ఆమె ఎమ్మెల్యేనే.. ఒక్క అసెంబ్లీ సమావేశాల్లోనేనట

ఎస్సీ నియోజకవర్గాల్లో అగ్రకులాల వారిదే పెత్తనం. వారు చెప్పినట్లే నడుచుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజికవర్గం నేతలు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి [more]

Update: 2021-02-14 00:30 GMT

ఎస్సీ నియోజకవర్గాల్లో అగ్రకులాల వారిదే పెత్తనం. వారు చెప్పినట్లే నడుచుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజికవర్గం నేతలు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి సామాజికవర్గం నేతలు ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యేలపై ఆధిపత్యం చూపుతారు. దీనిపై అధినాయకత్వానికి ఎన్ని ఫిర్యాదులు అందినా పెద్దగా ఫలితం ఉండబోదు. అందుకే ఎస్సీ ఎమ్మెల్యేలు రాజీ ధోరణిని అవలంబిస్తున్నారు. ఇక ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి. రంపచోడవరం నియోజకవర్గం పరిస్థితి దాదాపు అలాగే ఉంది.

ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చి….

రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతం. రాష్ట్ర విభజన తర్వాత అత్యధికంగా 11 మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. తెలంగాణలోని భద్రాచలం ప్రాంతంలోని కొన్ని మండలాలు రంపచోడవరం నియోజకవర్గంలో చేరాయి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా నాగులపల్లి ధనలక్ష్మి ఉన్నారు. ఆమె ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే ఆమె ఎమ్మెల్యే కేవలం నామమాత్రమే. ఇక్కడ పెత్తనం చేస్తుంది వైసీపీ నేత అనంత ఉదయ భాస్కర్.

గతంలోనూ ఇదే…..

వైసీపీకి తొలి నుంచి అనంత ఉదయ భాస్కర్ నాయకుడిగా ఉన్నారు. ఆయన చెప్పినట్లుగానే జరగాలి. లబ్దిదారుల ఎంపిక నుంచి సంక్షేమ కార్యక్రమాల అమలు వరకూ అంతా ఆయన కనుసన్నల్లోనే నడవాలి. లేకుంటే ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వంతల రాజేశ్వరి పైన కూడా ఉదయ భాస్కర్ ఇలా పెత్తనం చేయడంతోనే ఆమె విసిగిపోయి అప్పటి అధికార పార్టీ టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికలలో వంతల రాజేశ్వరి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక్కడ టీడీపీలో మూడు గ్రూపులు ఉండటంతో ఉదయ భాస్కర్ మరింత చెలరేగిపోతున్నారంటున్నారు.

అంతా ఆయనే…..

గత ఎన్నికల్లో నాగులపల్లి ధనలక్ష్మిని కూడా అనంత ఉదయభాస్కర్ ఎంపిక చేశారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆయన చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు. అధికారులు కూడా ఉదయభాస్కర్ చెప్పినట్లే నడుచుకుంటుండటం విశేషం. తాను అనుకున్న వారికే ఉదయభాస్కర్ పథకాలను చేరవేస్తుండటంతో ఆ ప్రభావం ఎమ్మెల్యేపై పడుతుంది. ఇప్పుడు ఈమె కూడా ఆయన ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారట. ఈ విషయాన్ని అధినాయకత్వానికి చేరవేసినా ప్రయోజనం లేదంటున్నారు. పార్టీ అక్కడ గెలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించిన ఉదయభాస్కర్ ను పార్టీ అధినాయకత్వం వదులుకోలేకపోతుంది. ఆ వీక్ నెస్ ను ఆసరాగా తీసుకుని ఆయన చెలరేగిపోతున్నారట. మరి పాపం నాగులపల్లి ధనలక్ష్మిని అసెంబ్లీలో మాత్రమే ఎమ్మెల్యేగా గుర్తిస్తారు. నియోజకవర్గంలో మాత్రం ఉదయ భాస్కర్ ఎమ్మెల్యేనట.

Tags:    

Similar News