అబ్బా…కొడుకుల అగాధం…?
ఇదో సెంటిమెంటు కథగా మారుతోంది తెలుగుదేశం. లోకేశ్, చంద్రబాబు నాయుడిల భావ వైరుద్ద్యాలు పార్టీకి శాపం కాబోతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇంతవరకూ టీడీపీ వారసుడు తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. [more]
;
ఇదో సెంటిమెంటు కథగా మారుతోంది తెలుగుదేశం. లోకేశ్, చంద్రబాబు నాయుడిల భావ వైరుద్ద్యాలు పార్టీకి శాపం కాబోతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇంతవరకూ టీడీపీ వారసుడు తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. [more]
ఇదో సెంటిమెంటు కథగా మారుతోంది తెలుగుదేశం. లోకేశ్, చంద్రబాబు నాయుడిల భావ వైరుద్ద్యాలు పార్టీకి శాపం కాబోతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇంతవరకూ టీడీపీ వారసుడు తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. అయినా అనేక విషయాల్లో చూపుతున్న దూకుడు ప్రతికూల ఫలితాలను ఇస్తోంది. దాంతో చంద్రబాబు నాయుడు పూర్తిగా లోకేశ్ ను నమ్మలేకపోతున్నారు. పార్టీ వ్యవహారాలను యువనేత భుజస్కంధాలపై పెట్టిందుకు సాహసించలేకపోతున్నారు. టీడీపీ అధినేత రాజకీయంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే బాపతు కాదు. ప్రతి నిర్ణయం వెనక కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఎటునుంచి ఎటు తిరిగినా మొగ్గు తనవైపు ఉండేలా చూసుకోవడమే చంద్రబాబు చాణక్యం. ఒకటి రెండు సార్లు వికటించినా అత్యధిక సందర్భాల్లో బాబు వ్యూహాలు ఫలించి , పార్టీని, ఆయనను అందలంపై కూర్చోబెట్టాయి. కానీ లోకేశ్ తీరే వేరు. ముందు వెనక చూసుకోకుండా దూకుడుగా వ్యవహరించి అనేక సార్లు పార్టీని ఇరకాటంలోకి నెట్టేశారు. ఆచితూచి వ్యవహరించాలనే బాబు శైలి ,తాడోపేడో తేల్చుకోవాలనేది తనయుడి ధోరణి. ఈ అభిప్రాయ భేదాలు అంతర్గతంగా పార్టీని పట్టి కుదిపేస్తున్నాయి. తాజా గా పొలిటికల్ హీట్ పెంచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉదంతం ఇందుకు ఒక మచ్చుతునకగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇంకెప్పుడు…..?
అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో స్థిరపడేందుకు అవకాశం ఇవ్వలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం పార్టీని నడిపేందుకు స్వేచ్చ కల్పించడం లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తాను పార్టీని పూర్తిగా అదుపులోకి తెచ్చుకోవాలనేది లోకేశ్ ప్రశ్న. టీడీపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి వయసు రీత్యా చాలా జూనియర్ పార్టీగానే చెప్పాలి. కేసీఆర్ చంద్రబాబు కంటే అయిదేళ్లు చిన్నవాడు. అయినా అక్కడ వారసత్వ మార్పిడికి పక్కాగా ప్రణాళిక సిద్దమైపోయింది. నిజానికి టీఆర్ఎస్ లో వారసత్వ పోటీ ఎక్కువగా ఉంది. హరీశ్ వంటి సమర్థుడు పోటీదారుగా కనిపిస్తారు. కానీ కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆయన స్థానాన్ని కుదించివేస్తూ కుమారుడికి లైన్ క్లియర్ చేసేశారు. టీడీపీలో అంతటి పోటీ లేదు. అయినా తనకు ఎందుకు నిర్ణయాత్మక స్వేచ్ఛ కల్పించడం లేదనేది లోకేశ్ ఆవేదన. యువనాయకత్వాన్ని ప్రోత్సహించడానికి, తర్వాత తరం రాజకీయాలను స్థిరపరిచేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని లోకేశ్ భావిస్తున్నారు. తాను తీసుకుంటున్న నిర్ణయాలకు ఒక్కోసారి చంద్రబాబు అడ్డుపడి మొత్తం సీన్ రివర్స్ చేస్తున్నట్టు సమాచారం. పార్టీ పదవుల విషయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిఫార్సులను పక్కన పెట్టించి, రాజమండ్రిలో ఎర్రన్నాయుడి కుమార్తె, వియ్యంకుడు, అల్లుడుల సిపార్సులకు పెద్దపీట వేయడంలో లోకేశ్ కీలకంగా వ్యవహరించారనేది పార్టీ వర్గాల సమాచారం. బుచ్చయ్యపై లోకేశ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. జూనియర్ ఎన్టీయార్ పార్టీ లోకి రావాలంటూ బుచ్చయ్య ఆహ్వానించారు. లోకేశ్ వల్ల పార్టీకి ముందుకు కదలదని పరోక్షంగా బహిరంగంగానే ఎత్తి చూపారు. దీనిని చంద్రబాబు నాయుడు నెమ్మదిగా జీర్ణించుకున్నారు. సర్దుకు పోయారు. లోకేశ్ మాత్రం తట్టుకోలేకపోతున్నారు. అందువల్లనే బుచ్చయ్యకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థి వర్గానికి యువతరం పేరిట ప్రాధాన్యం పెంచారు.
సామర్థ్యంపై సందేహాలు…
గతంలోనూ యనమల రామకృష్నుడుకు చెక్ పెట్టాలని ప్రయత్నించి లోకేశ్ దెబ్బతిన్నాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖలో వేలు దూర్చి నాలుక కరచుకున్నాడు. యనమల సీరియస్ గా స్పందించడంతో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అలాగే అచ్చెన్నాయుడి విషయంలోనూ అసంతృప్తిని వ్యక్తం చేసినా అతనినే పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్సుడిగా పీఠంపై కూర్చోబెట్టారు చంద్రబాబు. వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో వారసుడిగా తాను స్థిరపడకుండా వృద్ధ నాయకత్వం అడ్డుకుంటోందని లోకేశ్ ఆవేదన చెందుతున్నారు. లోకేశ్ తీసుకున్న అనేక నిర్ణయాలు వికటించాయన్న కఠోర వాస్తవం చంద్రబాబు నాయుడి కళ్లముందు కదులుతోంది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేయాలనే ఎత్తుగడతో మొదలు పెట్టిన ఓటుకు నోటు ప్రణాళిక ఆయన పుణ్యమేననేది పార్టీ వర్గాల ఆంతరంగిక అబియోగం. అలాగే మంగళగిరి స్థానాన్ని కోరి ఎంపిక చేసుకుని పరాజయం పాలయ్యాడు. సీనియర్ల రాజకీయ శకం ముగిసిందని చెబుతుండటంతో అంతర్గతంగా లోకేశ్ పై పెద్ద నాయకులు తిరుగుబాటు ధోరణి కనబరుస్తున్నారు. దీంతో యువనాయకత్వం పెరగడం లేదు. సీనియర్ నాయకులు పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారు. పార్టీ రెంటికీ చెడిన రేవడిగా మిగిలిపోతోంది. జగన్ మోహన్ రెడ్డి, కేటీఆర్ ల తరహాలో దీటైన నాయకుడిగా లోకేశ్ తనను తాను భావించుకుంటుంటారు. కానీ చంద్రబాబు నాయుడికి మాత్రం ఆ నమ్మకం లేదు. పార్టీలోనూ ఆ విశ్వాసం లేదు. అందుకే పూర్తి స్వేచ్ఛ, స్వతంత్రంగా పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యత అప్పగించడం లేదు. ఒకటి రెండు చోట్ల చొరవ కనబరుస్తున్నారు. కానీ తిరుగుబాట్లు తలెత్తుతున్నాయి. గోరంట్ల బుచ్చయ్య ఎపిసోడ్ కూడా అటువంటిదే.
తల్లడిల్లుతున్న తండ్రి..
లోకేశ్ ను పార్టీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలనే విషయంలో చంద్రబాబు నాయుడికి రెండో ఒపీనియన్ లేదు. కానీ కాలం కలిసి రావడం లేదు. పార్టీ పూర్తిగా మునిగిపోతుందేమోననే భయం టీడీపీ అధినేతను వెన్నాడుతోంది. గతంలో జీహెచ్ఎంసీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ పరాజయం పాలైంది. నామమాత్రంగానూ కార్పొరేటర్ల సీట్లు గెలవలేదు. లోకేశ్ ఇన్ చార్జిగా వ్యవహరించిన ఏ అంశంలోనూ సంత్రుప్తికరమైన ఫలితాలు రాబట్టలేకపోయారు. ప్రస్తుతం పార్టీ ఎదురీదుతోంది. ఇప్పుడు వారసునికి స్వతంత్ర అధికారం కల్పిస్తే అవకాశం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ పిట్టలు ఎగిరిపోయే ప్రమాదం ఉంది. తెలుగుదేశం రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకునే ఆస్కారం ఏర్పడుతుంది. భారీ విజయం తర్వాత పార్టీ, ప్రభుత్వ పగ్గాలు భద్రంగా ఉంటాయనే భరోసాతోనే లోకేశ్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా, భవిష్యత్ అధినేతగా మలచాలనేది చంద్రబాబు నాయుడి ఆలోచన. అది ఫలించే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. మరోవైపు లోకేశ్ తొందర పడుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో, వైఫల్యాల బాటలో , అనుభవం తక్కువ ఉన్న లోకేశ్ కు బాద్యత అప్పగిస్తే అది పార్టీకే డేంజర్ సిగ్నల్ గా మారుతంది. అందుకే ఒక తండ్రిగా చంద్రబాబు నాయుడు తల్లడిల్లి పోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
-ఎడిటోరియల్ డెస్క్