అలా నిమ్మగడ్డను హీరోను చేశారు…?

నిమ్మగడ్డ రమేష్ కుమార్. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. మాజీ ఐఎఎస్ అధికారి. ఆయన కెరీర్ లో ఒక్క మచ్చ లేదు. ఆయన వివాదాస్పదుడే అయితే పదవీ విరమణ [more]

Update: 2021-01-26 02:00 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. మాజీ ఐఎఎస్ అధికారి. ఆయన కెరీర్ లో ఒక్క మచ్చ లేదు. ఆయన వివాదాస్పదుడే అయితే పదవీ విరమణ వరకూ ఆయన మీద ఏ ఒక్క ఆరోపణ లేకుండా ఎలా నెట్టుకురాగలరు. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదాస్పదుడు అయ్యారా? ఆయన్ని చేశారా? ఇవన్నీ ఇప్పటికీ పెద్ద ఎత్తున చర్చలుగానే ఉన్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక అదృశ్య శక్తి ఉంది అంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజాగా రాసిన లేఖలో ఆరోపించిన నేపధ్యం నుంచి చూసినపుడు కూడా కొత్త ఆలోచనలు కలుగుతున్నాయి.

జగన్ దేనా..?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత ఏడాది మార్చి నెల మధ్యలో హఠాత్తుగా ఎన్నికలను వాయిదా వేశారు. ప్రభుత్వంతో చెప్పకుండా ఆయన ఎన్నికలను వాయిదా వేయడం తప్పు అని సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్ కొంత సహనంతో వ్యవహరించి ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరు ఇప్పుడు మాదిరిలా ఇంతలా వినిపించి ఉండే అవకాశం లేదు. ఇక మరో వైపు చూస్తే నిమ్మగడ్డను ఆ పదవి నుంచి తప్పించాలని చూడడం కూడా మరో తప్పు. ఆ మీదట ఎన్నికల సంఘాన్ని రాజ్యాంగ సంస్థగా మరచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద గుడ్డి వ్యతిరేకతతో ఆయనను ఒక వ్యక్తిగానే చూడడం మరో పెద్ద తప్పు. ఇలా తప్పుల మీద తప్పులు జగన్ కానీ ఆయన మంత్రులు కానీ చేయడంతోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ హీరో అయ్యారని చెప్పాలి.

అది నిజమేనా…?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక అదృశ్య శక్తి ఉందని ముద్రగడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ నేతలు అయితే డైరెక్టుగా చంద్రబాబు ఉన్నారని అనేస్తున్నారు. మరి అదే నిజమైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వంటి నీటుగా పనిచేసుకుని పోయే ఒక అధికారిని ముందు పెట్టి రాజకీయం ఆడించారా అన్న చర్చ కూడా ఉంది. అలా చూసుకుంటే నిమ్మగడ్డ హీరో కావడానికి బాబు వేసిన ఎత్తులు కూడా కారణమే అన్న మాట వినిపిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంచి అధికారి అని ఎన్టీయార్ సీఎం గా ఉండగా ఆయన బాగా పనిచేసే వారని లక్ష్మీ పార్వతి తాజాగా పేర్కొన్నారు. అంటే నిమ్మగడ్డను ముందు పెట్టి కధను మలుపు తిప్పాలనుకున్న టీడీపీ కూడా తమకంటే ఆయనే గొప్ప అని ఇపుడు తప్పనిసరిగా ఒప్పుకోవాల్సివచ్చిందన్న మాట.

దూకుడే కాదు…

రాజ్యాంగంతో ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి. వ్యవస్థలు అన్నీ దానికి లోబడి పనిచేయాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఇపుడు ఎవరైనా అదే తెలుసుకోవాలి. ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నెగ్గినా, జగన్ ప్రభుత్వం నెగ్గినా కూడా అంతిమంగా గెలిచేది మాత్రం రాజ్యాంగం, దాని స్పూర్తి మాత్రమే. రాజ్యాంగానికి ఎదురుగా ఎవరు వెళ్ళినా ఇలాంటి తీర్పులే వస్తాయి. మరో వైపు చూస్తే ఈ తీర్పుని దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అంటున్న మాటలు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొంత మననం చేసుకోవాల్సిందే. రాజకీయ ఆరోపణలు తనపైన వచ్చిన నేపధ్యంలో నిమ్మగడ్డ పారదర్శకంగా ఎన్నికలు జరిపించాలని జీవీఎల్ పేర్కొన్నారు. మొత్తానికి చూస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని హీరోను చేయడంలో అందరి పాత్ర ఉందని చెప్పాలి.

Similar News