అంతా కాగితాల మీదే …నేల మీదకు ఎప్పుడు?

విశాఖను పరిపాలనా రాజధానిగా చేశామని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. కానీ అది ఆచరణలో ఎక్కడ ఉంది అంటే సమాధానం లేదు. కోర్టు వివాదాలు దాటుకుని విశాఖ [more]

Update: 2021-05-14 05:00 GMT

విశాఖను పరిపాలనా రాజధానిగా చేశామని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. కానీ అది ఆచరణలో ఎక్కడ ఉంది అంటే సమాధానం లేదు. కోర్టు వివాదాలు దాటుకుని విశాఖ రాజధాని ముందుకు రావాలీ అంటే అది ఏళ్ళూ వూళ్ళూ పడుతుంది అని అంతా అంటున్నారు. సరే అదలా ఉందనుకుంటే విశాఖను విశ్వనగరంగా చేస్తామని కూడా చెబుతున్నారు. కానీ మాటలకూ చేతలకూ ఎక్కడా పొంతన లేకుండా ఉందని అంటున్నారు. విశాఖను టూరిజం స్పాట్ గా డెవలప్ చేస్తాం, విశాఖలో మెట్రో రైలు కూతలు పెట్టిస్తామని చెబుతున్న మాటలు నీటి మీద రాతలేనా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

నిధులేవి స్వామీ ..?

ఏ పని చేయాలన్న నిధులు పెద్ద ఎత్తున కావాలి. మరి మెట్రో రైల్ ప్రాజెక్ట్ అంటే భారీ ఎత్తున చేపట్టాల్సిన కార్యక్రమం. మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంది అని మబ్బుల్లో నీళ్ళు చూపిస్తున్నారు. కానీ కేంద్రం నిబంధనల మేరకే నిధులు ఇస్తుంది. కేంద్ర భాగస్వామ్యం ఉన్న ఏ ప్రాజెక్ట్ కి అయినా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అపుడే కేంద్రం పలికేది. కానీ ఇవేమీ లేకుండా కేంద్రం మీద భారం వేసి విశాఖ లైట్ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రెడీ చేసిందన్న విమర్శలు ఉన్నాయి.

అయ్యే పనేనా ..?

ఇక విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్ట్ అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి. ఒక్కో కిలోమీటర్ నిర్మాణానికి అక్షరాలా 197 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇక విశాఖలో 76.90 కిలోమీటర్లలో చేపట్టనున్న ఈ మెట్రో ప్రాజెక్టును మూడు దశల్లో నిర్మిస్తారు. మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు అవసరం అంటూ అంచనాలు బాగానే వేశారు. కానీ నిధులు ఎక్కడ నుంచి వస్తాయి అన్న మౌలికమైన విషయాన్నే మరచారు అంటున్నారు. కేంద్రం వాటా మీదనే ఆధారపడితే అది ఎపుడు వచ్చేనూ ఎపుడు మెట్రో రైలు పట్టాలు ఎక్కేనూ అన్న మాట కూడా ఉంది.

ఇదీ అంతేనా ..?

ఇక విశాఖలో మోడర్న్ ట్రాం రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భోగాపురం నుంచి విశాఖ బీచ్ వరకూ ట్రాం రైలు నడపాలని ఆలోచనగా ఉంది. అయితే దీని కోసం ఏకంగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని లెక్కలు చెబుతున్నాయి. మరి దీనికి నిధులు ఎక్కడ నుంచి వస్తాయి అన్నది కూడా తెలియదు. మొత్తానికి మాటలకు ఏ ఖర్చూ లేదు కాబట్టి ప్రభుత్వ పెద్దలు విశాఖకు ప్రాజెక్టులు వస్తున్నాయని మాత్రం చెబుతున్నారు అని విపక్షాలు అంటున్నాయంటే తప్పు ఎక్కడ ఉందో తెలుసుకోవాలిగా. లేకపోతే నోట్లో బూర్లు వండే కార్యక్రమాన్ని చూసి జనం విసుగెత్తితే అసలుకే ఎసరు అని వైసీపీ పెద్దలు గ్రహించాలి అంటున్నారు.

Tags:    

Similar News