ఎవరు.. ఏంటో ఇప్పుడు తెలిసొచ్చిందా?
హిమాలయ పర్వత రాజ్యం నేపాల్ ఇప్పుడిప్పుడే వాస్తవాలు గ్రహిస్తోంది. అపోహలను వీడుతోంది. వాస్తవిక వైఖరితో వ్యవహరిస్తోంది. భారత్ పట్ల గల దురభిప్రాయాన్ని తొలగించుకుంటోంది. ఎవరు అసలైన మిత్రులో [more]
;
హిమాలయ పర్వత రాజ్యం నేపాల్ ఇప్పుడిప్పుడే వాస్తవాలు గ్రహిస్తోంది. అపోహలను వీడుతోంది. వాస్తవిక వైఖరితో వ్యవహరిస్తోంది. భారత్ పట్ల గల దురభిప్రాయాన్ని తొలగించుకుంటోంది. ఎవరు అసలైన మిత్రులో [more]
హిమాలయ పర్వత రాజ్యం నేపాల్ ఇప్పుడిప్పుడే వాస్తవాలు గ్రహిస్తోంది. అపోహలను వీడుతోంది. వాస్తవిక వైఖరితో వ్యవహరిస్తోంది. భారత్ పట్ల గల దురభిప్రాయాన్ని తొలగించుకుంటోంది. ఎవరు అసలైన మిత్రులో ఎవరు అవసరార్థ మిత్రులో అర్థం చేసుకుంటోంది. ఉభయ దేశాల మధ్య సంబంధాలు గత కొంతకాలంగా ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఇటీవల భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణె పర్యటనతో గాడిన పడుతున్నాయి. ఈనెల 4నుంచి 6వరకు మూడు రోజుల పాటు జనరల్ నరవణె పర్యటన రెండు దేశాలు అపోహలను తొలగించుకునేందుకు, పూర్వ పరిస్థితిని పునరుద్దరించేందుకు దోహదపడింది. జనరల్ నరవణె తన పర్యటనలో భాగంగా కొవిడ్ నుంచి కోలుకునేందుకు అవసరమైన మందులు, వైద్య సామగ్రిని నేపాల్ సైన్యానికి అందజేశారు. ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ నుంచి జనరల్ ఆఫ్ నేపాల్ ఆర్మీ గౌరవాన్ని అందుకున్నారు.
కయ్యానికి కాలు దువ్వి….
అంతర్జాతీయంగా చైనా దన్ను, దేశీయంగా కొందరు కమ్యూనిస్టు నాయకుల కారణంగా నేపాల్ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ఒంటెత్తు పోకడతో వ్యవహరించి భారత్ తో కయ్యానికి కాలు దువ్వారు. సహజంగా నేపాల్ లోని పురాతన పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ భారత్ అనుకూల వైఖరితో ఉంటుంది. వామపక్ష పార్టీలు భారత వ్యతిరేక విధానంతో ఉంటాయి. ప్రస్తుతం వామపక్ష పార్టీలు పాలన సాగిస్తున్నాయి. దీనిని అవకాశంగా తీసుకున్న చైనా పావులు కదిపింది. అక్కడి నాయకులు కూడా చైనా చెప్పినట్లు ఆడారు. ఈ ఏడాది మే 8న ఉత్తరాఖండ్ రాష్ర్టంలో నేపాల్ సరిహద్దుల్లో 80 కిలోమీటర్ల రోడ్డు ను రక్షణ మంత్రి రాజనాథ్ ప్రారంభించారు. దీనిపై నేపాల్ రాద్ధాంతం చేసింది. ఇది తమ భూభాగంలోనిదేనని వాదించింది. ఇది కాక లిపూలేఖ్, కాలాపానీ తదితర ప్రాంతాలు తమవేనని పేర్కొంది. ఈ మేరకు పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ ప్రాంతాలు తమ భూభాగంలోనివే అంటూ కొత్తగా చిత్ర పటాలను కూడా రూపొందించింది. అప్పటి నుంచి భారత్-నేపాల్ సంబంధాలు బెడిసికొట్టాయి.
ఎవరు ఎలాంటి మిత్రులో…?
ఇదే అదనుగా తమ దేశ సరిహద్దుల్లోకి చైనా చొచ్చుకు రావడం, సరిహద్దు రాళ్లను మాయం చేయడం, తమ భూబాగాల్లో అక్రంగా నిర్మాణాలు చేపట్టడంతో ఖాఠ్మండు నాయకత్వం కళ్లు తెరిచింది. శతాబ్దాల స్నేహంలో ఏనాడూ భారత్ చేయని పనిని బీజింగ్ కొద్ది రోజుల్లోనే చేయడంతో ఎవరు ఎలాంటి మిత్రులో తెలిసివచ్చింది. ఆవేశకావేశాలను పక్కనపెట్టి, కాస్త ప్రశాంతంగా ఆలోచించిన తరవాత నేపాల్ నాయకత్వానికి వాస్తవం బోధపడింది. చివరికి ఇంటిదొంగను గుర్తించింది. భారత్ వ్యతిరేకిగా, చైనా అనుకూలవాదిగా పేరున్న ఉప ప్రధాని, రక్షణ మంత్రి ఈశ్వర్ పోఖ్రాల్ ను ప్రధాని ఓలీ పక్కన పెట్టారు. ఆయన నుంచి కీలకమైన రక్షణ మంత్రిత్వ శాఖను తొలగించారు. ఈశ్వర్ కు ఎలాంటి శాఖ కేటాయించకుండా ప్రధాని కార్యాలయానికి ఎటాచ్ చేశారు. దీంతో ఇరుదేశాలకు ప్రధాన అడ్డంకి తొలగిపోయింది.
భారత్ తో స్నేహానికి…..
నేపాల్ తో భారత్ సుమారు 1700 కిలోమీటర్లకు పైగా సరిహద్దును పంచుకుంటోంది. ఉత్తరాఖండ్, యూపీ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బిహార్ రాష్రాలు హిమాలయ పర్వత రాజ్యంతో సరిహద్దులు కలిగిఉన్నాయి. ఎంతో మంది బిహారీలు, యూపీ వాసులు నేపాల్ లో స్థిరపడ్డారు. వ్యవసాయ రంగంలో స్థిరపడిన వారిని అక్కడ ‘మధేశీలు’ అని పిలుస్తారు. శతాబ్దాల స్నేహంలో భాగంగా భారత్ హిమాలయ రాజ్యానికి అనేక విధాలుగా అండగా నిలిచింది. రాచరికం రద్దుకు ప్రజాస్వామ్య స్థాపనకు భారత్ చేసిన విశేష ప్రయత్నాన్ని విస్మరించలేం. ఇందుకోసం 2005లో నాటి మన్మోహన్ సర్కారు సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరిని నేపాల్ కు పంపింది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నాయకుడు ప్రచండ జనజీవన స్రవంతలోకి తీసుకువచ్చి ఆయన ప్రధాని కావడానికి
సహకరించింది. ఈ చారిత్రక వాస్తవాలను విస్మరించి, చైనా మాయలో పడి అపోహలకు గురైన నేపాల్ నాయకత్వం ఇప్పటికైనా కళ్లు తెరవడం సానుకూల పరిణామంగా పేర్కొనవచ్చు.
– ఎడిటోరియల్ డెస్క్