సీఎం సీటు ఆఫర్… అందుకే జంప్ అట

ఎన్నికలు ఎక్కడ జరిగినా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతుంది. ఏ రాష్ట్రమూ దానికి మినహాయింపు కాదు. త్వరలో ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరిలో సయితం ఇదే పనిని చేపట్టింది. [more]

Update: 2021-02-04 18:29 GMT

ఎన్నికలు ఎక్కడ జరిగినా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతుంది. ఏ రాష్ట్రమూ దానికి మినహాయింపు కాదు. త్వరలో ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరిలో సయితం ఇదే పనిని చేపట్టింది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ గత కొన్నాళ్లుగా లెఫ్గ్ నెంట్ గవర్నర్ ద్వారా ముఖ్యమంత్రి నారాయణస్వామిని ఇబ్బంది పెడుతూ వస్తుంది. కిరణ్ బేడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పెద్దయెత్తున ఆందోళనలు కూడా చేపట్టింది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం కిరణ్ బేడీకి మద్దతు గా నిలిచింది.

బీజేపీ గాలానికి….

ఇక తాజాగా కాంగ్రెస్ నేతలకు బీజేపీ గాలం వేసింది. ముఖ్యనేత, పుదుచ్చేరి మాజీ పీసీసీ అధ్యక్షుడు నమశ్శివాయం ను బయటకు రప్పించగలిగింది. ఎన్నికలకు ముందు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి పడేశారు. దీని వెనక బీజేపీ ప్రమేయం ఉంది. ఇక్కడ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న హామీతోనే నమశ్శివాయం బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దపడ్డారని చెబుతున్నారు.

గత ఎన్నికలకు ముందు….

నమశ్శివాయం ఆషామాషీ నేత కాదు. ఆయన పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి , ఎన్నార్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రంగస్వామికి సమీప బంధువు. రంగస్వామిని నిలువరించేందుకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నమశ్శివాయంను పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ నమశ్శివాయంకు కాకుండా నారాయణస్వామికి కాంగ్రెస్ అధిష్టానం పదవి ఇచ్చింది. అయితే ఆయన గౌరవానికి భంగం కలగకుండా ముఖ్యమంత్రి తర్వాత స్థానాన్ని ఇచ్చింది. 16 శాఖలకు నమశ్శివాయంను మంత్రిగా చేసింది.

ఆ ఆఫర్ ఇవ్వడంతోనే…?

అయితే కాంగ్రెస్ లో ఉంటే తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని భావించిన నమశ్శివాయం గత కొద్ది కాలంగా అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడంపైనా ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఈ అవకాశాన్ని బీజేపీ ఉపయోగించుకుంది. సీఎం ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. నమశ్శివాయం తో పాటు మరో ఎమ్మెల్యే తిప్పాయనందన్ కూడా రాజీనామా చేశారు. మరికొందరు పార్టీని వీడే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఎన్నికల వేళ పుదుచ్చేరిలో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలిందనే చెప్పాలి.

Tags:    

Similar News