ఆ అయిదుగురు…
జనసేన పార్టీ ఏపాటి విజయం సాధిస్తుందన్న విషయంలో సందేహాలుండవచ్చు. కానీ సంచలనాలు స్రుష్టించడం, వార్తల్లో నలగడంలో ప్రధాన పార్టీలకు ఏమాత్రం తీసిపోదు. తాజాగా స్క్రీనింగ్ కమిటీ పేరిట [more]
;
జనసేన పార్టీ ఏపాటి విజయం సాధిస్తుందన్న విషయంలో సందేహాలుండవచ్చు. కానీ సంచలనాలు స్రుష్టించడం, వార్తల్లో నలగడంలో ప్రధాన పార్టీలకు ఏమాత్రం తీసిపోదు. తాజాగా స్క్రీనింగ్ కమిటీ పేరిట [more]
జనసేన పార్టీ ఏపాటి విజయం సాధిస్తుందన్న విషయంలో సందేహాలుండవచ్చు. కానీ సంచలనాలు స్రుష్టించడం, వార్తల్లో నలగడంలో ప్రధాన పార్టీలకు ఏమాత్రం తీసిపోదు. తాజాగా స్క్రీనింగ్ కమిటీ పేరిట పవన్ అయిదుగురు సభ్యులతో కూడిన ఒక బ్రుందాన్ని నియమించారు. వీరికి అప్పగించిన బాధ్యత అత్యంత కీలకమైనది. సామాజిక వర్గ రీత్యా, రాజకీయం పరంగా జనసేనానితో చాలామందికి సాన్నిహిత్యం ఉంది. కేవలం వీరికి మాత్రమే వడపోత బాధ్యతలు అప్పగించడంలో అసలు విషయమేమిటని జనసేనలో చర్చ మొదలైంది. వివిధ నియోజకవర్గాల్లో పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్నవారి అర్హతలను వడపోసి నిగ్గు తేల్చాల్సిన కర్తవ్యాన్ని వీరిపై ఉంచారు. నిజంగానే వారందరూ సమర్థులా? లేక పవన్ కూడా కోటరీ వలలో చిక్కుకుంటున్నారా? అన్న సందేహం రాజకీయవర్గాలను వెన్నాడుతోంది. పార్టీ పేరు, తన పేరు చెప్పి నియోజకవర్గాల్లో పైరవీలకు పాల్పడకుండా చాలా జాగ్రత్తగా, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న పవన్ ఈవిషయంలో తొందరపడ్డారేమో అన్న అనుమానాలను పార్టీ లోని దిగువశ్రేణి నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద కమిటీ ప్రకటన ఆసక్తితోపాటు పార్టీలో కొంత చర్చకూ దారితీస్తోంది.
విశ్వాసపాత్రులా..?
స్క్రీనింగ్ కమిటీ ఎంపికలో నమ్మకానికే పెద్దపీట వేసినట్లుగా చెప్పుకోవాలి. అరహం ఖాన్ పవన్ కు సలహాలు, సూచనలు ఇవ్వడంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటారు. పార్టీలో ఉండే వ్యక్తులపై వచ్చే విమర్శలు, ఆరోపణలపై విచారణ జరిపి తగు చర్యలకు సిఫార్సులు చేస్తుంటారు. పార్టీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి . పవన్ కు ఆయన మాటంటే గురి. మహేందర్ రెడ్డి వ్యక్తిగతంగా పవన్ కు అత్యంత సన్నిహితుడు. పవన్ మూడో పెళ్లికి సంబంధించి రిజిస్ట్రార్ కార్యాలయంలో సాక్షి సంతకాన్ని చేసేంత చనువు ఉంది. జనసేనాని చెప్పినమాటలను వేదంగా భావిస్తుంటాడు. చెప్పింది చేసి రావడమే తప్ప ఎదురుప్రశ్నించడం ఎరగడు అని మహేందర్ రెడ్డి గురించి పార్టీలో చెబుతుంటారు. హరిప్రసాద్ మీడియా హెడ్ గా , రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అధినేతకు చేరువగా ఉన్నప్పటికీ సాధ్యమైనంత లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేయడం ఈయన ప్రత్యేకత . నిజానికి ప్రజారాజ్యం సమయంలోనే ఆపార్టీతో అనుసంధానం కావాల్సి ఉన్నప్పటికీ రాజకీయాసక్తి లేకపోవడంతో దూరంగా ఉండిపోయారు. పవన్ పై వ్యక్తిగత అభిమానంతో మీడియాను విడిచిపెట్టి జనసేనతో కలిసి పనిచేస్తున్నారు. మాదాసు గంగాధర్ మాజీ ఎమ్మెల్సీ కావడానికి తోడు రాజకీయంగా ప్రస్తుత బ్రుందంలో అనుభవజ్ణుడు. సూటిగా మాట్టాడే తత్వం కారణంగా పవన్ అభిమానాన్ని చూరగొన్నారు. శివశంకర్ సివిల్ సర్వీసులో ఉన్నత పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి పవన్ తో టైఅప్ అయ్యారు. మొత్తమ్మీద వీరంతా విశ్వాసపాత్రులు కావడంతోనే జనసేనాని పెద్దపీట వేశారని చెప్పుకోవాలి.
ఒత్తిడి తట్టుకొనే వ్యూహం…?
జనసేన పార్టీలో టిక్కెట్లకు సంబంధించి ఇప్పటికే ఒత్తిడి మొదలైంది. పార్టీ ఇంకా నిర్మాణ దశను పూర్తి చేసుకోలేదు. గ్రామ, మండల స్థాయి కమిటీల సంగతి పక్కన పెట్టినా నియోజకవర్గాల్లోనూ నాయకత్వం ఎవరిదంటే బదులు చెప్పలేని పరిస్థితి. అయినప్పటికీ టిక్కెట్ల వెంపర్లాట మొదలైంది. పవన్ కు సినిమా రంగంలో పరిచయాలతోపాటు ప్రజారాజ్యంలో పనిచేసిన నాయకులతో సంబంధాలు బాగానే ఉన్నాయి. యువరాజ్యం అధ్యక్షునిగా అప్పట్లో పవన్ వ్యవహరించారు. ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి తాము నష్టపోయామని ఆయన వద్ద మొరపెట్టుకుంటున్న వారి సంఖ్య వందల్లో ఉంది. తమకు ఈసారి చాన్సు ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలలో ఈ తరహా ధోరణి ఎక్కువగా ఉంది. పవన్ కు సైతం వారిపై సానుభూతి ఉంది. కానీ రకరకాల సమీకరణలపై ఆధారపడి మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలి. ఆర్థిక వనరులు, సామాజిక సంతులనం, ప్రజల్లో ఆదరణ వంటివాటిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా తన పాత్రను కుదించుకుని స్క్రీనింగ్ కమిటీని రంగంలోకి దించడం ద్వారా ఒత్తిడి నుంచి పూర్తిగా బయటపడేందుకు పవన్ యత్నిస్తున్నారు. అల్టిమేట్ గా టిక్కెట్ల ఫైనలైజేషన్ తనపైనే ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ ఎంపిక కమిటీ, జనరల్ బాడీల రూపంలో పూర్తి పారదర్శకతకు చోటు కల్పించనున్నట్లు జనసేనాని చాటిచెప్పాలనుకుంటున్నారు.
పనిమంతులా..? ప్రజాస్వామ్యమా..?
స్క్రీనింగ్ కమిటీకి ఎంపిక చేసిన అయిదుగురూ విధేయులు, విశ్వాసపాత్రులు అనడంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు. తానొక్కడే ఏకచ్ఛత్రాధిపత్యం కింద నిర్ణయాలు తీసుకుని ప్రజలపై, పార్టీపై వాటిని రుద్దకుండా పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా అభ్యర్థుల ఎంపిక సాగుతోందన్న భావాన్ని వ్యాపింపచేయవచ్చు. కానీ పార్టీ అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని ఈ కమిటీ సభ్యులు నిలబెట్టుకుని న్యాయం చేయగలరా? అంటే పెదవి విరుస్తోంది ఒక వర్గం. రాజకీయంగా వారికుండే అనుభవం, ప్రజలతో సంబంధాలు, పార్టీతో మమైకం కావడం వంటి అనేక విషయాలు ప్రశ్నార్థకమవుతున్నాయి. వీరిలో ఎవరూ పెద్దగా ప్రజలతో తిరిగి కలిసి పనిచేసినవారు కాదు. రాజకీయాల లోతుపాతులను అపోశన పట్టినవారు కాదు. అందులోనూ కమిటీలో ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. మిగిలిన ఇద్దరు తెలంగాణకు చెందినవారు. ఒక్క మహిళ కమిటీలో లేరు. బ్యాలెన్సు పాటించలేకపోయారు. ఒకవైపు అనుభవ రాహిత్యం, మరోవైపు సామాజిక సంతులన లేమి ఈ కమిటీకి ప్రధాన లోపంగా చెప్పుకోవాలి. కేవలం విధేయత, విశ్వాసపాత్రత అనేవి రాజకీయాధికారాన్ని తెచ్చిపెట్టవు. పొలిటికల్ అక్యూమెన్షిప్ తో అభ్యర్థులను ఎంపిక చేసినప్పుడే విజయావకాశాలు మెరుగుపడతాయి. కమిటీ సభ్యులకే ఆ అర్హతలు సంపూర్ణంగా లేనప్పుడు పార్టీ ప్రస్థానమేమిటనే విమర్శలూ వినవస్తున్నాయి.