తెలంగాణలో సెంటిమెంట్ పూర్తిగా పోయిందా?

తెలంగాణలో సెంటిమెంట్ తగ్గిందా? అందుకే ఆంధ్ర మూలం ఉన్న పార్టీలు పోటీకి సై అంటున్నాయా? విపక్షాలు వీక్ కావడంతో ఏపీ పార్టీలు తెలంగాణలో కాలుమోపడానికి ప్రయత్నిస్తున్నాయా? అంటే [more]

Update: 2021-04-25 00:30 GMT

తెలంగాణలో సెంటిమెంట్ తగ్గిందా? అందుకే ఆంధ్ర మూలం ఉన్న పార్టీలు పోటీకి సై అంటున్నాయా? విపక్షాలు వీక్ కావడంతో ఏపీ పార్టీలు తెలంగాణలో కాలుమోపడానికి ప్రయత్నిస్తున్నాయా? అంటే అవుననే అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల, పవన్ కల్యాణ‌్ జనసేన పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వీరి వల్ల లాభనష్టాలు ఎవరికి అన్న విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ సెంటిమెంట్ లేదన్న కారణంగానే ఈ పార్టీలు ఇక్కడ బలపడేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఏడేళ్లు కావస్తున్నా….

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు కావస్తుంది. రెండు సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల వరకూ తెలంగాణ వైపు ఏపీ పార్టీలు ఏవీ చూడలేదు. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో కలిసి పోటీ చేసింది. రెండు స్థానాలను దక్కించుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసలు పోటీకే దిగలేదు. అయితే రెండోసారి కేసీఆర్ ఎన్నికయిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ పూర్తిగా అంతరించిపోయందన్న అంచనాకు వచ్చేశారు.

అసంతృప్తి ఉందని….

దీనికి అతి పెద్ద ఉదాహరణ మొన్నటి పట్బభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ ఓటమి. తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉంటే ఆయన ఓటమి పాలయ్యేవారు కాదు. ఇక కేసీఆర్ అవలంబిస్తున్న నిర్ణయాలు కూడా ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచాయంటున్నారు. ప్రధానంగా యువత టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతతో ఉందని, ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం వంటి కారణాలతో నిరుద్యోగ యువత ఇతర పార్టీల వైపు చూస్తుంది.

రాజకీయ శూన్యత ఉందన్న…..

ఇక తెలంగాణలో కాంగ్రెస్ బలహీనంగా మారింది. నాయకత్వ సమస్య దానికి కారణం. బీజేపీకి కూడా మోదీ తప్ప నాయకుడుగా కనిపించే వారు లేరు. ఈ కారణాలవల్లనే తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని వైఎస్ షర్మిల భావించారు. పార్టీ పెట్టేందుకు సిద్దపడ్డారు. నిన్న మొన్నటివరకూ ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైన జనసేన కూడా ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తుంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తుంది. మొత్తం మీద రాజకీయ శూన్యత, సెంటిమెంట్ లేదన్న అభిప్రాయంతోనే ఏపీ మూలాలున్న పార్టీలు తమ అదృష్టాన్ని తెలంగాణలో పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నాయి.

Tags:    

Similar News