Pawan kalyan : యాక్షన్ ప్లాన్ అట.. ఏడేళ్ల నుంచి లేనిది?

ఉదయం నుంచి ఒక వర్గం మీడియా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఫుల్లుగా ఫోకస్ చేస్తుంది. విజయవాడలో జరుగుతున్న పార్టీ సమావేశంలో కీలక పరిణామాలు చోటు [more]

;

Update: 2021-09-29 06:30 GMT

ఉదయం నుంచి ఒక వర్గం మీడియా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఫుల్లుగా ఫోకస్ చేస్తుంది. విజయవాడలో జరుగుతున్న పార్టీ సమావేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయంటూ ఊదరగొడుతున్నారు. ప్రభుత్వంపై పోరాటానికి పవన్ కల్యాణ్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారని, ఈ సమావేశంలో ఖరారు చేస్తున్నారంటూ చెవులు అదిరపోయేలా లైవ్ అప్ డేట్స్ ఇస్తున్నారు. కాపు సామాజికవర్గం మొత్తం పవన్ కు అండగా నిలబడిందని మైకుల్లో హోరెత్తిస్తున్నారు.

కార్యాచరణ కోసం…

నిజానికి పవన్ కల్యాణ్ సినిమాల వ్యవహారం పక్కన పెడితే రాజకీయాల్లో ఆయన వ్యవహారశైలి ఎవరికీ తెలియంది కాదు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఏడేళ్లవుతుంది. ఈ ఏడేళ్లలో ఆయన చేసిందేమిటి? ఆయన పర్యటనలేమిటి? ఆయన కార్యాచరణ ఏమిటి? అన్నది అందరూ చూస్తూనే ఉన్నారు. ఏనాడూ ఒక అంశంపై జనసేనాని పోరాటం చేసిందేమీ లేదు. అప్పడెప్పుడో ఉద్దానం సమస్యపై ఆయన పోరాటం మూడు రోజులు సాగింది.

పార్టీ పెట్టిన తర్వాత….

ఆ తర్వాత మామూలే. 2019 ఎన్నికలకు ముందు కూడా పవన్ కల్యాణ‌్ పార్టీని బలోపేతం చేసిందేమీ లేదు. మండల స్థాయిలో కూడా పార్టీ జెండాను తీసుకెళ్లలేకపోయారు. ఫలితాలు 2019లో చూశాం. ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సొంత సామాజికవర్గం బలంగా ఉన్న జిల్లాల్లోనూ పవన్ కల్యాణ్ ప్రభావం చూపలేకపోయారు. ఇక ఈయన పోరాటం గురించి చెప్పాలంటే… అమరావతి రాజధాని రైతుల వద్దకు వెళ్లారు. వారితో పెరుగన్నం తిన్నారు. రాజధాని కోసం అండగా ఉంటానని మాట ఇచ్చారు. బీజేపీతో కలసి పాదయాత్ర చేస్తానని చెప్పారు.

పోరాటమంటూ వచ్చి….

కానీ ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయారు. రాజధాని విషయంపై బీజేపీ కేంద్ర పెద్దలతో కనీసం పవన్ కల్యాణ్ మాట్లాడే ప్రయత్నం చేయలేదని రైతులు గుర్రుగా ఉన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తున్నా, తాను పోటీ చేసి ఓటమి పాలయిన గాజువాక నియోజకవర్గం పరిధిలో ఉన్నా అక్కడకు వెళ్లి కార్మికులకు మద్దతు తెలిపింది లేదు. తడవకోసారి బయటకు వచ్చి హల్ చల్ చేసి తిరిగి హైదరాబాద్ కు వెళ్లడం పవన్ కల్యాణ్ కు మామూలేనని వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ పోరాటం పెద్ద కామెడీ అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఒక్కరోజు మాత్రం ఒక వర్గం మీడియాకు పవన్ కల్యాణ‌్ ఒక టీఆర్పీ రేటింగ్ ఇస్తారంటూ ఛలోక్తులు విసురుతున్నారు.

Tags:    

Similar News