రెస్ట్ తీసుకుందామనుకున్నా…?

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. తమ వారసులకు గ్రౌండ్ క్లియర్ చేయకుండా [more]

Update: 2019-08-25 14:30 GMT

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. తమ వారసులకు గ్రౌండ్ క్లియర్ చేయకుండా తాము రాజకీయాల నుంచి తప్పుకుంటే ప్రయోజనం లేదని, కుటుంబం మొత్తం రాజకీయాలకు దూరమయ్యే ప్రమాదముందని గ్రహించారు. అందుకే 2019 ఎన్నికలకు ముందు రిటైర్మ్ మెంట్ ప్రకటించిన నేతలు మళ్లీ జనం బాట పట్టారు.

రాజకీయ సన్యాసమంటూ….

ఇక తాను రాజకీయాల్లో ఉండను. ప్రత్యక్ష్య ఎన్నికల్లో పాల్గొనబోను. రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా గడుపుతామని కొందరు టీడీపీ నేతలు ఎన్నికలకు ముందు చెప్పారు. వారిలో ముఖ్యులు జేసీ దివాకర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి. వీరిద్దరూ దశాబ్దాల తరబడి రాజకీయాలు చేస్తున్నవారు. తమ ప్రాంతంలో పట్టున్న వారు. కేఈ కృష్ణమూర్తి తొలి నుంచి తెలుగుదేశంలో ఉండగా, జేసీ దివాకర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు.

పార్టీ కార్యక్రమాల్లో కేఈ…

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వీరిద్దరూ విజయం సాధించారు. ముఖ్యంగా కేఈ కృష్ణమూర్తి చంద్రబాబునాయుడుతో సమానమైన రాజకీయ జీవితం ఉంది. ఆయన రాజకీయ ప్రస్థానమంతా తెలుగుదేశంలోనే నడిచింది. గత ఎన్నికలలో గెలిచిన తర్వాత ఆయనకు చంద్రబాబు కీలకమైన ఉపముఖ్యమంత్రిపదవి కూడా ఇచ్చారు. అయితే తన కుమారుడు శ్యాంబాబు రాజకీయ భవిష్యత్ కోసమే కేఈ రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్యాంబాబు ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన తిరిగి యాక్టివ్ అయ్యారు. పత్తికొండ తెలుగుదేశం పార్టీ సమావేశంలో కేఈ పాల్గొన్నారు.

యాక్టివ్ గా జేసీ…..

ఇక మరో సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డిది కూడా అదే పరిస్థితి. జేసీ తనయుడు పవన్ కుమార్ రెడ్డి రాజకీయ అరంగేట్రం కోసం ఆయన రాజకీయ సన్యాస ప్రకటనను ఎన్నికలకు ముందు చేశారు. అయితే ఎన్నికల్లో పవన్ కుమార్ రెడ్డితో పాటు సోదరుడు కుమారుడు అస్మిత్ రెడ్డి ఓటమిని జేసీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇద్దరు తెలుగుదేశం నేతలూ మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాజకీయాల్లో రెస్ట్ తీసుకుందామనుకున్న ఇద్దరినీ తనయుల ఓటమి మళ్లీ జనం వైపునకు మళ్లేలా చేసింది.

Tags:    

Similar News