నిమ్మ‌ల నిక్కి నీలిగినా…?

నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌. అనంత‌పురం జిల్లాకు చెందిన టీడీపీ కీల‌క నాయ‌కుడు. కొన్నాళ్లు ఎమ్మెల్యేగా, త‌ర్వాత ఎంపీగా కూడా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌.. ఇప్పుడు ఎలాంటి [more]

Update: 2019-09-20 12:30 GMT

నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌. అనంత‌పురం జిల్లాకు చెందిన టీడీపీ కీల‌క నాయ‌కుడు. కొన్నాళ్లు ఎమ్మెల్యేగా, త‌ర్వాత ఎంపీగా కూడా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌.. ఇప్పుడు ఎలాంటి వ్యూహం లేకుండా అటు కార్య‌క‌ర్త‌ల‌కు, ఇటు పార్టీ అధినేత‌కు కూడా కాకుండా పోయార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. పున‌ర్విభ‌జ‌న‌కు ముందున్న గోరంట్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి నిమ్మ‌ల కిష్ట‌ప్ప ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అయితే, ఆ స‌మ‌యంలో ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషిగానే గుర్తింపు పొందారు. ఇక‌, పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత నిమ్మల కిష్టప్పకు బాబు ఎమ్మెల్యే సీటు ఇవ్వ‌లేదు.

రెండు సార్లు వరసగా…..

గోరంట్ల నియోజ‌క‌వ‌ర్గం ర‌ద్ద‌య్యి పక్క‌నే ఉన్న పెనుగొండ‌, పుట్ట‌పర్తి నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌లిసిపోయింది. 2009 ఎన్నిక‌ల్లో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ పెనుగొండ సీటే కావాల‌ని చంద్ర‌బాబు వ‌ద్ద నిమ్మల కిష్టప్ప నానా రాద్దాంతం చేశారు. బాబు మాత్రం పోటీ చేస్తే.. గీస్తే ఎంపీగానే చేయ్ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వ‌డంతో పాటు పెనుగొండ సీటు బీకే.పార్ధ‌సార‌థికి ఇచ్చేశారు. దీంతో 2009లో ఒక‌సారి, 2014లో మ‌రోసారి వ‌రుస‌గా హిందూపురం పార్ల‌మెంటు స్తానం నుంచి విజ‌యం సాధించారు. పార్టీ వ్య‌తిరేక గాలులు వీచిన 2009లో సైతం ఆయ‌న అక్క‌డ ఎంపీగా గెలిచారు.

వివాదాస్పద నేతగా….

రెండోసారి ఎంపీగా గెలిచాక‌… పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు నిమ్మల కిష్టప్ప చేసిన కొన్ని ప‌నులు వివాదానికి కార‌ణ‌మ‌య్యాయి. త‌న కుమారుడిని రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చి.. త‌న వార‌సుడిగా నిల‌బెట్టి గెలిపించుకోవాల‌ని క‌ల‌లుక‌న్నారు. ఈ క్ర‌మంలో పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్య‌క్షుడు బీకే పార్థ‌సార‌థితో ఘ‌ర్ష‌ణ ప‌డ్డారు. ప్ర‌తి విష‌యంలోనూ వేలు పెట్టారు. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేశారు. త‌నకు త‌న వార‌సుడికి కూడా టికెట్లు కావాల‌ని, త‌న కుమారుడిని తానే గెలిపించుకుంటాన‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద డిమాండ్ చేశారు.

పెనుగొండలో వేలు పెట్టి…..

ఈ క్ర‌మంలోనే ఆయ‌న పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గంలో క‌లుగ చేసుకుని.. ప్ర‌తివిష‌యాన్నీత‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే దీనిపై పార్థ‌సార‌థి కూడా దీటుగానే స్పందించారు. త‌న నియోజ‌క‌క‌వ‌ర్గంలో నిమ్మ‌ల కిష్ట‌ప్ప వేలు పెట్ట‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఈ ప‌రిణామంతో ఇద్ద‌రి మ‌ధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు వార్నింగ్ కూడా ఇచ్చార‌నే ప్ర‌చారం సాగింది.అటు పెనుగొండ సీటు ద‌క్క‌ద‌ని తేల‌డంతో పుట్ట‌ప‌ర్తిపై క‌న్నేసి అక్క‌డ కూడా మాజీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ్‌రెడ్డికి నిమ్మల కిష్టప్ప వ్య‌తిరేక‌మ‌య్యారు. ఇలా త‌న లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఎమ్మెల్యేల‌కు ఆయ‌న యాంటీ అయిపోయారు. త‌న వార‌సుడికి ఎమ్మెల్యే సీటు కోసం ఆయ‌న చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ఐదేళ్ల పాటు ఆయ‌న ఎంపీగా చేసిన అభివృద్ధి… రాజ‌కీయంగా త‌న‌దైన ముద్ర క‌న్నా తోటి పార్టీ ఎమ్మెల్యేల‌తో వైరం.. వార‌సుడి సీటు కోస‌మే ఫైటింగ్ చేయ‌డంతోనే కాలం స‌రిపెట్టేశారు.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా….

తాజా ఎన్నిక‌ల్లో త‌న కుమారుడికి టికెట్ ఇప్పించుకోలేక పోయిన నిమ్మల కిష్టప్ప కేవ‌లం తాను మాత్ర‌మే హిందూపురం నుంచి పోటీ చేశారు.అ యితే, జ‌గ‌న్ సునామీ ముందు వైసీపీ అభ్య‌ర్థి గోరంట్ల మాధ‌వ్ చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యారు. అప్ప‌టి నుంచి కూడా పార్టీకి, కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు కిష్ట‌ప్ప‌. దీంతో ఇప్పుడు స‌మీప భ‌విష్య‌త్తులో ఆయ‌న ఏం చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. మ‌రోప‌క్క‌, జిల్లాకు చెందిన జేసీ, వ‌ర‌దాపురం సూరి వంటి కీలక నేత‌లు కూడా చేసేది లేక మౌనంగా ఉన్నారు. జేసీ, ప‌రిటాల లాంటి బ‌డా ఫ్యామిలీల వార‌సులే జిల్లాలో రాజ‌కీయం చేయ‌లేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలో నిమ్మల కిష్టప్ప త‌న వార‌సుడి ఫ్యూచ‌ర్ గురించి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క‌ల‌లు క‌న‌డం అత్యాశే అవుతుంది. జిల్లాలో టీడీపీ సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న నేప‌థ్యంలో నిమ్మల కిష్టప్ప పొలిటిక‌ల్‌గా ఎలా ? రియాక్ట్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News