జగన్ చెల్లెలుకే గట్టి పోటీ ?

ఆమె జగనన్నకు అచ్చమైన చెల్లెలు. జగన్ చేరదీసి మరీ ఆమెని ఉప ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువచ్చారు. ఆమే విజయనగరం జిల్లాకు చెందిన పాముల పుష్ప శ్రీవాణి. ఆమె [more]

Update: 2020-03-29 02:00 GMT

ఆమె జగనన్నకు అచ్చమైన చెల్లెలు. జగన్ చేరదీసి మరీ ఆమెని ఉప ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువచ్చారు. ఆమే విజయనగరం జిల్లాకు చెందిన పాముల పుష్ప శ్రీవాణి. ఆమె రెండు సార్లు కురుపాం నుంచి గిరిజన ఎమ్మెల్యేగా నెగ్గి అంతలోనే డిప్యూటీ సీఎం దాకా వచ్చారు ఆమె సైతం ఊహించని గౌరవం గుర్తింపు జగన్ ఇచ్చారు. అలాగే ఆమెను గిరిజన సలహా మండలి చైర్ పర్సన్ గా కూడా జగన్ చేశారు. ఇలా రెండు పదవులు బోలెడు అధికారం ఇపుడు ఆమె సొంతం. ఓ విధంగా ఆమె అతి చిన్న వయసులో అతి పెద్ద పదవుల‌లో కుదురుకున్నారు. ఆమె సైతం తన ప్రతిభను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

బొత్స మాటే ….

నిజానికి ప్రోటోకాల్ ప్రకారం విజయనగరం జిల్లాలో అగ్రాసనం ఉప ముఖ్యమంత్రిగా పుష్ప శ్రీవాణిదే. ఆమె సమీక్షలు చేస్తే రెండవ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం హాజరుకావాలి. కానీ సీనియర్ అయిన బొత్స తానే కూర్చుని సమీక్షలు చేపడుతూ ఆమెను వెనక్కు నెడుతున్నారు. రాజకీయ అనుభవం లేకపోవడం, సరైన వ్యూహాలు లేకపోవడం వల్లనే పాముల పుష్ప శ్రీవాణి వెనకబడుతున్నారని అంటున్నారు. ఈ బాధకు తోడు సాటి ఎస్టీ ఎమ్మెల్యేలు సైతం ఆమెకు సహాయ నిరాకరణ చేస్తున్నారు.

ఒకే ఒక్కడుగా…..

మరో వైపు సీనియర్ ఎస్టీ ఎమ్మెల్యే రాజన్నదొర తనకు మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు. కానీ పుష్ప శ్రీవాణికి ఆ పదవి దక్కడంతో ఆయన బాగా అసంతృప్తిలో పడ్డారని చెబుతారు. రెండున్నరేళ్ళ తరువాత తానే డిప్యూటీ సీఎం అని ఆయన ఆశలు పెంచుకుంటున్నారు. ఆయన పుష్ప శ్రీవాణికి పట్టించుకోవడంలేదు. మరో వైపు జిల్లా మంత్రి బొత్స కు కూడా దూరం పాటిస్తూ జగన్ నే నమ్ముకుని తన రాజకీయం తాను చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మిగిలిన ఎస్టీ ఎమ్మెల్యేలు కూడా పాముల పుష్ప శ్రీవాణికి చేదోడుగా నిలవడంలేదన్న మాట ఉంది.

ఆమె గట్టి పోటీ….

పార్టీలో పరిణామాలు ఇలా ఉంటే సొంత జిల్లాలో పాముల పుష్ప శ్రీవాణికి ఇపుడు గట్టి పోటీ సొంత కులం నుంచే ఎదురవుతోంది. విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ స్వాతి టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిపోయారు. ఆమె తల్లి శోభా హైమావతి టీడీపీ ఎమ్మెల్యేగా, ఏపీ టీడీపీ మహిళా నాయకురాలిగా పనిచేశారు. పైగా జిల్లావ్యాప్తంగా అనుచరబలం, మంచి వాగ్దాటి ఆమెకు ఉన్నాయి. ఇపుడు ఆమె వైసీపీలో చేరడంతో భవిష్యత్తులో తనకు గట్టి పోటీ అవుతుందని పాముల పుష్ప శ్రీవాణితో సహా ఆమె వర్గీయులు భావిస్తున్నారుట. ఆమె స్వయంగా విజయసాయిరెడ్డి సమక్షలో పార్టీలో చేరడంతో గట్టి హామీతోనే పార్టీలోకి వచ్చారని అంటున్నారు. ముందు ముందు ఈ రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయో, తన పట్టు ఎక్కడా జారుతుందోనని పాముల పుష్ప శ్రీవాణి కంగారు పడుతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News