లోకేష్ కి ఒక్క చాన్స్ ఖాయం… ?

టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ కి ఇప్పటిదాకా సొంత పార్టీలోనే పెద్దగా మద్దతు దక్కలేదని చెబుతారు. లోకేష్ చంద్రబాబు కుమారుడు అన్న ట్యాగ్ తోనే టీడీపీలో [more]

Update: 2021-09-11 12:30 GMT

టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ కి ఇప్పటిదాకా సొంత పార్టీలోనే పెద్దగా మద్దతు దక్కలేదని చెబుతారు. లోకేష్ చంద్రబాబు కుమారుడు అన్న ట్యాగ్ తోనే టీడీపీలో హవా చలాయిస్తున్నారు అన్నది కూడా అంతా అంటారు. మరి నారా లోకేష్ ఫ్యూచర్ ఏంటి. ఆయన ఎప్పటికీ కేరాఫ్ చంద్రబాబు గానే మిగిలిపోతారా లేక జగన్ కి పట్టిన అదృష్టం ఆయనకు పడుతుందా. రేపటి రోజున సీఎం గా ఒక వెలుగు వెలుగుతారా అన్న చర్చ టీడీపీ వర్గాలలోనే కాదు, అన్ని రాజకీయ పార్టీలలోనూ ఉంది. దానికి తనదైన విశ్లేషణలతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

తీసిపారేయవద్దట…

తాజాగా ఒక యూట్యూప్ చానల్ లో ఉండవల్లి మాట్లాడుతూ నారా లోకేష్ ని పూర్తిగా తీసిపారేయవద్దు అంటూ ప్రత్యర్ధులకు గట్టిగానే హితవు చెప్పారు. మరి ఆ ప్రత్యర్ధులు ఎవరు అంటే ఒకనాటి తన ప్రియ నేస్తం వైఎస్సార్ కుమారుడు జగన్, ఆయన పార్టీ వారే అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోతే ఆయన పొలిటికల్ గా ఫెయిల్ అయినట్లు కానే కాదని కూడా ఉండవల్లి అంటున్నారు. ఆ మాటకు వస్తే చంద్రబాబు కూడా 1983లో ఓడిపోయారు కదా అంటూ లోకేష్ బాబుకు జోష్ వచ్చేలాగానే మాట్లాడారు. నారా లోకేష్ విషయంలో ఇపుడే ఎవరూ ఒక అంచనాకు రావడం తప్పు అంటున్నారాయన.

బాబు తరువాతనే..?

చంద్రబాబు ఇంకా మరో పదేళ్ల పాటు రాజకీయం చేయగల సత్తా ఉందని కూడా ఉండవల్లి సర్టిఫికేట్ ఇచ్చేశారు. బాబు రాజకీయంగా యాక్టివ్ గా ఉండగా నారా లోకేష్ కి ఇపుడే సీఎం పోస్ట్ ఎందుకు అని కూడా అంటున్నారు. చంద్రబాబు తరువాత కచ్చితంగా లోకేషే టీడీపీకి బెస్ట్ చాయిస్ అని ఉండవల్లి విశ్లేషిస్తున్నారు. నారా లోకేష్ చంద్రబాబుకు సిసలైన వారసుడు అని, ఈ దేశంలో రాజకీయాలలో వారసులకు ఎపుడూ ఆదరణ ఉంటుందని, ఆ విషయంలో నారా లోకేష్ ఏ మాత్రం అతీతుడు కాడని కూడా అంటున్నారు.

ఆదరణ ఖాయమే …

నారా లోకేష్ ఇంకా యువకుడు. ఆయన తన శక్తి సామర్ధ్యాలను నిరూపించుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని కూడా ఉండవల్లి అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో బాబు తరువాత ముఖ్యమంత్రిగా ఒక్క చాన్స్ ని జనం కూడా లోకేష్ కి ఇస్తారని ఉండవల్లి జోస్యం చెబుతున్నారు. అందువల్ల టీడీపీ సీన్ అయిపోయింది, లోకేష్ పప్పు అని ఎవరైనా అనుకుంటే వారికి ఉండవల్లి ఇలా ఝలక్ ఇచ్చారనే అనుకోవాలి. అవును కానీ వైఎస్సార్ ఉన్నపుడు చంద్రబాబు మీద ఒంటి కాలుతో లేచిన ఉండవల్లేనా ఇలా టీడీపీ మీద వారసుడి మీద చల్లని మాటలతో పన్నీటి జల్లు కురిపిస్తున్నారు అని ఎవరైనా ఆశ్చర్యపోతే తప్పు వారిదే. ఎందుకంటే ఇది అచ్చమైన రాజకీయ రంగం. అంతే అనుకోవాలి మరి.

Tags:    

Similar News