భారత్ పట్ల ఆ దేశ వైఖరి మారిందే?

హిమాలయ పర్వత రాజ్యం నేపాల్ నాయకత్వంలో భారత్ పట్ల మార్పు కనపడుతోంది. ఖడ్గ ప్రసాద్ శర్మ సారథ్యంలోని ఖాట్మాండు సర్కారు కాస్త ఆలస్యంగా అయినా వాస్తవాలు తెలుసుకుంటోంది. [more]

;

Update: 2021-02-06 16:30 GMT

హిమాలయ పర్వత రాజ్యం నేపాల్ నాయకత్వంలో భారత్ పట్ల మార్పు కనపడుతోంది. ఖడ్గ ప్రసాద్ శర్మ సారథ్యంలోని ఖాట్మాండు సర్కారు కాస్త ఆలస్యంగా అయినా వాస్తవాలు తెలుసుకుంటోంది. నిన్నమొన్నటి దాకా న్యూడిల్లీపై కారాలు మిరియాలు నూరిన నేపాల్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఎవరు నిజమైన మిత్రులో, ఎవరు అవసరార్థ స్నేహితులో అర్థం చేసుకుంటోంది. గత ఏడెనిమిది నెలలుగా ఉభయ దేశాల సంబంధాలు ఒడిదుడుకులకు లోనవుతుంది. అపోహలు తొలగి, అనుమానాలు వీడి మళ్లీ న్యూదిల్లీ-ఖాట్మాండు కలసి మెలసి పని చేయడానికి విదేశాంగ మంత్రి గ్యవాలీ పర్యటన ఉపయోగపడుతుందని దౌత్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చైనా నుంచి కాకుండా…

నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన ప్రధాన ఉద్దేశం భారత్ నుంచి కొవిడ్ టీకా కొనుగోలు చేయడం. నిజానికి మిత్రదేశంగా చెప్పుకునే చైనా తన దగ్గర తయారయ్యే ‘సినోవాక్’ టీకా సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. తొలుత ఖాట్మాండు కూడా సుముఖత చూపింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక చర్చలు కూడా పూర్తయ్యాయి. కానీ కారణాలు తెలియరానప్పటికీ చివర్లో నేపాల్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. చైనా టీకా నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆ టీకా సమర్థత 70 శాతానికి మించి లేదని, అందునా అసలు కరోనా వ్యాప్తికి కారణమైన చైనా ఉత్పత్తి నాణ్యతపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు రావడంతో నేపాల్ సర్కారు భారత్ వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు.

కోవాగ్జిన్ టీకాకు….

భారత్ లో తయారయ్యే ‘కొ వాగ్జిన్’టీకాను సుమారు 12 మిలియన్ల డోసులు తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కృష్ణమోహన్ తో దిల్లీలోని నేపాల్ రాయబారి నీలాంబర్ ఆచారి చర్చలు జరిపారు. ఈ టీకాను ముందుగా కొవిడ్ నియంత్రణలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసిన వారికి అందజేస్తారు. కేవలం టీకా సరఫరాకే నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన పరిమితం కాలేదు. ఇండో-నేపాల్ ఆరో జాయింట్ కమిషన్ చర్చల్లో భాగంగా విదేశాంగ మంత్రి జై శంకర్ తో ద్వైపాక్షిక అంశాలపై భేటీ అయ్యారు. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని కాలాపానీ, లిపూలేఖ్, లింపియాధురాల ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ నాయకత్వం గత ఏడాది నానా యాగీ చేసింది. చైనా ప్రోద్బలంతోనే ఈ విషయంలో పార్లమెంటులో తీర్మానం చేసి దూకుడు ప్రదర్శించింది. అంతేకాక ఈ మేరకు దేశ కొత్త చిత్రపటాన్ని సైతం విడుదల చేసింది.

భారత్ తటస్థ వైఖరితోనే…?

తాజాగా దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నేపాల్ వైఖరిలో మార్పు వచ్చినట్లు చెబుతున్నారు. పార్టీలోని సీనియర్ నేత, మాజీ ప్రధాని ప్రచండతో విభేదాల కారణంగా ప్రధాని ఓలీ గత నెలలో పార్లమెంట్ రద్దు చేశారు. ఈ విషయంలో చైనా ఓలీ పక్షాన నిలిచింది. ఓలీ, ప్రచండ మధ్య రాజీ కుదిర్చేందుకు నేపాల్లోని చైనా రాయబారి మధ్యవర్తిత్వం వహించారు. చివరకు చైనా ప్రత్యేక బృందాన్ని పంపింది. అయినా ఫలితం లేకపోయిది. ఈ విషయంలో భారత్ తటస్థంగా వ్యవహరించింది. ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని, అక్కడి పరిణామాలను గమనిస్తూ, వేచిచూసే వైఖరిని అనుసరిస్తామని స్పష్టం చేసింది. ఈ తటస్థ వైఖరే నేపాల్ కు నచ్చిందని, అందువల్లే భారత్ తో బాంధవ్యాన్ని పునరుద్ధరించుకోవాలని నిర్ణయించినట్లు, ఇందులో భాగమే విదేశాంగ మంత్రి పర్యటన అని దౌత్యనిపుణులు విశ్లేషిస్తున్నారు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News