైర్మన్ గా…..
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో పశ్చిమగోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ముళ్లపూడి బాపిరాజు ఓ వెలుగు వెలిగారు. పశ్చిమ జడ్పీచైర్మన్ గా ముళ్లపూడి బాపిరాజు చూపించిన దూకుడు రాష్ట్ర పార్టీలోనే కాకుండా.. రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. 2009 ఎన్నికల్లో తక్కువ వయస్సులోనే తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాపిరాజు గణనీయమైన ఓట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. 2009 – 2014 మధ్య ఐదేళ్లలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇటు గూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గాను, అటు సొంత నియోజకవర్గం నల్లజర్లలోనూ ఎక్కడా వెనక్కు తగ్గలేదు.
సీటును త్యాగం చేసి….
2014 ఎన్నికల్లో ముళ్లపూడి బాపిరాజు ఇన్‌చార్జ్ హోదాలో సహజంగానే తాడేపల్లిగూడెం సీటు ఆశించారు. నాడు బీజేపీతో పొత్తులో సీటు త్యాగం చేసిన బాపిరాజుకు చంద్రబాబు పశ్చిమ జడ్పీచైర్మన్ పదవి ఇచ్చారు. జిల్లాలో ఎంతో మంది మహామహులు పెద్ద వయస్సులో చేపట్టిన ఈ పదవి బాపిరాజుకు అతి చిన్న వయస్సులోనే దక్కింది. బాపిరాజుకు ఇతరత్రా ఆరోపణలు లేకపోయినా మెట్ట ప్రాంతంలో… ముఖ్యంగా రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో తన వర్గాన్ని ఎంకరేజ్ చేస్తూ ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలిగించారన్న అపవాదు ఎదుర్కొన్నారు.
అప్పటి మంత్రితో…
అటు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మాజీ మంత్రి మాణిక్యాలరావుతో నిత్యం ముళ్లపూడి బాపిరాజు ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉండేవారు. ఇక ఎన్నికలకు ముందు పదవి ఉండగా హడావిడి చేసిన ఆయన ఆ తర్వాత చాలా వరకు సైలెంట్ అయిపోయారు. బాపిరాజు సొంత నియోజకవర్గం అయిన గోపాలపురంలో కూడా టీడీపీ 37 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఎన్నికల తర్వాత పార్టీని కూడా ఆయన పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అటు తాడేపల్లిగూడెంలో పార్టీ దీనస్థితిలో ఉన్నా ఆయన దృష్టి పెట్టిందీ లేదు. ఆయన ఎక్కువుగా విజయవాడలోనే నివాసం ఉంటోన్న పరిస్థితి.
సామాజిక సమీకరణాలే…?
ఎన్నోసార్లు దూకుడు తగ్గించుకోవాలని బాబు డైరెక్టుగా చెప్పిన మాటలను కూడా ముళ్లపూడి బాపిరాజు పెడచెవిన పెడుతూ వచ్చారు. ఇటీవల పార్టీ పదవుల్లోనూ ఏదో ఒక పదవి కట్టబెట్టేసి సరిపెట్టేశారు. ఇక సామాజిక సమీకరణలు కూడా బాపిరాజుకు గూడెం ఇన్‌చార్జ్ పదవి ఇవ్వడానికి ప్రధాన అడ్డంకిగా మారాయి. ఈ క్రమంలోనే బాపిరాజుకు గూడెం పార్టీ పగ్గాలు దక్కలేదు. రాజకీయంగా ఎలాంటి గ్రౌండ్ ( తనకంటూ ఓ నియోజకవర్గం) లేని ఆయన ఇప్పుడు పార్టీ కోసం యధావిధిగా కష్టపడతారా ? లేదా ? ఎలాంటి అడుగులు వేస్తారన్నది చూడాలి.