వకీల్ సాబ్ సంజాయిషీలో నిజమెంత?

పన్నుల వడ్డింపు, ప్రయివేటీకరణ విషయంలో ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారనే సెట్టైర్లు ఎదుర్కొంటున్నారు కమలనాథులు. తమ భాగస్వాముల విషయంలోనూ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ [more]

Update: 2021-03-14 15:30 GMT

పన్నుల వడ్డింపు, ప్రయివేటీకరణ విషయంలో ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారనే సెట్టైర్లు ఎదుర్కొంటున్నారు కమలనాథులు. తమ భాగస్వాముల విషయంలోనూ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలో బీజేపీ పోటీ పడటం. ఈ ప్రకటనను స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేతనే చేయించింది బీజేపీ అగ్రనాయకత్వం. ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన పార్టీ శ్రేణులు ఒక్కసారిగా నిరాశ, నిస్పృహలకు లోనయ్యాయి. గెలుపోటముల సంగతి పక్కన పెడితే బీజేపీకి అండదండగా నిలుస్తున్న పార్టీకి శూన్య హస్తాలు, శుష్క వాగ్దానాలు మిగులుతున్నాయి. ఇదే భావన పవన్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఏర్పడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందని రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు చెబుతూ వచ్చారు. అది సాధ్యం కాదని, బీజేపీ యే పోటీకి దిగుతోందని స్పష్టమైపోయింది. తమ అధినేత చేసిన ప్రకటన కూడా పార్టీ పరమైన నిస్సహాయతనే వెల్లడించింది.

సంజాయిషీ సంతృప్తినిస్తుందా?

తిరుపతిలో బీజేపీ పోటీపై పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు లేఖ రాశారు. బీజేపీ విజయానికి కృషి చేయాలన్న ఆయన పిలుపులో అనేక అనుమానాలు తొంగి చూశాయి. పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురవుతారన్న విషయం ఆయన లేఖతోనే స్పష్టమైంది. లేఖ సారాంశమంతా సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టుగానే కొనసాగింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీ పోటీకి అంగీకరించాల్సి వచ్చిందన్న విషయాన్ని చెప్పడానికి పవన్ ప్రయత్నించారు. హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నద్దాతో సాగిన లోతైన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడం విడ్డూరం. తిరుపతిలో బీజేపీ పోటీ చేయాల్సిన అవసరాన్నివారు వివరించారనేది పవన్ వాదన. అసలు తిరుపతిలో జనసేన పోటీ చేయాల్సిన అవసరాన్ని వివరించి పవన్ బీజేపీని ఎందుకు ఒప్పించలేకపోయారన్నది ప్రశ్న. సామాజిక బలాబలాలు, పార్టీ క్యాడర్ లో నెలకొని ఉన్న అసంతృప్తి, బీజేపీకి పెద్దగా పట్టు లేకపోవడం వంటి విషయాలను పవన్ సమర్థంగా చెప్పలేకపోయారనే భావించాలి. తమ అజెండానే బీజేపీ తిరుపతిలో అమలు చేస్తోంది. పార్టనర్ పవన్ తమ పార్టీకి దక్కాల్సిన ప్రాధాన్యాన్ని రాబట్టుకోవడంలో విఫలమయ్యారు.

జూనియర్ పార్టనర్ గా…

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయితే తిరుపతిని అభివృద్ధి చేస్తుందన్న పవన్ వాదన అర్థరహితం. భాగస్వామి ప్రాతినిధ్యం వహించినా, వేరే ప్రతిపక్షం అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుంది. శాంతిభద్రతల విషయంలో అరాచకాలను అరికట్టాలంటే బీజేపీ పోటీ పడాలన్న పవన్ వాదన కూడా సహేతుకం కాదు. బీజేపీ, జనసేన కలిసికట్టుగా ప్రభుత్వ అరాచకాలు, దమన కాండపై ప్రతిఘటించాలి. అంతే తప్ప తిరుపతిలో పోటీకి , శాంతిభద్రతలను పోల్చడం బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టడం వంటిదే. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఆపార్టీ బలం అంతంతమాత్రమే. తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టంగా మారింది. అటు వైసీపీ, ఇటు టీడీపికి ఉన్న బలహీనతల కారణంగా ఒక ప్రబలమైన శక్తిగా కనిపిస్తోంది. ప్రజల్లో పలుకుబడి పెద్దగా లేదు. జనసేన ను ఆసరాగా చేసుకుంటూ ఎదగాలని చూస్తోంది. అయితే జనసేనను ఎదగకుండా చేసి తాను పైచేయి సాధించాలన్న ఎత్తుగడలు స్వార్థ పూరితమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

శ్రేణుల ఆగ్రహం…

బీజేపీతో పొత్తులో జనసేన రాజీ పడిపోతోందని జనసేన శ్రేణులు అంతర్గతంగా ఆవేదన చెందుతున్నాయి. తిరుపతి నుంచి శాసనసభ్యునిగా గతంలో చిరంజీవి ప్రాతినిధ్యం వహించారు. బలిజ సామాజిక వర్గం ప్రభావశీలంగా ఉంది. ఇటీవల ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు సమావేశమై జనసేన పోటీ చేయాలనే డిమాండ్ పై చర్చించారు. ఆర్థికంగా పార్టీకి అండగా ఉండాలనే నిర్ణయమూ తీసుకున్నారు. ఒకవేళ బీజేపీ మోకాలడ్డితే ఎన్నికలలో తమ వర్గం ఓట్లు ఎవరికీ వేయకుండా దూరంగా ఉండాలనుకుంటున్నట్లు సమాచారం. ఇంత జరిగినా మళ్లీ బీజేపీయే పోటీ చేయాలనుకోవడం జనసైనికుల్లో అసంతృప్తిని పతాక స్థాయికి తీసుకెళుతోంది. 1999లో తిరుపతిలో బీజేపీ నెగ్గిన సందర్భం వేరు. అప్పట్లో టీడీపీతో పొత్తు ప్రభావం, కార్గిల్ యుద్ధం, వాజపేయిపై సానుభూతి వంటివి ఎన్నికను ప్రభావితం చేశాయి. ప్రస్తుతం వైసీపీ చాలా బలంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయినప్పటికీ హైందవ వేషధారణలో తిరుపతి పర్యటనను తరచూ చేస్తున్నారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి సొంతజిల్లా. టీడీపికి కూడా మంచి పట్టు ఉన్న ప్రాంతం. ఈ పరిస్థితుల్లో బలమైన పోటీ ఇవ్వాలంటే జనసేన రంగంలోకి దిగడమే సమంజసమని అభిమానుల వాదన. ఏదేమైనా పవన్ ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా జనసేన అభిమానుల్లో నెలకొన్న ఆగ్రహం అంత తొందరగా చల్లారేలా కనిపించడం లేదు. తిరుపతి ఎన్నికల్లో బీజేపీకి చిత్తశుద్దితో సహకరిస్తారా?అనేది సందేహమే.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News