Pawan kalyan : పవన్ కు బద్వేల్ ఎన్నిక ఇబ్బంది పెట్టనుందా?

తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుపై త్వరగా క్లారిటీ వస్తే బాగుంటుందన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. ముఖ్యంగా బీజేపీ ఇందుకోసం ఎదురు చూస్తుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీతో [more]

;

Update: 2021-10-06 02:00 GMT

తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుపై త్వరగా క్లారిటీ వస్తే బాగుంటుందన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. ముఖ్యంగా బీజేపీ ఇందుకోసం ఎదురు చూస్తుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీతో కలసి పోటీ చేస్తుందన్న ప్రచారం రోజురోజుకూ పెరుగుతుంది. దీనికి అనుగుణంగా ఆ రెండు పార్టీల అడుగులు కన్పిస్తున్నాయి. దీంతో దీనిపై తేల్చేయడానికి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిసైడ్ అయినట్లే కన్పిస్తుంది.

పవన్ కోసం….

పవన్ కల్యాణ్ ను వదులకోవడం బీజేపీకి ఎంత మాత్రం ఇష్టంలేదు. చరిష్మా ఉన్న నేత కావడం, ఒక సామాజికవర్గానికి బ్రాండ్ గా ఉండటంతో ఆయనతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచన. అందుకే బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిని చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిచేతనే ప్రకటన చేయించారు. కానీ పవన్ కల్యాణ్ కు సీఎం పదవి కన్నా జగన్ ను ఓడించడమే లక్ష్యంగా కన్పిస్తుంది.

టీడీపీతో వెళ్లాలని…

అందుకే బలం లేని బీజేపీతో కలసి ప్రయాణించడం కంటే టీడీపీతో వెళ్లడమే ఉత్తమం అని అనుకంటున్నారు. అందుకే వరసగా టీడీపీకి దగ్గరయ్యే డైలాగులు ఆయన నుంచి వినపడుతున్నాయి. బద్వేల్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకోవడంలో ఆ రెండు పార్టీలు అనుకునే చేశాయన్న అనుమానాలు లేకపోలేదు. అందుకే సోము వీర్రాజు ఇప్పడు పవన్ కల్యాణ్ కు పరీక్ష పెట్టనున్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారు.

అందుకే ప్రచారానికి…..

బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయాలని పవన్ కల్యాణ్ ను సోము వీర్రాజు కోరనున్నారు. అంటే ఒకరకంగా పవన్ కు ఇది కష్టమే. తాను బరి నుంచి తప్పుకున్నా, బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా పవన్ కల్యాణ్ ప్రచారం చేసే అవకాశం 99 శాతం ఉండకపోవచ్చు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి రాకుంటే ఆయన టీడీపీకి దగ్గరవుతున్నారనే బీజేపీ భావిస్తుంది. జనసేన తమ నుంచి వెళ్లిపోయినా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసుకునే వీలుకలుగుతుందని సోము వీర్రాజు అంచనా వేస్తున్నట్లుంది. అందుకే ఇప్పడు బద్వేల్ కు జనసేనాని వస్తారా? రారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News