పన్నీర్ పట్టు తప్పకూడదనేనా?

తమిళనాడు రాజకీయాల్లో వారసత్వాలకు కొదవలేదు. అన్ని పార్టీల్లో వారసత్వాలనే కొనసాగిస్తున్నారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్ తన తండ్రి వారసత్వాన్ని రాజకీయాల్లో అందిపుచ్చుకున్నారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా [more]

Update: 2021-02-24 17:30 GMT

తమిళనాడు రాజకీయాల్లో వారసత్వాలకు కొదవలేదు. అన్ని పార్టీల్లో వారసత్వాలనే కొనసాగిస్తున్నారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్ తన తండ్రి వారసత్వాన్ని రాజకీయాల్లో అందిపుచ్చుకున్నారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా డీఎంకే యువజన విభాగం అధినేతగా ఉన్నారు. ఆయన ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం కూడా ఉంది. ఇక అన్నాడీఎంకేలో మాత్రం వారసత్వం లేదు. జయలలిత వారసులు ఎవరన్న దానిపై శశికళ, పన్నీర్ సెల్వం, పళనిస్వామిల మధ్య పోటీ నెలకొంది.

నమ్మకమైన నేతగా….

అయితే ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాత్రం రాజకీయాల్లో తన వారసులను వరసగా బరిలోకి దింపుతున్నారు. పన్నీర్ సెల్వం అంటే తమిళనాడులో ఒక బ్రాండ్ ఉంది. ఆయన అమ్మ జయలలితకు నమ్మకమైన నేతగా ఇప్పటికీ అందరూ భావిస్తారు. జయలలిత కష్టంలో ఉన్న సమయంలో రెండుసార్లు పన్నీర్ సెల్వంకు ముఖ్యమంత్రి బాధ్యతలను జయలలిత అప్పగించడమే దీనికి కారణం. పన్నీర్ సెల్వం కూడా అమ్మ అప్పగించిన బాధ్యతలను నెరవేర్చి భక్తుడిగా తనను తాను నిరూపించుకున్నారు.

పెద్దకుమారుడు ఎంపీగా….

జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వంకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. కేవలం ఉప ముఖ్యమంత్రి పదవిని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే తన వారసులను రంగంలోకి దించేందుకు ప్రతి ఎన్నికలో పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో పన్నీర్ సెల్వం తన పెద్దకుమారుడిని రాజకీయాల్లోకీ తీసుకువచ్చారు. పెద్దకుమారుడు రవీంద్రనాధ్ తేని నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. రవీంద్ర నాధ్ ను కేంద్రమంత్రిగా చేయాలన్న పన్నీర్ సెల్వం కోరిక నెరవేరలేదు.

అసెంబ్లీకి చిన్న కుమారుడిని….

ఇక త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పన్నీర్ సెల్వం తన చిన్న కుమారుడు జయప్రదీప్ ను ఎన్నికల బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. తేని పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి జయప్రదీప్ పోటీ చేసే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తమకు పట్టున్న ప్రాంతాలను ఎంచుకుని అందులో పోటీ చేయించాలని పన్నీర్ సెల్వం డిసైడ్ అయ్యారు. మొత్తం మీద జయకు వారసులు ఎవరనేది ప్రజలు త్వరలో నిర్ణయించనున్నా, పన్నీర్ సెల్వం మాత్రం తన వారసులను వేగంగా రాజకీయాల్లోకి తెస్తున్నారు.

Tags:    

Similar News