విశాఖకు ఇంతమంది ఎంపీలా ?

ఆలూ లేదు, చూలూ లేదు అన్నట్లుగా సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ల వ్యవధి ఉండగానే బెర్తులు కన్ ఫర్మ్ చేసుకునే పనిలో నేతాశ్రీలు ఉన్నారు. ఇక రాజకీయ [more]

;

Update: 2021-05-14 02:00 GMT

ఆలూ లేదు, చూలూ లేదు అన్నట్లుగా సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ల వ్యవధి ఉండగానే బెర్తులు కన్ ఫర్మ్ చేసుకునే పనిలో నేతాశ్రీలు ఉన్నారు. ఇక రాజకీయ పార్టీలు కూడా అపుడే వచ్చే ఎన్నికల గురించి ఆలోచనలు చేస్తున్నాయి. ముందుగా అధికార వైసీపీ విషయానికి వచ్చే విశాఖ ఎంపీ సీటుని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అతి తక్కువ మెజారిటీతో గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున ఎంవీవీఎ సత్యనారాయణ గెలిచారు. ఆయనకు గెలిచిన తరువాత సొంతంగా తన పలుకుబడిని పెంచుకోలేకపోయారు అన్న విమర్శలు సొంత పార్టీ నుంచే ఉన్నాయి.

కాపు కార్డుతో….

దాంతో వైసీపీ వచ్చే ఎన్నికలలో కాపు కార్డుని ఉపయోగించాలని చూస్తోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గా పనిచేసిన కాపు నాయకుడు పంచకర్ల రమేష్ బాబు ఏడాది క్రితం వైసీపీలో చేరారు. దాంతో ఆయన్ని వచ్చే ఎన్నికల వేళ విశాఖ నుంచి ఎంపీ బరిలో దింపాలని ఆలోచిస్తోంది అంటున్నారు. ఆయన పార్టీలో చేరిన తరువాత ఏ పదవినీ ఇంతవరకూ అప్పగించలేదు. తొందరలో పార్టీ కమిటీలు వేస్తే ఆయనకు విశాఖ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ సీటు ఇవ్వాలని కూడా ప్రతిపాదన ఉందని చెబుతున్నారు. ఇక ఆయన కాకపోతే యాదవ సామాజిక వర్గం నుంచి వంశీక్రిష్ణ శ్రీనివాస్ ని కూడా ఎంపీ సీటుకు పోటీ చేయించాలని కూడా వైసీపీ అధినాయకత్వం వ్యూహంగా ఉందిట. అలాగే వైసీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి సహా అనేక పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి

బీసీకే సీటు …..

ఇక టీడీపీ విశాఖ ఎంపీ సీటుని బీసీకి ఇవ్వాలని ఫిక్స్ అయిందని అంటున్నారు. అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావుని ఈసారి బరిలో దింపాలని చూస్తున్నారు అంటున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున ఆయన పోటీ చేసి టీడీపీని మూడవ స్థానానికి నెట్టేశారు. నాడు కాంగ్రెస్ తరఫున గెలిచిన దగ్గుబాటి పురంధేశ్వరికి అతి తక్కువ మెజారిటీ వచ్చిందంటే పల్లా దూకుడే కారణమని అంటారు. అందువల్ల ఈసారి కమ్మ సామాజికవర్గం నుంచి కాకుండా బీసీలకే విశాఖ ఎంపీ సీటు కేటాయించడం ద్వారా గరిష్ట రాజకీయ లాభాన్ని పొందాలని టీడీపీ చూస్తోందిట.

వీరూ ఎంపీ అభ్యర్ధులే …?

ఇక పార్టీల విషయం పక్కన పెడితే విశాఖ నుంచి వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్ధుల్గా బరిలో ఉండాలనుకుంటున్న వారిలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయ‌ణ ఉన్నారు. ఆయన ఆనాటికి ఏ పార్టీ తరఫున దిగుతారో తెలియదు కానీ కచ్చితంగా విశాఖ ఎంపీగా పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఈసారి ఎంపీగానే పోటీకి తయారు అంటున్నారు. ఆయన కూడా టీడీపీ తరఫున దిగుతారా లేక వేరే పార్టీలోకి మారి పోటీ చేస్తారా అన్నది చూడాలి. ఇక గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిన దగ్గుబాటి పురంధేశ్వరి కూడా మరో మారు విశాఖ నుంచి లక్ ని పరీక్షించుకుంటారు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయి కాబట్టి తాను గెలవడం ఖాయమని ఆమె భావిస్తున్నారు. ఇక మాజీ ఎంపీ హరిబాబు కూడా అవకాశం ఉంటే విశాఖ నుంచి మరో సారి ఎంపీగా పోటీకి రెడీ అంటున్నారు. అదే పార్టీలో ఉన్న కాశీ విశ్వనాధరాజు కూడా తానే బీజేపీ ఎంపీ అభ్యర్ధిని అని ఇప్పటి నుంచే ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి చూస్తే విశాఖ ఎంపీ సీటుకు మాత్రం గట్టి పోటీ ఉంటుందని చెప్పాలి. ఎన్నికలు ఎంతో దూరంలో ఉన్నా కూడా ఎంపీలు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నారు.

Tags:    

Similar News