జగన్ తర్వాత స్థానం లోకేష్ దేనట… ?

జగన్ తరువాత లోకేషే ఆ విషయంలో రికార్డు కొట్టేట్లు ఉన్నాడు. జగన్ రాజకీయల్లోకి ఎన్ని తిట్లు తిన్నాడో లెక్కే లేదు. విపక్షాలు ఆయన్ని ఈ రోజుకూ విమర్శలు [more]

;

Update: 2021-06-20 08:00 GMT

జగన్ తరువాత లోకేషే ఆ విషయంలో రికార్డు కొట్టేట్లు ఉన్నాడు. జగన్ రాజకీయల్లోకి ఎన్ని తిట్లు తిన్నాడో లెక్కే లేదు. విపక్షాలు ఆయన్ని ఈ రోజుకూ విమర్శలు చేస్తూనే ఉన్నాయి. స్థాయి దిగి మరీ నేతలు జగన్ మీద తూలిన సందర్భాలు ఎక్కువే. ఆ విషయంలో లోకేష్ జగన్ తరువాత స్థానంలోకి వస్తున్నాడు. జగన్ కి ఫ్రాక్షనిస్ట్ అన్న ముద్ర వేయడంలో టీడీపీ విజయం సాధించింది. అయితే దాన్ని వైసీపీ శ్రేణులు కానీ జనాలు కానీ అసలు నమ్మలేదు, కాబట్టే జగన్ జననేత అయ్యాడు. లోకేష్ విషయం అలా కాదు, ఆయన్ని పప్పు అంటూంటే సొంత పార్టీ నేతలే కిమ్మనడంలేదు.

ఎందుకలా…?

ఎంత కాదనుకున్నా లోకేష్ చంద్రబాబు తరువాత నాయకుడు. రేపటి టీడీపీకి ఆయనే పెద్ద దిక్కు. వయసు మీద పడుతున్న చంద్రబాబు మహా అయితే కొన్నాళ్ల పాటే పార్టీ భారాన్ని మోయగలరు. అలాంటపుడు లోకేష్ ని శక్తివంతమైన నేతగా చూపాల్సిన బాధ్యత బాబు ఒక్కరిదే కాదు, ఆ పార్టీ నేతలది కూడా. కానీ చంద్రబాబుని ఏమైనా అంటే ఒక్క లెక్కన లేచే కరడు కట్టిన టీడీపీ కార్యకర్తలు కూడా లోకేష్ ని వైసీపీ నేతలు దారుణంగా పప్పూ అంటూంటే ఏ మాత్రం పట్టనట్లుగా ఉండడం ఆశ్చర్యమే. అంటే లోకేష్ కి నాయకత్వ లక్షణాలు లేవు అని పసుపు పార్టీ కూడా డిసైడ్ అయిపోయిందా అన్నదే అర్ధం కాని విషయం.

ఇంట గెలవాలి…..

ఇక లోకేష్ కూడా తండ్రి చాటు ముద్దు బిడ్డగా రాజకీయాల్లో ఉన్నత పదవిని సంపాదించారు. కానీ జనాలకు మాత్రం ఆయన ఇంకా జూనియరే. అదే సమయంలో టీడీపీకి ఆయనకు మధ్యన ఒక గట్టి కనెక్షన్ ఏర్పడలేదని అర్ధమైపోతోంది. లోకేష్ జగన్ ని, వైసీపీని అనే ముందు ఇంట గెలవాల్సింది చాలా ఉంది. తమ్ముళ్ళను ముందు రంజింపచేయాల్సి ఉంది. పార్టీకి తాను తగిన నాయకుడు అన్న మెప్పు పొందాల్సి ఉంది. ఇవన్నీ మాటలతో వచ్చేవి కావు. లోకేష్ అలా మర్యాద మన్ననా పొందాలీ అంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. పార్టీని కలుపుకుని పోవాలి. పార్టీ నేతల మనసెరిగి వ్యవహరించాలి.

నేలకు దిగాలి …..

ఇక్కడే లోకేష్ కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆయన తండ్రి చంద్రబాబు. దాంతో బాబు మాదిరిగా కొడుకు కూడా అపర చాణక్యం ప్రదర్శించాలి అని క్యాడర్ కోరుకోవడం సహజం. బాబుతో ఎపుడూ చినబాబుని పోలిక పెడుతూ తక్కువ చేయడం కూడా జరుగుతుంది. అందుకే లోకేషే ఈ విషయంలో చాకచక్యంతో వ్యాహరించాలి. తనది తండ్రి పక్క కుర్చీ కాదని, కార్యకర్తల పక్కనే తన చోటు అని వారు గుర్తెరిగేలా ప్రవర్తించాలి. అందుకోసం ఏకంగా ఒకటికి పది మెట్లు కిందకు దిగి రావాలి. చంద్రబాబు వారసుడిగా కాకుండా కార్యకర్తల నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నం చేయాలి. అంతే తప్ప జగన్ ని అర్జంటుగా దింపేస్తే ఆ సీఎం కుర్చీ తనదేనన్న భ్రమలలో ఉంటూ ఆకాశ వీధుల్లో విహరించకూడదు. అహంకారపూరిత‌మైన స్టేట్మెంట్స్ ఇస్తూ జనంలోనూ, పార్టీ జనంలోనూ నవ్వుల పాలు కాకూడదు, లోకేష్ తన తీరు మార్చుకోనంతవరకూ కొడాలి నాని లాంటి వారు పప్పూ అని అంటూనే ఉంటారు. ఇక్కడో విషయం చెప్పాలి. లోకేష్ కర్నూలు టూర్ లో తాను సింహం అని ప్రకటించుకున్నారు. ఆయన రాజకీయ అపరిపక్వతకు అదే నిదర్శనమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఎవరు సింహమో, ఎవరు ఎలుకో అన్నది తేల్చాల్సింది జనాలే మరి.

Tags:    

Similar News