బాల్…బాల్…కీ టెన్షన్ తప్పదా….??

వరుస విజయాలతో దూసుకుపోతున్న రెండు జట్లు ప్రపంచ కప్ లో నేడు తలపడనున్నాయి. అవే న్యూజిలాండ్ – భారత్ లు. వరల్డ్ కప్ ల్లో ఇప్పటివరకు ఏడు [more]

Update: 2019-06-13 02:00 GMT

వరుస విజయాలతో దూసుకుపోతున్న రెండు జట్లు ప్రపంచ కప్ లో నేడు తలపడనున్నాయి. అవే న్యూజిలాండ్ – భారత్ లు. వరల్డ్ కప్ ల్లో ఇప్పటివరకు ఏడు సార్లు ఈ రెండు జట్లు ఆడితే అందులో నాలుగు న్యూజిలాండ్, మూడు భారత్ గెలిచాయి. ఇప్పుడు ఈ లెక్కను సరిచేయాలన్న పట్టుదలతో కోహ్లీ సేన తహతహలాడుతుంది. అయితే వరుసగా మూడు మ్యాచ్ లకు మూడు గెలిచి తాజా వరల్డ్ కప్ లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం లో కొనసాగుతున్న కివీస్ తమ స్థానం కిందకు వెళ్ళాలి అని భావించడం లేదు.

కివీస్ అలా … ఇండియా ఇలా …

ఇప్పటివరకు కివీస్ శ్రీలంక, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ లను మట్టికరిపించింది. ఇండియా టోర్నీ హాట్ ఫెవరెట్స్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా లను దెబ్బతీసింది. దాంతో ఇరు జట్లు సమతూకంతో ఢీ అంటే ఢీ అంటున్నాయి. బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ విభాగాల్లో భారత్ కి ఏమాత్రం తీసిపోని రీతిలో కివీస్ జట్టు ప్రస్తుతం రాణిస్తుంది. వన్డేల్లో కివీస్ ఎలా వున్నా ప్రపంచ కప్ లాంటి టోర్నీల్లో అత్యంత ప్రమాదకర జట్టుగా ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తుంది. వరల్డ్ కప్ వార్మ్ అప్ మ్యాచ్ లో ఇండియా ను 179 పరుగుల తేడాతో ఓడించి తమ సత్తా ముందే రుచి చూపించింది. దాంతో కివీస్ ను తక్కువ అంచనా వేయకుండా సర్వసన్నద్ధం అయ్యింది టీం ఇండియా.

ధావన్ వెనుతిరగడంతో ….

ఆస్ట్రేలియా పై సెంచరీ తో మంచి ఫామ్ అందిపుచ్చుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో టీం ఇండియా కు ఆందోళన కలిగించే పరిణామమే. అయితే మరో స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ సైతం మంచి ఫామ్ తో ఉండటంతో కె ఎల్ రాహుల్ ధావన్ ప్లేస్ ను భర్తీ చేయనున్నాడు. కెప్టెన్ కోహ్లీ, ధోని, హార్దిక్ లు బ్యాటింగ్ లో చెలరేగుతూ ఉండటం బౌలింగ్ లో బుమ్రా, భువనేశ్వర్, చావల్ లు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో హ్యాట్రిక్ విజయం ఖాయమన్న ధీమాతో బరిలోకి దిగనుంది భారత్.

కివీస్ వెరీ స్ట్రాంగ్ …

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ సైతం చాలా పటిష్టంగా వుంది. ముఖ్యంగా బౌలింగ్ లో బౌల్ట్, ఫెర్గ్యూసన్ విధ్వసంకర బంతులతో ఎలాంటి బ్యాట్స్ మెన్ అయినా పెవిలియన్ బాట పట్టిస్తున్నారు. అద్భుత బౌలింగ్ వ్యూహాలతో ప్రత్యర్థికి విజయాన్ని అందని ద్రాక్షే చేస్తున్నారు. బ్యాటింగ్ లో గిఫ్టిల్, విలియమ్స్, రాస్ టేలర్ లు అద్భుతంగా రాణిస్తూ ప్రత్యర్థి బౌలింగ్ ను తుత్తునియలు చేస్తున్నారు. దాంతో తాజాగా జరగనున్న కివీస్ – ఇండియా మ్యాచ్ రసవత్తరంగా నడవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్ కి వరుణ గండం పొంచి ఉందన్న సమాచారం అభిమానులను ప్రధానంగా ఆందోళనకు గురిచేస్తుంది.

Tags:    

Similar News