కాపులందు ఆ కాపులు వేరయా ?

ప్రజా రాజ్యం పార్టీకి బలం బలహీనత కాపు సామాజిక వర్గమే అన్న అపవాదు ఉండేది. అదే తీరులో జనసేన కు ఈ మార్క్ మరింతగా పడటం పవన్ [more]

;

Update: 2021-04-11 08:00 GMT

ప్రజా రాజ్యం పార్టీకి బలం బలహీనత కాపు సామాజిక వర్గమే అన్న అపవాదు ఉండేది. అదే తీరులో జనసేన కు ఈ మార్క్ మరింతగా పడటం పవన్ పార్టీకి పెద్ద మైనస్ గానే మారింది. గోదావరి జిల్లాలలో కాపు సామాజికవర్గం బిసి సామాజిక వర్గంతో దాదాపు సమానంగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏ పార్టీ వారైనా ఈ రెండు సామాజికవర్గాల వారికే అత్యధిక సీట్లను కేటాయిస్తారు. అధికారపార్టీలో ఉండేవారు అటు కాపు ఇటు బిసి లకు బెర్త్ లు కేటాయించడం కూడా రివాజు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా జనసైనికుల హడావిడి చర్చనీయం అవుతుంది.

వకీల్ సాబ్ తో …

తాజాగా పవన్ కళ్యాణ్ చాలాకాలం తరువాత నటించి విడుదల చేసిన చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమా టిక్కెట్ల కోసం ఎప్పటిలాగే ఆయన అభిమానులు ఎగబడ్డారు. వాస్తవానికి రాజకీయాలు పక్కన పెడితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు అన్ని కులాల్లో అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. రాజకీయ పరంగా వారి వెనుక నిలబడనప్పటికీ సినిమాల విషయంలో వీరు అందరిలాగే తొలిరోజే సినిమా చూసేందుకు క్యూ కడతారు. ఇలా క్యూ కట్టే టిడిపి, వైసిపి లో ఉన్న కాపు సామాజిక వర్గం వారిని ఇప్పుడు చాలా చోట్ల జనసైనికులు కాపులే కాదని టిక్కెట్లు అందకుండా చేస్తున్నారని అంటున్నారు. అలా ఇతర పార్టీల్లో ఉన్న కాపులను సోషల్ మీడియా లో అయితే బండబూతులే తిడుతూ ఉండటం ఎక్స్ ట్రా బోనస్ అంటున్నారు.

పవన్ దృష్టి పెట్టాలిసిందే …

వకీల్ సాబ్ చిత్రం విడుదల సందర్భంగా జనసేన అభిమానుల్లో క్రమశిక్షణ లోపం మరోసారి బయటపడింది. చాలా ప్రాంతాల్లో టిక్కెట్ల వివాదాలు ధియేటర్ల దగ్గర మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో గొడవపడటం ఇలా పలు చిల్లర గొడవలు ప్రచార మాధ్యమాల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో రోడ్డున పడ్డాయి. ఒక మంచి సామాజిక ఇతివృత్తాన్ని కథ గా ఎంచుకుని ప్రజల్లో మరింత ఇమేజ్ పెరిగే విధంగా పవన్ కళ్యాణ్ నానా కష్టాలు పడుతుంటే కొందరు తుంటరి అభిమానులు చేసే పనులు జనసేన పై తీవ్ర ప్రభావం చూపేలా మారడం ఇతర సామాజిక వర్గాలతో బాటు కాపు సామాజిక వర్గంలో కొందరిని పవర్ స్టార్ కు దూరం చేసేలా ఉండటం పవన్ పార్టీకి ముప్పుగా పరిణమిస్తున్నాయి. అన్న మెగాస్టార్ నుంచి తమ్ముడు పవర్ స్టార్ వరకు స్థాపించిన రెండు పార్టీల్లో ఈ క్రమశిక్షణ లోపాలే నిర్మాణాత్మకంగా రాజకీయాలను కొనసాగించలేని దుస్థితి అధినేతలకు కలిగిస్తున్నాయి. మరి పవన్ దృష్టికి ఈ వ్యవహారాలు వెళ్ళే ఉంటాయి. వాటిని సరిదిద్దుకుని జనసేనను పవన్ దారిలో పెడతారో లేక చూసి చూడనట్లు వదిలేస్తారా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News